నలుగురిలో ఉన్నప్పుడు అనుకోకుండా ఒక పిత్తు వస్తే చాలు.. వెంటనే అందరూ ముక్కులు మూసుకుంటారు. ఆ శబ్దం వినగానే పక్కన ఉన్నవాళ్లు ఫక్కున నవ్వుతారు లేదా అసహ్యంగా చూస్తారు. ఇక ఆ వ్యక్తి అయితే ఏదో ఘోరమైన తప్పు చేసినట్లుగా సిగ్గుతో కుంచించుకుపోతాడు. కానీ, పిత్తులు వేసే వాళ్లని చూసి నవ్వేముందు, అసలు దీని వెనుక ఉన్న సైన్స్, కొన్ని షాకింగ్ నిజాలు తెలుసుకోవాలని ఖమ్మంలోని సన్ రైజ్ హాస్నిటల్ లో పీడియాట్రిక్స్, నియోనటోలజిస్ట్ డాక్టర్ గౌతమ్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఒక వీడియోలో తెలిపారు.
పిత్తులు రావడం అనేది మనుషుల్లో జరిగే అత్యంత సహజమైన, సాధారణమైన జీవక్రియ. డాక్టర్ గౌతమ్ తెలిపిన ప్రకారం దీని అర్థం ఏంటంటే.. మీ జీర్ణవ్యవస్థ చాలా ఆరోగ్యంగా, అద్భుతంగా పనిచేస్తోంది అని. మనం తిన్న ఆహారం పొట్టలో, పేగుల్లో జీర్ణమయ్యే క్రమంలో సహజంగానే కొంత గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. అలాగే మనం ఆహారం తీసుకుంటున్నప్పుడు కొంత గాలి లోపలికి వెళుతుంది. ఈ రెండూ కలిసి పొట్టలో పేరుకుపోయి, చివరకు పిత్తుల రూపంలో బయటకు వచ్చేస్తాయి. గ్యాస్ ఎప్పటికప్పుడు బయటకు వెళ్లిపోతేనే మన శరీరం తేలికగా ఉంటుంది.
డాక్టర్ గౌతమ్ ప్రకారం.. ఎంత ఆరోగ్యంగా ఉన్న మనిషి అయినా సరే, రోజుకు సగటున 10 నుంచి 15 సార్లు పిత్తులు వేస్తాడు. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. ఒకవేళ గ్యాస్ బయటకు వెళ్లకుండా లోపలే ఉండిపోతే, పొట్టలో గ్యాస్ విపరీతంగా పేరుకుపోయి కడుపు ఉబ్బరం, కడుపునొప్పి, ఛాతీలో మంట, అసౌకర్యం వంటి సమస్యలు వస్తాయి. అందుకే పిత్తు వస్తున్నప్పుడు నలుగురు ఏమనుకుంటారో అని బలవంతంగా ఆపుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.
మనం తీసుకునే కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల గ్యాస్ ఎక్కువగా వస్తుంటుంది. ముఖ్యంగా అధిక ప్రోటీన్లు, ఫైబర్ ఉండే పప్పులు, చిక్కుడు జాతి గింజలు (బీన్స్), క్యాబేజీ, కాలిఫ్లవర్, బ్రోకలీ, ఉల్లిగడ్డ లాంటివి తిన్నప్పుడు జీర్ణప్రక్రియలో కాస్త ఎక్కువ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. అలాగే కూల్ డ్రింక్స్, సోడాలు, ఇతర సాఫ్ట్ డ్రింక్స్ తాగే వారిలోనూ పిత్తులు ఎక్కువగా వస్తుంటాయి.
ఇదంతా బాగానే ఉన్నా.. కొన్నిసార్లు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. పిత్తులు రావడంతో పాటు విపరీతమైన కడుపునొప్పి రావడం, తీవ్రమైన అజీర్తి, రోజురోజుకూ ఆకలి తగ్గిపోవడం, అకారణంగా బరువు తగ్గడం, అన్నింటికీ మించి మలవిసర్జన సమయంలో రక్తం పడటం లాంటివి ఉంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి పేగుల్లో పూత, ఇన్ఫెక్షన్లు లేదా మరేదైనా ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలకు ముందస్తు సంకేతాలు కావచ్చు. ఇలాంటి లక్షణాలు గమనిస్తే వెంటనే డాక్టర్‌ను కలిసి ట్రీట్మెంట్ తీసుకోవాలి.
More Articles
- తలస్నానం చేసిన ప్రతిసారీ జుట్టు రాలిపోతోందా? దీనికి పరిష్కారం ఏంటో తెలుసా?
- స్మోకింగ్ చేసినా కొందరికి క్యాన్సర్ ఎందుకు రాదు? సీక్రెట్ ఇదే!
- సిగరెట్ ముట్టకపోయినా యువకులకు లంగ్ క్యాన్సర్..మీలో ఈ 5 లక్షణాలు కనిపిస్తున్నాయా?
- పదే పదే వాష్ రూమ్ కి పరిగెడుతున్నారా? కారణాలు ఇవే కావచ్చు!
- మీ లివర్ ఆరోగ్యంగా ఉందా లేదా అనేది ఈజీగా తెలుసుకోండిలా!
- ఇలా చేస్తే చైన్ స్మోకర్లు కూడా జన్మలో సిగరెట్ ముట్టుకోరు!