For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తిరుమల వెంటేశ్వరుని 5 మూలరూపాలు, ఒక్కో రూపానికొక్కో ప్రాధాన్యత.!..

|

తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలో మూలవిరాట్టు కాకుండా, మరో నాలుగు మూర్తులు ఉన్నాయి. ఈ మూర్తులు వరుసగా - భోగ శ్రీనివాసమూర్తి, ఉగ్ర శ్రీనివాసమూర్తి, మూలమూర్తి, కొలువు శ్రీనివాసమూర్తి, శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వాములు. ఏయే రూపాల ప్రాధాన్యత ఏమిటో

మూలమూర్తి (ధ్రువబేరం)
నిత్యం లక్షలాదిమంది భక్తిప్రపత్తులతో దర్శించుకునే మూలవిరాట్టును ధ్రువబేరం అంటారు. ధ్రువ అంటే స్థిరంగా ఉండేది అని అర్ధం. ధృవబేరం అంటే నేలలో స్తంభం పాతుకున్నట్లు స్థిరంగా ఉండే విగ్రహమూర్తి. మూలవిరాట్టు అయిన ధ్రువబేరానికి తెల్లవారుజామున సుప్రభాతసేవ మొదలు, అర్ధరాత్రి ఏకాంతసేవ వరకూ రోజంతా ఆరాధనలు జరుగుతాయి.

spirituality

ఈ మూలవిరాట్టు సాలగ్రామమూర్తి. మూలమూర్తి శిరస్సు నుండి పాదం వరకూ ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంటుంది. ''వీరస్థానక'' పద్ధతిలో నిలబడి ఉన్న మూలవిరాట్టు పక్కన శ్రీదేవి, భూదేవి విగ్రహాలు ఉండవు.

నిత్యం లక్షలాదిమంది భక్తులు తిరుమలేశుని దివ్య మంగళ దర్శనం కోసం ఎదురుచూస్తారు కనుక ఈ మూలవిరాట్టును (ధృవబేరం) దర్శించుకోడానికి రెండు క్షణాల కంటే సమయాన్ని కేటాయించలేరు.

భోగ శ్రీనివాసమూర్తి (కౌతుక బేరం)
ఒక అడుగు ఎత్తులో ఉండే భోగ శ్రీనివాసమూర్తిని వ్యవహారంలో భోగ శ్రీనివాసుడు అంటారు. ఇంకోరకంగా కౌతుక బేరం లేదా పురుష బేరం అంటారు. నిత్యం జరిపే దీపారాధన, నైవేద్యం, అభిషేకం, ఏకాంత సేవలు భోగ శ్రీనివాస మూర్తికి జరిపిస్తారు. ఈ వెండి శ్రీనివాసుని విగ్రహాన్నిక్రీస్తుశకం 614లో పల్లవ మహారాణి సామవాయి పేరిందేవి ఆలయానికి సమర్పించినట్లు శాసనాల్లో ఆధారాలు లభించాయి.

మహారాణి ఈ శ్రీనివాసమూర్తిని సమర్పించిన నాటి నుండి నేటివరకూ ఎన్నడూ ఆలయం నుండి విగ్రహాన్ని ఆలయం నుండి తొలగించలేదు. ఆగమ శాస్త్రాన్ని అనుసరించి మూలవిరాట్టుకు చేసే సేవలు భోగ శ్రీనివాస మూర్తికి అందుతాయి.

ఉగ్ర శ్రీనివాసమూర్తి (స్నపన బేరం)
ఉగ్ర శ్రీనివాసమూర్తిని స్నపన బేరం అంటారు. ఈ మూర్తి శ్రీదేవి, భూదేవి సమేతంగా ఉంటుంది. నిజానికి శ్రీనివాసమూర్తి రూపం 11వ శతాబ్దం వరకూ ఉత్సవ విగ్రహంగా ఉండేది. క్రీస్తుశకం 1330లో ఒకసారి ఉత్సవ విగ్రహంగా ఊరేగింపు జరుపుతుండగా అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో, అది ఉగ్ర శ్రీనివాసుని రూపానికి సంకేతంగా భావించారు.

అప్పటినుంచి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప రూపాన్ని ఉత్సవ విగ్రహంగా రూపొందించారు. ఆవిధంగా అగ్ని ప్రమాదం జరిగినప్పటినుంచి ఉగ్ర శ్రీనివాస మూర్తిని సంవత్సరానికి ఒకసారి సూర్యోదయానికి ముందు సర్వ అలంకారాలతో సుందరంగా తీర్చిదిద్ది ఊరేగింపుకు తీసుకెళ్ళి, తిరిగి అంతరాలయానికి తీసుకొస్తారు.

శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి (ఉత్సవబేరం)
13వ శతాబ్దంలో ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఊరేగింపుకు తీసికెళ్ళడం మానేసిన తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిని ఉత్సవ వేడుకల్లో ఊరేగిస్తున్నారు. ఈ శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిని ఉత్సవబేరం అంటారు. ఈ మూర్తి మూడు అడుగుల ఎత్తు ఉంటుంది. బ్రహ్మోత్సవాలతో సహా ప్రతి ఉత్సవంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామినే ఊరేగిస్తారు.

కొలువు శ్రీనివాసమూర్తి (బలిబేరం)
గర్భగుడిలో మూలవిరాట్టు పక్కన ఉండే మరొక చిన్న విగ్రహాన్ని కొలువు శ్రీనివాసమూర్తి అంటారు. ఆగమ పరిభాషలో బలిబేరం అంటారు. మూలవిరాట్టుకు తోమాలసేవ నిర్వహించిన తర్వాత కొలువు శ్రీనివాసుని బంగారు సింహాసనంపై ఉంచి పంచాంగ శ్రవణం చేస్తారు.

తిరుమలలో ఆవేళ జరిగే ఉత్సవ వేడుకలు ఏమైనా ఉంటే వాటి వివరాలను తెలియజేస్తారు. శ్రీవారి హుండీలో గతరోజు వచ్చిన కానుకల వివరాలను, ఆదాయ, వ్యయాలను తెలియజేస్తారు

English summary

Secret behind Tirumala Sri Sri Vari 5 Roopalu..

Lord Venkateswara. Secret bejind Sri Venkateswaraswamy. Nijaroopa dharshanam
Story first published:Wednesday, June 29, 2016, 15:24 [IST]
Desktop Bottom Promotion