సనాతన హిందూ సంప్రదాయంలో అగ్నిని అత్యంత పవిత్రమైనదిగా, దైవ స్వరూపంగా భావిస్తారు. ఇంట్లో వెలిగించే ఒక చిన్న దీపపు జ్వాల కేవలం చీకటిని మాత్రమే పారద్రోలదు.. మన జీవితాల్లోని అజ్ఞానాన్ని,ప్రతికూల శక్తులను సైతం దహించివేసి పవిత్రమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. దీపం నుండి వెలువడే ఆ సున్నితమైన కాంతి, తేజస్సు మన మనసుకు అనిర్వచనీయమైన ప్రశాంతతను చేకూరుస్తాయి. రోజువారీ జీవితంలో ఎదుర్కొనే మానసిక ఒత్తిడిని, ఆందోళనలను తగ్గించి, మనలో సానుకూల ఆలోచనల బీజాలను నాటుతాయి.
లక్ష్మీదేవి కటాక్షం - ఆర్థిక స్థిరత్వం
ఇంట్లో ప్రతిరోజూ భక్తిశ్రద్ధలతో క్రమం తప్పకుండా దీపారాధన చేయడం వల్ల సాక్షాత్తూ ఆ శ్రీ మహాలక్ష్మి సంతోషిస్తుంది. అమ్మవారి కరుణా కటాక్షాలు ఆ కుటుంబంపై మెండుగా ఉంటాయి. దీని ఫలితంగా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, స్థిరమైన ఆదాయం సమకూరుతుంది. అనవసరమైన, వృధా ఖర్చులు తగ్గిపోయి.. సిరిసంపదలు, ధాన్య వృద్ధి కలుగుతాయి.
వాస్తు దోషాలకు దీపమే విరుగుడు
ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం దేవుని మందిరంలో దీపం వెలిగిస్తే వాస్తు దోషాల ప్రతికూల ప్రభావం నశిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. సాయంత్రం వేళ పూజా మందిరంలో రెండు దీపాలు వెలిగించడం అత్యంత శుభప్రదం. వీటిలో ఒకటి ఆవు నెయ్యితో, మరొకటి నువ్వుల నూనె లేదా ఆవ నూనెతో వెలిగించాలి.
నెయ్యి దీపం - నూనె దీపం (ఎలా ఉంచాలి?)
పూజా మందిరంలో దీపాలను ఉంచే విధానంలో గొప్ప శాస్త్రీయత దాగి ఉంది.
నెయ్యి దీపం: దేవుని విగ్రహానికి లేదా పటానికి కుడి వైపున నెయ్యి దీపాన్ని ఉంచాలి. ఇది దేవతలకు, సకారాత్మక శక్తులకు ప్రతిరూపం. దీనిని ఇంట్లో తూర్పు లేదా ఉత్తర దిశగా ఉంచి వెలిగించడం వల్ల.. ఇంట్లోకి అదృష్టం, ప్రశాంతత, సానుకూల శక్తి ఆకర్షించబడతాయి.
నూనె దీపం: దేవుని పటానికి ఎడమ వైపున నూనె దీపాన్ని ఉంచాలి. ఇది ఇంటికి ఒక రక్షా కవచంలా పనిచేస్తుంది. ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని, వాస్తు దోషాలను, ఇతరుల చెడు దృష్టిని (దిష్టి) పారద్రోలడంలో నూనె దీపం అద్భుతంగా పనిచేస్తుంది. పితృదేవతలకు సద్గతులను ప్రసాదించే కాంతికి ఇది చిహ్నంగా నిలుస్తుంది.
దిక్కులు - నియమాలు
దీపారాధనలో దిక్కులకు అమితమైన ప్రాధాన్యత ఉంది. కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాల కోసం, శ్రేయస్సు కోసం దీపం ఎల్లప్పుడూ తూర్పు దిశగా వెలగాలి. సంపదలు, వ్యాపార వృద్ధి కోసం దీపాన్ని ఉత్తరం దిశగా ఉంచాలి. కానీ, పొరపాటున కూడా దీపాన్ని పడమర లేదా దక్షిణ దిశల వైపు ఉంచి వెలిగించకూడదు. ఇది అరిష్టానికి దారితీస్తుంది.
పండుగలు - ప్రత్యేక రోజులు
సాధారణంగా ఉదయం పూజలో ఒక దీపం వెలిగించినా సరిపోతుంది. కానీ, సాయంత్రం సంధ్యా సమయాన మాత్రం ఖచ్చితంగా రెండు దీపాలు వెలిగించడం శ్రేయస్కరం. ఇక అమావాస్య, పౌర్ణమి, దీపావళి లేదా ఇతర విశేష పండుగ దినాల్లో పూజా మందిరంలో ఐదు లేదా ఏడు దీపాలను వెలిగించడం మహా శుభప్రదంగా పండితులు చెబుతారు. ఈ విధంగా చేయడం వల్ల ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.
More Articles
- ఏం చేసినా మీ కష్టాలు పోవడం లేదా?..ఇంట్లోని ఈ దిశలో దీపం వెలిగిస్తే..
- దీపావళికి దీపాలు పెట్టేటప్పుడు ఈ తప్పులు చేయకూడదు.. చేస్తే ఏమవుతుందంటే..?
- Diwali 2021: దీపాలను వెలిగించడం వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలేంటో తెలుసా...
- కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేస్తే.. జీవితంలో పొందే అత్యంత గొప్ప ఫలితాలు..!
- దీపావళి రోజు ఖచ్చితంగా దీపాలు వెలిగించాల్సిన ప్రదేశాలు ??
- ఇల్లు కళకళలాడించే ప్రమిదలు పలురకాలు... దీపావళి స్పెషల్