చాలామందికి మందు గ్లాస్ చేతిలో పడగానే దానికి జతగా కరకరలాడే స్టఫింగ్ లేదా స్నాక్స్ ఉండాల్సిందే. నోటికి రుచిగా ఉన్నాయి కదా అని ఏది పడితే అది, ఆల్కహాల్ తో కలిపి లాగించేస్తే మాత్రం మీ ఆరోగ్యానికి ముప్పు తప్పదు. మందుతో పాటు కొన్ని రకాల ఆహార పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో తీవ్రమైన మార్పులు జరుగుతాయి. అవేంటో, ఆల్కహాల్ తో పాటు ఎలాంటి ఆహారం అస్సలు తినకూడదో, ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూడండి.
నూనెలో వేయించిన పదార్థాలకు నో
మందు పార్టీ అనగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చేవి వేడి వేడి బజ్జీలు, పునుగులు, క్రిస్పీ ఫ్రైడ్ చికెన్. కానీ ఆల్కహాల్ తీసుకునేటప్పుడు నూనె ఎక్కువగా ఉండే, డీప్ ఫ్రై చేసిన ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు. ఆల్కహాల్, నూనె రెండు ఒకేసారి శరీరంలోకి వెళితే, వాటిని అరిగించడానికి మీ లివర్ మీద విపరీతమైన ఒత్తిడి పడుతుంది. ఇది దీర్ఘకాలంలో లివర్ డ్యామేజ్ కి దారి తీస్తుంది.
స్పైసీ ఫుడ్స్ వద్దు మహాప్రభో
చాలామంది మందుకి కాంబినేషన్ గా ఘాటైన, స్పైసీగా ఉండే వంటకాలను ఇష్టపడతారు. కానీ ఆల్కహాల్ తో పాటు స్పైసీ ఫుడ్ తినడం వల్ల కడుపులో మంట, ఎసిడిటీ పెరుగుతాయి. ఈ రెండింటి కలయిక వల్ల కడుపులో అల్సర్లు, గ్యాస్ట్రైటిస్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మరుసటి రోజు ఉదయం తీవ్రమైన కడుపునొప్పి తప్పదు.
ఉప్పుతో ఊహించని ప్రమాదం
బార్ లో అయినా, ఇంట్లో అయినా మందు గ్లాసు పక్కన సాల్టెడ్ పీనట్స్ (ఉప్పు వేసిన పల్లీలు), మసాలా అప్పడాలు ఉండటం కామన్. కానీ ఉప్పు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడి విపరీతమైన దాహం వేస్తుంది. ఆ దాహాన్ని తీర్చుకోవడానికి నీళ్ల బదులు తెలియకుండానే ఎక్కువ ఆల్కహాల్ తాగేస్తాము.
స్వీట్స్, కాఫీ, టీలకు దూరంగా ఉండండి
మందు తాగేటప్పుడు ఐస్ క్రీమ్స్, పేస్ట్రీలు, కేకులు లాంటి చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు తినడం చాలా ప్రమాదకరం. ఇవి రక్తంలో షుగర్ లెవల్స్ ను ఒక్కసారిగా పెంచేసి, భయంకరమైన తలనొప్పి వచ్చేలా చేస్తాయి. అలాగే ఆల్కహాల్ తో పాటు కాఫీ, టీలు అస్సలు తీసుకోకూడదు. ఇదొక డేంజరస్ కాంబినేషన్. దీనివల్ల గుండె దడ రావడం, విపరీతమైన ఆందోళన కలగడం లాంటి సమస్యలు ఎదురవుతాయి.
ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి?
ఆల్కహాల్ తీసుకునేటప్పుడు ఎప్పుడూ కడుపుకు తేలికగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి. ఉడకబెట్టిన కూరగాయలు (బాయిల్డ్ వెజిటేబుల్స్), ఉడకబెట్టిన గుడ్లు (బాయిల్డ్ ఎగ్స్), ఆమ్లెట్ ఆరోగ్యానికి చాలా మంచివి.
అలాగే భోజనంలో సాంబార్ రైస్ లాంటివి తీసుకోవడం వల్ల కడుపు ప్రశాంతంగా ఉండి అరుగుదల బాగుంటుంది. వీటన్నింటికంటే ముఖ్యంగా మందు తాగేటప్పుడు మధ్యమధ్యలో శరీరానికి తగినన్ని నీళ్లు తాగుతూ ఉండాలి.
మందు తాగడం ఆరోగ్యానికి హానికరమే అయినా తాగే అలవాటు ఉన్నవారు కనీసం ఫుడ్ విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీ ఆరోగ్యాన్ని కొంతవరకైనా కాపాడుకోవచ్చు.
More Articles
- రోడ్డుపై పెరిగే బిచ్చగాళ్ల పిల్లలు వ్యాక్సిన్లు లేకపోయినా.. హెల్తీగా, స్ట్రాంగ్ గా ఎందుకు కనబడతారు?
- పిత్తులు వేసే వాళ్లని చూసి నవ్వుతున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి..
- తలస్నానం చేసిన ప్రతిసారీ జుట్టు రాలిపోతోందా? దీనికి పరిష్కారం ఏంటో తెలుసా?
- స్మోకింగ్ చేసినా కొందరికి క్యాన్సర్ ఎందుకు రాదు? సీక్రెట్ ఇదే!
- సిగరెట్ ముట్టకపోయినా యువకులకు లంగ్ క్యాన్సర్..మీలో ఈ 5 లక్షణాలు కనిపిస్తున్నాయా?
- పదే పదే వాష్ రూమ్ కి పరిగెడుతున్నారా? కారణాలు ఇవే కావచ్చు!