For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అకస్మాత్తుగా బరువు తగ్గితే, ఎదురయ్యే ప్రమాధకర ఆరోగ్య సమస్యలు

|

ప్రపంచం మొత్తం 'బరువు' మాట వింటేనే భయపడుతోంది! ఎక్కడ చూసినా వూబకాయం వూబిలో కూరుకుపోయి.. బరువు తగ్గాలని తంటాలుపడే వారే. ఉండాల్సిన దానికంటే ఎక్కువున్నవారు కచ్చితంగా బరువు తగ్గటం, తగ్గేందుకు ప్రయత్నం చెయ్యటం అవసరమే. కానీ మనమే ప్రయత్నమూ చెయ్యకుండా.. మనవైపు నుంచి ఎటువంటి శ్రమా లేకుండానే బరువు తగ్గుతున్నామంటే మాత్రం అది మంచి లక్షణం కాదు!

బరువు తగ్గిపోవటమన్నది శరీరంలో తలెత్తిన తీవ్ర అనారోగ్యానికి సూచిక! క్షయ, క్యాన్సర్‌ వంటి తీవ్రస్థాయి సమస్యల్లో ప్రధానంగా కనబడే లక్షణం... ఈ బరువు తగ్గటమే! కాబట్టి బరువు తగ్గిపోతున్నట్టు అనుమానం వస్తే తక్షణం వైద్యులను సంప్రదించి.. అందుకు కారణాలను అన్వేషించటం అత్యవసరం!

బరువు తగ్గిపోతుండటమన్నది వైద్యపరంగా చాలా తీవ్రమైన అంశం! బరువు ఎక్కువ ఉన్నవారు, బరువు తగ్గాలని భావించేవారు కావాలని డైటింగ్‌, వ్యాయామాల వంటివి ఎక్కువ చేస్తుంటారు. వారు బరువు తగ్గటం సహజం. అయితే అలాంటి ప్రయత్నాలేవీ లేకుండానే చాలా వేగంగా.. అంటే నెలకు ఒక కిలోకన్నా, లేదా ఆర్నెల్లలో 5 కిలోలకన్నా ఎక్కువగా బరువు తగ్గిపోతుంటే తీవ్రమైన ఆరోగ్య సమస్య ఏదో తలెత్తిందని అనుమానించాలి.

మన వయసు, తీసుకునే ఆహారం, ఆరోగ్యం, శారీరక శ్రమ వంటి అంశాలన్నీ మన బరువును ప్రభావితం చేస్తాయి. సాధారణంగా ఒక వయసుకు వచ్చిన తర్వాత బరువు కాస్త అటూఇటూగా స్థిరంగా ఉంటుంది. అలాకాకుండా తగ్గిపోతోందంటే దాన్ని తప్పకుండా పట్టించుకోవాలి. ఆహారం సరిగా తీసుకోకపోవటం.. తిన్న ఆహారం వేగంగా ఖర్చైపోతుండటం.. కొన్నిసార్లు మలమూత్రాల ద్వారా గ్లూకోజు, ప్రోటీన్లు బయటకు వెళ్లిపోతుండటం.. ఇవన్నీ బరువు తగ్గటానికి దోహదం చేసే అంశాలు. చిన్నపేగులు, క్లోమగ్రంథుల్లో సమస్యలు తలెత్తినపుడు.. తిన్న ఆహారంలోని పోషకాలను మన శరీరం గ్రహించక ముందే అవి బయటకు వెళ్లిపోతుంటాయి. దీంతో పోషకాహార లోపం తలెత్తి బరువు తగ్గిపోతుంటారు. క్షయ వంటి తీవ్ర సమస్యల్లో ఆకలి తగ్గిపోయి, దానివల్ల కూడా బరువు తగ్గిపోతుంటారు. మానసిక ఒత్తిడి వలన బరువు పెరిగే మాట నిజమేగానీ.. ఇదే కొందరిలో బరువు తగ్గిపోయేందుకూ కారణమవుతుందని గుర్తించాలి.

ఒత్తిడి

ఒత్తిడి

వృత్తిపరంగా తీవ్రమైన మానసిక ఒత్తిడిని అనుభవించే వారు బరువు తగ్గిపోతారు. ఇదే కాదు, క్యాన్సర్‌, గుండెపోటు వంటి తీవ్రమైన వ్యాధుల బారినపడినప్పుడు కూడా మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. వీరిలో ఎఫినెఫ్రిన్‌, నార్‌ఎఫినెఫ్రిన్‌ వంటి రసాయనాలు విడుదల అవుతూ వీటి ప్రభావం కారణంగా శరీరంలోని కణజాలం, కండరాలు క్షీణిస్తుంటాయి. దీనివల్ల బరువు తగ్గిపోతుంటారు. మానసిక ఒత్తిడి వల్ల ఆహారపుటలవాట్లు, నిద్ర, మొత్తం జీవన విధానమే అస్తవ్యస్తమవుతుంది. ఫలితంగా ఆకలి, జీర్ణవ్యవస్థ వంటివన్నీ తీవ్రంగా ప్రభావితమై వేగంగా బరువు తగ్గటం, తీవ్రమైన అలసట వంటివి ముంచుకొస్తాయి. ఆధునిక కాలంలో 'బరువు పెరగటం'తో పాటు ఇది కూడా పెద్ద సమస్యగా పరిణమిస్తోంది.

హైపర్‌ థైరాయిడిజం

హైపర్‌ థైరాయిడిజం

థైరాయిడ్‌ హార్మోన్లు మన శారీరక, జీవక్రియలకు చురుకుదనాన్నిచ్చే హార్మోన్లు. ఒంట్లో ఈ హార్మోన్లు ఎక్కువైతే.. ఆకలి పెరుగుతుంది, జీవక్రియల వేగం పెరిగిపోతుంది. కేలరీల ఖర్చు పెరిగిపోయి.. కణజాలంలో శక్తి ఎక్కువగా ఖర్చైపోతుంటుంది. వీళ్లు ఆహారం ఎక్కువెక్కువే తింటుంటారు, అన్నం, పిండిపదార్థాలు, స్వీట్ల వంటివి అధికంగా తీసుకుంటూ ఉంటారు. అయినా బరువు తగ్గిపోతుంటారు! కాబట్టి ఇటువంటి లక్షణాలతో బరువు తగ్గుతుంటే తప్పనిసరిగా థైరాయిడ్‌ను అనుమానించాలి.

పేగుల్లో సమస్యలు

పేగుల్లో సమస్యలు

చాలారకాల జీర్ణసమస్యలు, పేగుల వ్యాధుల్లో బరువు తగ్గిపోవటమన్నది కనబడుతుంది. ఆకలి తగ్గిపోవటం, తిన్నది జీర్ణం కాకపోవటం, పేగుల్లో సమస్యల వల్ల పోషకాహార లోపం తలెత్తటం.. ఇవన్నీ బరువు తగ్గిపోయేందుకు కారణమవుతాయి. పేగుల్లో పుండ్లు-అల్సర్లు, పేగు పూత, వాపు, స్ప్రూ, అల్సర్లు మానిపోతూ పేగులు అతుక్కోవటం.. ఇలా పలురకాల పేగు సమస్యల్లో బరువు తగ్గిపోతుంటారు.

క్షయ

క్షయ

మన దేశంలో గ్రామీణ ప్రజలు బరువు తగ్గిపోతుండటానికి ముఖ్యమైన కారణం క్షయ. ఈ ఇన్ఫెక్షన్‌ సోకితే చాలామందిలో సాయంత్రానికల్లా కొద్దిపాటి జ్వరం వంటి లక్షణాలుంటాయి, కానీ కొందరిలో జ్వరం కూడా ఉండకపోవచ్చు. పైకి ఏ లక్షణాలూ కనబడవు, అయినా బరువు తగ్గిపోతుంటారు. క్షయ అంటే దగ్గు, కళ్లెపడటం వంటివీ ఉండాల్సిన పని లేదు. ఎందుకంటే క్షయ ఛాతీలోనే కాదు... చర్మం, పేగులు, ఎముకలు.. ఇలా శరీరంలోని ఏ అవయవానికైనా రావచ్చు. కాబట్టి బరువు తగ్గుతుంటే క్షయనూ అనుమానించాలి.

క్యాన్సర్లు

క్యాన్సర్లు

ఇతరత్రా ఎటువంటి లక్షణాలూ లేకుండా కేవలం బరువు తగ్గటం ఒక్కటే ఉందంటే క్యాన్సర్‌ అని అనుమానించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫెక్షన్లయితే సాధారణంగా జ్వరం వంటి ఏదో ఒక లక్షణాలుంటాయి. అలాగే జీర్ణ సమస్యలైతే వాంతుల వంటివి ఉండొచ్చు. ఇటువంటి లక్షణాలేమీ లేకుండానే రోగి బరువు తగ్గుతున్నారంటే ఎక్కడో క్యాన్సర్‌ ఛాయలేమైనా (అకల్ట్‌ మాలిగ్నన్సీ) ఉన్నాయా? అన్నది అనుమానించాలి.

మధుమేహం

మధుమేహం

మధుమేహం వస్తే మన రక్తంలో గ్లూకోజు శాతం ఎక్కువ అవుతుంది. రక్తంలోని ఆ గ్లూకోజు తనతో పాటు ఎక్కువగా నీటిని కూడా బయటకు తీసుకుపోతుంటుంది. ఫలితంగా ఒంట్లో నీటిశాతం తగ్గిపోయి మనిషి బరువు తగ్గుతారు. తర్వాత- రక్తంలో గ్లూకోజు అధికంగానే ఉంటున్నా శరీర కణజాలం దాన్ని సరిగా ఉపయోగించుకోదు కాబట్టి ఒంట్లో కండరాల క్షీణతా ఆరంభమవుతుంది. క్రమేపీ కండ తగ్గిపోతూ బరువు తగ్గుతారు. వీటివల్ల ఎంత తింటున్నాగానీ బరువు తగ్గిపోతుంటారు.బరువు తగ్గిపోయేలా చేసే రుగ్మతల్లో అతి ప్రధానమైంది మధుమేహం.

పురుగులు

పురుగులు

పిల్లలు ప్రత్యేకమైన లక్షణాలేవీ లేకుండా బరువు తగ్గుతున్నా, సరిగా బరువు పెరగకున్నా.. పేగుల్లో నులిపురుగు, నట్టల వంటివేమైనా ఉన్నాయేమో చూడాలి. గ్రామీణ ప్రాంత పిల్లల్లో ఈ సమస్య చాలా ఎక్కువ. వీటివల్ల వేగంగా బరువు తగ్గుతుంటారు.

 డిప్రెషన్‌

డిప్రెషన్‌

డిప్రెషన్‌తో బాధపడే వారికి ఆకలి, సరైన ఆహారం లేకపోవటం వల్ల బరువు తగ్గిపోతుంటారు. ముఖ్యంగా సరైన శ్రద్ధ, ఆప్యాయత కరవై డిప్రెషన్‌కు లోనయ్యే వృద్ధులు, వాళ్లు వాడే రకరకాల మందులు, దంతసమస్యల వంటివన్నీ బరువు తగ్గటానికి కారణాలవుతాయి.

హెచ్‌ఐవీ

హెచ్‌ఐవీ

హెచ్‌ఐవీ సోకినప్పుడు వేగంగా బరువు తగ్గిపోయే అవకాశాలుంటాయి. బరువు తగ్గటం, శరీరం శుష్కించటం దీనిలో ఎక్కువగా కనబడతాయి.

 క్లోమం

క్లోమం

మద్యం, వంశపారంపర్యం, కొలెస్ట్రాల్‌ ఎక్కువుండటం వంటికారణాల వల్ల క్లోమగ్రంథి ప్రభావితమై దీర్ఘకాలిక పాంక్రియాటైటిస్‌ రావచ్చు. దానివల్ల బరువు తగ్గుతారు.

లివర్‌

లివర్‌

కాలేయం 'సిరోసిస్‌' బారినపడినపుడు కూడా ఆకలి తగ్గిపోయి అన్నం సరిగా జీర్ణం కాక.. బరువు తగ్గుతారు.

అనొరెక్సియా

అనొరెక్సియా

'జీరో సైజ్‌' పట్ల కాంక్ష, సన్నగా ఉండాలన్న విపరీతమైన ధ్యాస, అనరెక్సియో నెర్వోసా, బులీమియా వంటి మానసిక సమస్యల్లో విపరీతంగాబరువు తగ్గిపోతారు.

Story first published: Tuesday, January 27, 2015, 10:48 [IST]
Desktop Bottom Promotion