For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ యొక్క ప్రాధాన్యత!

|

మహాశివరాత్రి రోజున ప్రధానం మూడు పద్ధతుల్లో పరమేశ్వరుడిని అర్చించాలని పండితులు అంటున్నారు. వీటిలో మొదటిది శివార్చన, రెండోది ఉపవాసం, మూడోది జాగరణం. శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందే (ఐదు గంటలకు) నిద్రలేచి, స్నానాది కార్యక్రమాలను నెరవేర్చుకుని, పూజామందిరం, గృహాన్ని శుభ్రం చేసి.. పసుపు కుంకుమలు, రంగవల్లికలు. తోరణాలతో అలంకరించుకోవాలి. తెలుపు రంగు వస్త్రాలు ధరించి శివలింగాన్ని షోడశోపచారాలతో పూజించాలి. శివభక్తులతో పాటు ఇతరులకు అన్నదానం చేయాలి. శివాలయానికి వెళ్లి శివదర్శనం చేసుకోవాలి.

Maha Shivratri

"శివరాత్రి"లో రెండు ముఖ్యమైన అంశాలున్నాయి. ఒకటి: "ఉపవాసం", రెండు: "జాగరణ".

ఇక ఉపవాసం సంగతికొస్తే.. ఉపవాసమంటే శివరూపాన్ని ధ్యానిస్తూ, శివనామస్మరణం చేస్తూ.. "ఉప-సమీపే"- అతడికి (శివుడికి) దగ్గరగా ఉండటం. అంతేగాని ఆహారం తీసుకోకుండా శరీరాన్ని బాధపెట్టడం కాదని వరాహోపనిషత్తు పేర్కొంటోంది. ఇక జాగారం ఎలా చేయాలంటే..? శివరాత్రి నాటి సూర్యాస్తమం మొదలు మరునాడు సూర్యోదయం వరకు- నాలుగు జాములు నిద్రపోకుండా మేల్కొని ఉండటమని అర్థం. ఈ విధంగా జాగారం చేసినవారికి మళ్లీ తల్లి పాలు తాగే అవసరం లేకుండా, పునర్జన్మ నెత్తడం ఉండదని స్కాంద పురాణం చెబుతోంది.

జాగారం చేసే సమయంలో భగవన్నామ స్మరణం చేస్తే సమస్త పాపాలు హరిస్తాయని విశ్వాసం. శివరాత్రి నాడు చేసే జాగారాన్ని వ్యర్థ ప్రసంగాల తోనో, ఎటువంటి ప్రయోజనమూ లేని వాటిని చూస్తూనో కాకుండా శివనామాన్ని స్మరిస్తూ, శివగాథలను చదువుకుంటూ చేసినట్లైతే ఆ కాలాన్ని సద్వినియోగ పరచుకొన్నట్లతే పుణ్యం ప్రాప్తిస్తుందని పురోహితులు అంటున్నారు.

ఇక గృహంలో శివరాత్రి పూజ ఎలా చేయాలంటే...? లింగాకారము గల ప్రతిమను దివ్య సుందరంగా అలంకరించుకుని, ఆ లింగానికి తెలుపు పువ్వులు, వస్త్రాలతో అలంకరించుకోవాలి. పూజకు మారేడు ఆకులు, తెల్లపూలమాల.. నైవేద్యమునకు పొంగలి, బూరెలు, గారెలు, అరటి, జామకాయలను సిద్ధం చేసుకోవాలి. సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో పూజను ప్రారంభించి మరుసటి రోజు ఆరు గంటల వరకు శివధ్యానముతో పూజించాలి.

జాగారం చేసే వారు శివ అష్టోత్తరము, శివ పంచాక్షరీ స్తోత్రం, దారిద్ర్యదహన స్తోత్రం, శివసహస్రనామము, శివారాధన, శివపురాణములతో లేదా "ఓం నమఃశివాయ" అనే పంచాక్షరీతో 108 సార్లు మహేశ్వరుడిని పూజించడం మంచిది. అలాగే శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారామం, శివధ్యానములు చేయడం మోక్షఫలం చేకూరుతుందని పండితుల వాక్కు.

ఇంకా ఆలయాల్లో ఏకాదశరుద్రాభిషేకం, 108 బిందెలతో రుద్రాభిషేకం, శివ కళ్యాణం చేయిస్తే వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు, విశేష పుణ్యఫలితాలు దక్కుతాయని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత పరమేశ్వరుడిని మహాశివరాత్రినాడు భక్తి శ్రద్ధలతో పూజించి, ఆ దేవదేవుని అనుగ్రహం పొందండి.

English summary

The importance of the Fast on Maha Shivratri

On the auspicious occasion of Shivaratri, or Mahashivratri, Hindu devotees around the world observe Shivratri Vrat or Upvaas or fast. The fasting involves refraining from eating any food and not sleeping through out the night.
Story first published: Wednesday, February 26, 2014, 17:35 [IST]
Desktop Bottom Promotion