For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైబీపిని నిర్లక్ష్యం చేస్తే..తలెత్తే ప్రాణాంతక సమస్యలు..

|

మనం సరిగా పట్టించుకోవటం లేదుగానీ... అధిక రక్తపోటు..( హైబీపీ).. అతి పెద్ద ఆరోగ్య సమస్య! రక్తపోటును కచ్చితంగా నియంత్రణలో పెట్టుకోకపోతే.. మన శరీరంలో అత్యంత కీలకమైన రక్తనాళాలను ఇది తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఫలితంగా ఆపాదమస్తకం.. మెదడు నుంచి కాళ్ల వరకూ.. ఎన్నో ప్రమాదకర సమస్యలు ముంచుకొస్తాయి. వీటిలో చాలాభాగం ప్రాణాంతకంగానూ పరిణమిస్తాయి. అయినా చాలామందికి అసలు హైబీపీ ఉన్న విషయమే తెలియకపోవటం.. లోలోపల అది కీలక అవయవాలను కబళించేస్తుండటం.. ఇప్పుడు మన సమాజం ఎదుర్కొంటున్న పెను సమస్య. హైబీపీ ఉన్నట్టు తెలిసినవాళ్లు కూడా.. 'ఆ.. ఏదో కొంచెం పెరిగింది, మైల్డ్‌ బీపీ ఉంది..' అనుకుంటూ బీపీని తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ బీపీ... ఉండాల్సిన దానికంటే కాస్త పెరిగినా ముప్పు ముప్పే. పైగా అగ్నికి ఆజ్యంలా దీనికి మధుమేహం, హైకొలెస్ట్రాల్‌ వంటివి తోడైతే ఇక జరిగే నష్టం అపారం!

నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్యల్లో ముఖ్యమైనది అధిక రక్తపోటు (హైబీపీ). ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 కోట్ల మందికి హైబీపీ ఉందని.. 2025 నాటికి మొత్తం ప్రపంచ జనాభాలో దాదాపు మూడోవంతు మంది (150 కోట్లు) దీని బారినపడొచ్చని అంచనా వేస్తున్నారంటే ఇదెంత పెద్ద సమస్యో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిజానికి దీన్ని 'సైలంట్‌ కిల్లర్‌'.. అంటే 'కానరాని ముప్పు' అనుకోవచ్చు. ఎందుకంటే హైబీపీ వచ్చినా చాలాకాలం పాటు పైకేమీ తెలియదు. చాలామంది బీపీ ఉంటే కళ్లు తిరుగుతాయి, తలనొప్పి వస్తుంది.. నీరసంగా ఉంటుందని రకరకాలుగా భావిస్తుంటారుగానీ అవన్నీ వట్టి అపోహలే. బీపీ తీవ్రంగా పెరిగితే నడుస్తున్నప్పుడు ఆయాసం, తలనొప్పి, కళ్లు తిరగటం వంటి కొన్ని లక్షణాలు కనబడొచ్చుగానీ.. బీపీ ఓ మోస్తరుగా పెరిగి ఉంటే పైకి ఎలాంటి లక్షణాలూ కనబడవు. కానీ లోపల జరగాల్సిన నష్టం మాత్రం 'సైలెంట్‌'గా జరిగిపోతుంటుంది. పైగా- హైబీపీ కారణంగా తలెత్తే దుష్ప్రభావాలు కూడా వెంటనే బయటపడేవి కావు. దీన్ని నిర్లక్ష్యం చేసేకొద్దీ క్రమేపీ అది గుండె పోటు, పక్షవాతం, మూత్రపిండాల వైఫల్యం వంటి తీవ్ర సమస్యలను తెచ్చిపెడుతుందని మర్చిపోకూడదు.

హైబీపీని దీర్ఘకాలం గుర్తించకపోవటం, నిర్లక్ష్యం చేయటం వల్ల తలెత్తే సమస్యలన్నీ తీవ్రమైనవే.

గుండెకు ముప్పు

గుండెకు ముప్పు

సకాలంలో గుర్తించకపోతే ఆయువు తగ్గుతుంది. గుండె పరిమాణం పెరిగి, దాని సామర్థ్యం కోల్పోవడం. కరోనరీ ఆర్టరి డిసీజ్‌. అంటే గుండెకు సరఫరా చేసే రక్తనాళాలు కుంచించుకుపోవడం, తద్వార గుండెపోటుకు దారితీయడం.

బ్రెయిన్ స్ట్రోక్ లేదా బ్రెయిన్ హెమరేజ్

బ్రెయిన్ స్ట్రోక్ లేదా బ్రెయిన్ హెమరేజ్

బ్రెయిన్‌ హెమరేజ్‌. అంటే మెదడులోని రక్తనాళాల చిట్లి రక్తస్రావం జరిగి, పక్షవాతం వస్తుంది. కొన్ని సందర్భాల్లో మరణం కూడా సంభవిస్తుంది.

బ్రెయిన్‌ రక్తనాళాల్లో ఇరుకుగా మారి (గడ్డకట్టడం) త్రాంబోసిస్‌ వల్ల పక్షవాతం రావడం. పక్షవాతం కేసుల్లో సుమారు 50%, గుండెపోటు, రక్తనాళాల సమస్యల్లో సుమారు 50 శాతం హైబీపీ వల్ల సంభవిస్తున్నవే.

కంటి చూపు మందగించడం

కంటి చూపు మందగించడం

కంటిలో రక్త స్రావం జరిగి, చూపు మంద గించడం. కంటిలోని కంటినరం ఉబ్బి, కళ్లు కనిపించక, అంధత్వం రావడం. ఒక్కోసారి ఫిట్స్‌ కూడా రావొచ్చు.

కిడ్నీ సమస్యలు

కిడ్నీ సమస్యలు

చాలాకాలంగా హైబీపి ఉంటే మూత్రపిండాలు (కిడ్నీలు) కూడా పాడవుతాయి. మన దేశంలో నానాటికీ మూత్రపిండాల సమస్యలు పెరిగిపోతుండటానికి మధుమేహం, హైబీపీలే ప్రధాన కారణాలు.

డయాబెటిస్

డయాబెటిస్

హైబీపీ, మధుమేహం రెండూ తోడుదొంగల్లాంటివి. మధుమేహుల్లో దాదాపు నాలుగింట మూడొంతుల మందికి హైబీపీ ఉంటుంటే.. హైబీపీ ఉన్నవారిలో నాలుగో వంతు మందికి మధుమేహం ఉంటోంది. ఈ రెండూ ఉన్నవారికి దుష్ప్రభావాలన్నీ చాలా వేగంగా ముంచుకొచ్చే ప్రమాదం ఉంటుంది.

జీవనశైలి మార్పులు: అందరికీ తప్పవు

జీవనశైలి మార్పులు: అందరికీ తప్పవు

వీటన్నింటికీ హైబీపీనే మూలం. అయితే ఈ సమస్యలన్నీ ఒక్కసారిగా వచ్చేవి కావు. హైబీపీ కొన్నేళ్లపాటు నియంత్రణలో లేకపోతే క్రమేపీ కొన్ని సంవత్సరాల్లో ఇవన్నీ పెరుగుతుంటాయి. ఇన్ని రకాల ముప్పులు పొంచి ఉంటున్నా దీని గురించి సమాజంలో అవగాహన తక్కువగా ఉండటం పెను సమస్యగా పరిణమిస్తోంది.

ఉప్పు

ఉప్పు

ఆహారంలో ఉప్పు ఎక్కువగా ఉండటం కచ్చితంగా బీపీని పెంచుతుంది. ఉప్పు తక్కువ తినే సమాజాల్లో హైబీపీ సమస్య తక్కువగా ఉండటమే దీనికి తార్కాణం. ఆహారంలో ఉప్పు తగ్గించటం చాలా అవసరం. సామాజికంగా కూడా ఈ ప్రయత్నం జరగాలి. ఊరగాయ పచ్చళ్లు, అప్పడాలు, వడియాలు, రడీమేడ్‌ ఆహారపదార్థాలు.. ఇలా అన్నింటా ఉప్పు చాలా ఎక్కువగా ఉంటుందని మర్చిపోవద్దు. ఉప్పు తగ్గించగలిగితే బీపీ దానంతట అదే కొంతకాలానికి, కొంతైనా తగ్గే అవకాశం ఉంటుంది.

పండ్లు

పండ్లు

ఆహారంలో పండ్లు, కూరగాయలు సమృద్ధిగా తీసుకుంటే బీపీ తగ్గే అవకాశం ఉంటుంది. పండ్లలో పొటాషియం బీపీ తగ్గేందుకు బాగా దోహదం చేస్తుంది.

బరువు

బరువు

అధిక బరువు ఉంటే కచ్చితగా బీపీ పెరుగుతుంది. కాబట్టి తగినంత బరువు ఉండేలా చూసుకోవాలి. బరువు కొంత తగ్గించినా దానికారణంగా బీపీ కొంతైనా తగ్గుతుంది.

వ్యాయామం

వ్యాయామం

రోజూ లేదా కనీసం వారానికి నాలుగైదు సార్లు వేగంగా నడవటం వల్ల కొంతైనా దానంతట అదే బీపీ తగ్గుతుంది. వ్యాయామం తప్పనిసరి అని అందరూ గమనించాలి.

పొగ

పొగ

పొగ కచ్చితంగా బీపీ పెంచుతుంది. అంతేకాదు, అనేక విధాలుగా కూడా అనర్థదాయకం. కాబట్టి పొగ పూర్తిగా మానెయ్యాలి.

మద్యం

మద్యం

ఆల్కహాలు చాలా మితంగా విస్కీ, బ్రాండీ 1.5 ఔన్సులు (50-60 మిల్లీలీటర్లు మించకుండా) తీసుకోగలిగితే మంచిదేగానీ ఆ నియంత్రణలో ఉండలేనివారు దాని జోలికే పోకూడదు. అధికంగా మద్యం తీసుకోవటం హైబీపీకి ఒక ముఖ్యకారణం.

మందులు

మందులు

నొప్పినివారిణి మందులు, గర్భనిరోధక మాత్రలు, ముక్కు రంధ్రాలు బిగిసినప్పుడు తగ్గేందుకు వేసుకునే చుక్కల మందులు, స్టిరాయిడ్స్‌.. వీటన్నింటి వల్లా బీపీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వీటిని వైద్యుల సిఫార్సు, పర్యవేక్షణలోనే తీసుకోవాలి. అలాగే బీపీ చికిత్సకు వెళ్లినప్పుడు వాడుతున్న ఇతర మందుల వివరాలన్నీ వైద్యులకు చెప్పాలి. ఈ జాగ్రత్తలు అందరూ తీసుకోవాల్సినవి. వీటిని జీవనశైలిలో చేసుకోవాల్సిన మార్పులుగా చెబుతున్నప్పటికీ అందరూ అసలు వీటినే జీవన శైలిగాఅలవరచుకోవటం ఉత్తమం.

English summary

Dangers of neglecting High Blood Pressure

Blood Pressure when it is normal, it flows in the blood vessels in a normal way. If it increases or decreases, blood flow gets changed. With the result, certain problems crop up. If you observe some symptoms of blood pressure, head ache, heaviness in the chest, frequent passing of urine, dizziness, breathlessness, etc. happen.
Desktop Bottom Promotion