For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లల పెంపకంలో మెళుకువలు పాటించక పోతే...?

|

ప్రస్తుత కాలంలో పిల్లలంతా చాలా స్పీడ్‌ గా ఉంటున్నారు. చదువుల్లోనూ, ఆట పాటల్లోనూ చాలా ఫాస్టు గా ఉంటున్నారు. ఒకప్పుడు ప్రతీ ఇంట్లో నలుగురు, ఐదుగురు పిల్లలు ఉండేవారు. ఇప్పుడు న్యూక్లియర్‌ ఫ్యామిలీల కారణంగా ఒక్కరు తప్పితే ఇద్దరు పిల్లలే ఉంటున్నారు. వాళ్లకు ఆటా పాట అన్నీ తల్లిదండ్రులతోనే అవుతోంది. దీంతో గారాబం ఎక్కువ అవుతోంది. ఫలితంగా మొండిపట్టు, మంకుపట్టు తప్పనిసరి అవుతోంది. ఇటువంటి పిల్లలతో వ్యవహరించటం తలకు మించిన పని అవుతుంది. ఇటువంటి వారితో జాగ్రత్తగా వ్యవహరించాలని సదరన్‌ ఇల్లియోనిస్‌ యూనివర్శిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ అధ్యాపకులు సూచిస్తున్నారు. ఇటువంటి పిల్లలతో పట్టు విడుపుతో మెలగాలని చెబుతున్నారు.

పిల్లల పెంపకంలో మెళకువలు పాటించక పోతే విసుగుదల, చిరాకు పెరిగిపోతాయి. మానసికంగా ఆందోళన పెరిగి పోయి అనారోగ్యానికి కారణం అవుతుంటాయి. పెద్దలంతా ఒకప్పుడు పిల్లలే అని గుర్తుంచుకోవాలి. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణగా ఏ రకంగా పెంచాలి అనేది తెలసుకోవాలి. పట్టు విడుపులతో పిల్లల్ని మంచి మార్గంలో ఎలా తీసుకొని వెళ్లాలి అనేది తెలుసుకోవాలి. గతంలో ప్రతీ ఇంట్లో అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్య వంటి పెద్దలు ఉండే వారు కాబట్టి ఓర్పుతో అన్ని విషయాలు తెలియ చెప్పేవారు. కానీ రాను రాను న్యూక్లియర్‌ఫ్యామిలీలు వచ్చేశాక మంచి, చెడు నేర్పేవారు తక్కు వ అయ్యారు. దీంతో పిల్లల పెంపకం కత్తి మీద సాములా మారుతోంది.

పిల్లల పెంపకంలో మెళుకువలు ...!

స్నేహా వాతావరణంతో మెలగటం: పిల్లలు ఎప్పుడూ పిల్లలతోనే ఆడుకోవాలని కోరుకొంటారు. తోటి పిల్లలతో అనుకరించటం లేదా తోటి పిల్లలకు నేర్పించటం అంటే బాగా ఇష్టపడతారు. సరిగ్గా ఈ టెక్నిక్‌ నే పెద్దలు కూడా అనుసరించాలని చెబుతున్నారు. అంటే పిల్లలతో బాస్‌ మాదిరిగా మాట్లాడటానికి బదులు తోటి పిల్లల మాదిరిగా అనునయించి చెప్పటం మేలని నిపుణులు అంటున్నారు. ఒక పని వద్దని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పటం కన్నా నిదానంగా అందులోని మంచి చెడ్డల్ని విడమరిచి చెప్పటం మేలని అంటున్నారు. ద కేస్‌ ఫర్‌ ద ఓన్లీ చైల్డు అనే పరిశోధక గ్రంథం లో పిల్లల్ని ఎంత అనునయంతో పలకరిస్తే అంత మేలని తేల్చిచెప్పారు. ఇంట్లో ని పెద్ద వారిని గౌరవించటం, తోటి వారిని అభిమానంగా పలకరించటం, ప్రశాంతంగా జవాబులు ఇవ్వటం వంటివి ఇంట్లోనే అలవాటు చేయాల్సి ఉంటుంది. ఇవి పెద్ద వారిని చూసి పిల్లలు బాగా నేర్చుకొంటారు. అందుచేత పిల్లలకు ఈ విషయాల్ని విడమరిచి చెప్పాలి. ఒకవేళ ఇటువంటి విషయాల్లో సక్రమంగా లేకపోతే నెమ్మదిగా నేర్పించాల్సి ఉంటుంది. అంతే తప్ప కేకలు పెట్టడం, ఒక్కసారిగా విరుచుకు పడటం మంచిది కాదు. మంచి అలవాట్లను నెమ్మదిగా తెలియచేయాలి.

పిల్లల పెంపకంలో మెళుకువలు ...!

పిల్లలలో కలుపుగోలుతనం ముఖ్యం: పిల్లల్ని ఒంటరిగా ఉంచటం మంచిది కాదు. ఒక్కరూ తనలో తానే మథనపడే అవకాశం ఇవ్వకూడదు. నలుగురిలోనూ కలిసిపోనివ్వాలి. చుట్టుపక్కల వారితో కలవక పోవటం, స్కూల్‌లో తోటి ఫ్రెండ్సుకి దూరంగా ఉండటం మంచి అలవాట్లు కాదని తెలియచెప్పాలి. తామే అధికులం అన్న భావన ఎంత ప్రమాదకరమో, తాము అల్పులం అన్న న్యూనత కూడా సరి కాదు. అందుచేత ఇతరులతో కలిసిపోయేందుకు పిల్లలను ప్రోత్సహించాలి. ఇందుకోసం తోటివారికి సాయపడటం, ఇతరుల నుంచి సహాయం తీసుకోవటం వంటివి నేర్పించాలి. ఇది క్రమంగా అలవాటు చేయాలి. దీని వలన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒంటరిగా కుమిలిపోయే లక్షణం తప్పుతుంది. పైగా కలిసికట్టుగా ఎదుర్కొనే స్వభావం అలవాటు అవుతుంది. కొంత మంది పిల్లలు గారాబం ఎక్కువ అయినప్పుడు ఎవరినైనా ధిక్కరించే లక్షణంతో ఉంటారు. ఇటువంటి వారికి క్రమంగా తామే అధికులం అన్న భావన కలుగుతుంది. ఇటువంటి వారు చిన్నపాటి ఇబ్బందిని కూడా సహించలేని వారుగా మారతారు. ఇటువంటి పోకడల్ని మొదట్లోనే గుర్తించి అడ్డుకట్ట వేయాల్సి ఉంటుంది.

పిల్లల పెంపకంలో మెళుకువలు ...!

పిల్లల స్నేహితుల్ని మన్నించటం: పిల్లలకు తమ స్నేహితుల మీద అభిమానం చూపుతారు. తోటి పిల్లలు నచ్చితే ఎంతో గొప్పలు చెబుతారు. నచ్చక పోతే మాత్రం తెగడ్తలు కూడా అంతే స్పీడు గా ఉంటాయి. ఇంటికి తిరిగి వచ్చాక తోటి స్నేహితుల గురించి చెప్పుకొని వస్తుంటారు. సహజంగానే ఇవన్నీ సుత్తి మాటలుగా అనిపిస్తాయి. వాటిని వెంటనే కొట్టి పారేయటం మంచిది కాదు. ఇతర స్నేహితుల కు సంబంధించిన విషయాలు మనం ఆసక్తి కరంగా వింటున్నట్లు ఉంటే మేలు. వీలుంటే పిల్లల స్నేహితుల్ని ఇంటికి పిలవటం మంచిది. అప్పుడప్పుడు పిలిపించి ఇంట్లోనే ఆడుకొనే వెసులుబాటు కల్పించాలి. దీంతో పిల్లలు పొంగి పోతారు. స్నేహితుల ఎదుట పిల్లల్ని చికాకు పడటం, కోప్పడటం, పోల్చి తిట్టడం మాత్రం మంచి పద్దతి కాదు సుమా.. స్నేహితుల సమక్షంలో పిల్లలతో అభిమానంగా వ్యవహరిస్తే మా పేరంట్సు చాలా మంచివాళ్లు అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తారు. స్నేహితులకు పెద్దల గురించి గొప్పగా చెబుతారు.

పిల్లల పెంపకంలో మెళుకువలు ...!

పిల్లల కోప తాపాలకు ప్రాధాన్యం: ఇటీవల కాలంలో పిల్లలకు కోప తాపాలు ఎక్కువగా ఉంటున్నాయి. పిల్లలు ఎదిగే కొద్దీ ఇటువంటి పోకడలు అదికం అవుతున్నాయి. పిల్లలు చికాకుగా ఉంటే మనం మండిపోవటం మంచిది కాదు. చీటికి మాటికీ కోపం తెచ్చుకోవటం ఎంత చేటో విడమరిచి చెప్పాలి. పిల్లల కోపానికి కారణం ఏమిటో గుర్తించాలి. అటువంటి సందర్భం ఎందుకు ఏర్పడిందో వివరంగా చెప్పటం మేలు. అటువంటప్పుడు కోపం తెచ్చుకోకుండా వ్యవహరించాలని సూచించాలి. పెంకితనంతో ఉన్నప్పుడు మొండిగా వ్యవహిరిస్తుంటారు. అటువంటప్పుడు కోపం తెచ్చుకొంటే మరింత మొండిగా మారిపోతుంటారు.

పిల్లల పెంపకంలో మెళుకువలు ...!

టీవీలు, ఇంటర్‌నెట్‌ల వాడకాన్ని తగ్గించటం: పిల్లల్లో టీవీ, ఇంటర్‌ నెట్‌చూసే వాడకం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. ముఖ్యంగా కార్టూన్‌ చానెల్సు, ప్లే చానెల్సు కు ఎక్కు వగా అలవాటు పడుతున్నారు. అందులో ఉండే క్యారెక్టర్ల ను బాగా అనుకరిస్తున్నారు. కొంత మంది పిల్లలు గంటల తరబడి టీవీలకు అతుక్కొనిపోతున్నారు. దీని వలన బద్దకం, మందకొడి తనం పెరిగిపోతున్నాయి. సరి కదా, ఆ చానెల్సుని మారిస్తే ఊరుకోవటం లేదు. వెంటనే చిందులు వేస్తున్నారు. ఈ పోకడను ముందుగానే గమనిం చుకోవాలి. అటువంటి చానెల్సు ను క్రమంగా తగ్గించి వేయాలి. అటువంటి చానెల్సు లో ఏ ప్రోగ్రామ్‌ ను క్రమం తప్పకుండా చూస్తున్నారో గమనించి ఆ సమయంలో వేరే వ్యాపకం అలవాటు చేయటం మేలు. లేదంటే ఆ కార్యక్రమాలకు అలవాటు పడిపోతే పిల్లలను కంట్రోల్‌చేయటం కష్టం అవుతుంది. కొంత మంది తల్లిదండ్రులు పిల్లలకు అన్నం తినిపించటానికి, పనులు చేయించుకోవటానికి టీవీ ని అలవాటు చేస్తుంటారు. ఇది సరికాదు. తర్వాత కాలంలో ఈ అలవాటు కొంప ముంచుతుంది.

పిల్లల పెంపకంలో మెళుకువలు ...!

అవసరమైనప్పుడు‚ఠిన వైఖరి: పిల్లలతో ప్రశాంతంగా, నిదానంగా ఉండటం మంచిదే కానీ, అవసరమైనప్పుడు కఠిన వైఖరి అవలంబించాలి. వద్దన్న పని చేస్తామని పదే పదే మొండికేస్తుంటారు. కొన్ని సార్లు చెప్పిన మాట వినకుండా మొండికేస్తుంటారు. అటువంటప్పుడు సంయమనంతో చెబుతునే ఉండాలి. అదే సమయంలో పిల్లల మనస్సు మరలించి రాంగ్‌ స్టెప్‌ పడకుండా చూడాలి.అవసరమైతే ఇటువంటి సమయంలో కఠినంగా కూడ వ్యవహరించాలి. మొకై్క వంగనిది మానై వంగదు అని గుర్తించుకోవాలి. మొండితనాన్ని పిల్లల్లో ప్రోత్సహిస్తే అది క్రమంగా చేటు తెస్తుంది.

పిల్లల పెంపకంలో మెళుకువలు ...!

పిల్లలకు అతి గారాబం కూడదు: పిల్లలకు కావలసిన వస్తువులు తెచ్చి పెట్టి ఇవ్వటం మంచిదే. షాపింగ్‌ కు తీసుకొని వెళితే ఎన్నయినా కొని పెట్టవచ్చు. కానీ, దీనికి పరిమితి ఉండాలి. ఏది కనిపించినా కావల్సిందే అని కొందరు పిల్లలు మొండికేస్తారు. ఇటువంటి అలవాటును ప్రోత్సహించటం మంచిది కాదు. డబ్బు విలువ ఎటువంటిదో తెలియ చెప్పాలి. అవసరం అయినపుడు మాత్రమే విడిగా పిల్లలను షాపింగ్‌ కు పంపిస్తుండాలి.

పిల్లల మనస్తత్వాన్ని గమనించి ఓర్పుతో వ్యవహరిస్తుంటే పిల్లలు ఉన్న ఇల్లు నందన వనం అవుతుంది. పిల్లలతో వేగలేక పోతున్నాం.. అన్న మాటను వదిలేసి మా పిల్లలే మా బంగారం అన్న మాట అనవచ్చు.

English summary

Limits Of Love And Parenthood | పిల్లల పెంపకంలో మెళుకువలు ...!

There are some very basic aspects of a parent child relationship that everyone has to understand. As soon as you have a child you start feeling love for him/her. This feeling of love can be anything from a deep feeling of empathy to just providing for the needs of the child. But you should always limit your love for your child as after a certain age you need to control your child for their own good. Ideal parenting happen is one when you combine both love and discipline to bring up your child in a proper fashion.
Story first published: Saturday, May 11, 2013, 16:49 [IST]
Desktop Bottom Promotion