For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మిళమిళ మెరిసే చర్మం కోసం హోం మేడ్ ఫేస్ ప్యాక్స్

|

ఈ ప్రపంచంలో అందంగా కనపడాలని ఎవరు కోరుకోరు చెప్పండి. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఒకానొక దశలో అందం గురించిన ఆలోచనలు చేయక మానరు.అవునా? చర్మ ఆరోగ్యం, సౌందర్యం అనేవి శారీరిక ఆరోగ్యానికి అనుసంధానంగా ఉంటుంది. క్రమంగా జీవనశైలి పద్దతులు, ఆహారపు అలవాట్లు వంటివి అన్నీ కారకాలుగా ఉంటాయి. కానీ, అందం అనే ఆలోచన, రానురాను సరికొత్త పుంతలు తొక్కుతుంది. క్రమంగా ఒక్క చిన్న మొటిమ కనపడినా కంగారు పడడం గమనిస్తూనే ఉంటాం. సహజ సిద్దం అనేది పక్కకు పోయి, కృత్రిమమైన కాస్మోటిక్స్, కెమరా ఫిల్టర్ల ప్రపంచానికి అలవాటు పడుతున్నారు. ఈ అలవాట్లు ఆర్ధికంగానే కాకుండా, శారీరిక సమస్యలను కూడా తీసుకుని వస్తున్నాయన్నది వాస్తవం. కానీ ఒకటి గమనిస్తే, మనకన్నా మన అమ్మమ్మలు, నానమ్మలు ఇంకా అందంగా ఉండేవారని తెలుస్తుంది. దీనికి కారణం వారి సహజ సిద్దమైన మార్గాలే. అవునా ? అప్పట్లో కాస్మోటిక్స్, రసాయనాల వాడకం వంటివి లేవు. క్రమంగా గృహ చిట్కాలనే అనుసరించేవారు. ఈరోజుకి కూడా వాళ్ళ ఫోటో ఆల్బమ్స్ చూస్తుంటే, అసూయగా ఉంటుంది. గమనించారో లేదో, వారితోనే మీ అందాన్ని రూపకాన్ని పోలికలు వేస్తుంటారు పెద్దవాళ్ళు. కానీ, వారి విధానాలు పద్దతులు కూడా పాటించిన పక్షంలోనే కొన్నిటికి న్యాయం చేయగలరు.

మరి, ఆ వెలితి పోవాలంటే ఏం చేయాలి ? క్రమంగా రసాయనిక ఉత్పత్తుల వాడకాన్ని పక్కన పెట్టి గృహ చిట్కాల మీద ఆలోచన చేయడం ఉత్తమంగా ఉంటుంది. అవునా ? షాంపూల కన్నా, సహజ సిద్దమైన కుంకుడు కాయలు, శీకాకాయలు ఎంతో ఉపయోగకరంగా పనిచేస్తాయి. రసాయనాలతో కూడిన సబ్బుల కన్నా, సున్నిపిండి శ్రేయస్కరం. అదేవిధంగా మార్కెట్లో దొరికే ఫేస్ పాక్స్ కన్నా, పురాతన కాలం నుండి గృహ చిట్కాలుగా వాడుకలో ఉన్న, సహజ సిద్దమైన ఫేస్ పాక్స్ అత్యుత్తమంగా సహాయం చేయగలవు. అవునా ?

ఇప్పుడు ఆ పదార్దాలేమిటో, మీ ముఖారవిందానికి ఆ ఫేస్ పాక్స్ ఏవిధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం.

1. అరటి పండు మరియు తేనె :

అరటి పండులో ప్రధానంగా పొటాషియం, జింక్, అమైనో ఆమ్లాలు మరియు విటమిన్ ఎ, B6 మరియు C ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని పెంచడంలో అత్యుత్తమంగా సహాయపడతాయి. అంతేకాకుండా ఇది యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉండి, చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడగలుగుతుంది. ఇది చర్మాన్ని తేమగా చేయడంతో పాటుగా, అధికంగా విడుదల అవుతున్న జిడ్డు లేదా సెబం నియంత్రించడంలో సహాయం చేస్తుంది. క్రమంగా మొటిమలు మరియు డార్క్ స్పాట్స్ చికిత్సలో అత్యుత్తమ ప్రభావాలను కనపరుస్తుంది. తేనె చర్మాన్ని మృదువుగా చేయడంతో పాటుగా, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను సైతం కలిగి ఉంటుంది. ఇది చర్మాన్ని మృదువుగా చేస్తూ, చర్మం పాడవకుండా రక్షించడానికి సహాయపడుతుంది.

కావలసిన పదార్ధాలు :

• ½ పండిన అరటి పండు

• 1 టేబుల్ స్పూన్ తేనె

ఉపయోగించే విధానం :

• అరటిపండును ఒక గిన్నెలో తీసుకుని మాష్ చేయాలి.

• గిన్నెలోకి తేనె చేర్చి బాగా కలపాలి.

• ఈ మిశ్రమాన్ని ముఖం మీద నలువైపులా విస్తరించునట్లు సమానంగా అప్లై చేయాలి.

• 20 నిమిషాల పాటు అలానే వదిలేయండి.

• చివరిగా చల్లని నీటితో దానిని కడిగేయండి.

2. బంగాళాదుంప మరియు ముల్తానీ మట్టి :

బంగాళదుంప పొటాషియం మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలను కలిగి ఉంటుంది. దీనిలో విటమిన్ సి మరియు B6 తోపాటుగా పీచు మరియు కార్బోహైడ్రేట్లు కూడా ఉంటాయి. ఫ్రీ రాడికల్ నష్టం నుంచి చర్మాన్ని కాపాడే యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో అధికంగా ఉన్నాయి. ఇది చర్మాన్ని తేమగా మరియు ప్రకాశవంతంగా మారుస్తుంది. అలాగే చర్మం స్థితిస్థాపకత మెరుగుపరుస్తుంది. ముల్తానీ మట్టి మలినాలను, మృత కణాలను తొలగించుకోవడంలో సహాయం చేయడం ద్వారా చర్మాన్ని శుభ్రపరుస్తుంది. అంతేకాకుండా, ఇది చర్మానికి టోన్ అందించి, మృదువుగా మారుస్తుంది. మరియు ఈ ప్యాక్ సన్ టాన్ వదిలించుకోవడంలో కూడా సహాయపడుతుంది.

కావలసిన పదార్ధాలు :

• 1 టేబుల్ స్పూన్ బంగాళాదుంప రసం

• 1 టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి

ఉపయోగించే విధానం :

• ఈ రెండు పదార్ధాలను ఒక గిన్నెలోకి తీసుకుని కలుపుకోవాలి.

• ఈ మిశ్రమాన్ని ముఖం మరియు మెడ మీద అప్లై చేయాలి.

• ఒక 20 నిమిషాలు, పూర్తిగా డ్రై అయ్యే వరకు వదిలేయండి.

• తర్వాత చల్లటి నీటితో శుభ్రపరచండి.

3. శెనగపిండి మరియు పెరుగు :

శెనగపిండిలో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ మరియు అమైనో ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది మరియు డెడ్ స్కిన్ తొలగించడానికి సహాయపడుతుంది. అలాగే మొటిమలను, సన్ టాన్ నివారించడానికి సహాయపడుతుంది. పెరుగులో ప్రోటీన్స్, క్యాల్షియం, మెగ్నీషియం మరియు విటమిన్ బి12 సమృద్ధిగా ఉంటాయి. ఇది కూడా చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది మరియు మాయిశ్చరైజింగ్ అందిస్తుంది. అంతేకాకుండా అధికమోతాదులో యాంటీ ఆక్సిడెంట్లు కలిగి, ఫ్రీ రాడికల్స్ (స్వేచ్చారాశులు) తొలగించడంలో కూడా సహాయపడుతుంది.

కావలసిన పదార్ధాలు :

• 2 టేబుల్ స్పూన్ల శెనగపిండి

• 1 టేబుల్ స్పూన్ పెరుగు

• 1 టేబుల్ స్పూన్ తేనె

• చిటికెడు పసుపు పొడి

ఉపయోగించే విధానం :

• అన్ని పదార్థాలను కలిపి మిశ్రమంలా తయారు చేయాలి.

• దీన్ని ముఖంపై సమానంగా అప్లై చేయాలి.

• 15 నిమిషాల పాటు అలానే వదిలేయండి.

• చల్లటి నీటితో లేదా కాటన్ ఉపయోగించి దానిని తొలగించండి.

• ఉత్తమ ఫలితాల కోసం వారంలో ఒకసారి అనుసరించండి.

4. ముల్తానీ మట్టి మరియు నిమ్మ రసం :

ముల్తానీ మట్టి, చర్మాన్ని శుభ్రపరచడమే కాకుండా, మంచి టోన్ అందివ్వడంలో సహాయం చేస్తుంది. నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్, చర్మాన్ని ప్రకాశవంతంగా చేయడానికి సహాయపడుతుంది. ఇది చర్మాన్ని మృదువుగా చేయడానికి సహాయపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. నిమ్మలో ఉండే విటమిన్-సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది, తద్వారా చర్మం యొక్క స్థితిస్థాపకత మెరుగుపడుతుంది.

కావలసిన పదార్ధాలు :

• 2 టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టి

• కొన్ని చుక్కల నిమ్మరసం

• ½ టేబుల్ స్పూన్ల చందనం పొడి

• చిటికెడు పసుపు పొడి

ఉపయోగించే విధానం :

• ఒక గిన్నెలో ముల్తానీ మట్టి, చందనం పొడి, పసుపు పొడి వేసి బాగా కలపండి.

• దీనికి నిమ్మరసం జోడించి మరలా మిశ్రమంలా చేయండి.

• దీన్ని మీ ముఖంపై నలుదిక్కులా సమానంగా విస్తరించునట్లు అప్లై చేయాలి.

• అది పూర్తిగా ఎండిపోయే వరకు వదిలేయండి.

• చల్లటి నీటితో కాటన్ బాల్ ఉపయోగించి మీ ముఖాన్ని శుభ్రపరచండి.

5. పసుపు మరియు పాలు :

పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. క్రమంగా ఇది చర్మాన్ని మృదువుగా చేసేందుకు సహాయపడుతుంది, చెడు బ్యాక్టీరియాను తొలగించి చర్మాన్ని ఆరోగ్యకరమైన స్థితిలో ఉంచడంలో సహాయం చేస్తుంది. క్రమంగా చర్మం పాడవకుండా కాపాడుతుంది. పాలలో కాల్షియం, మెగ్నీషియం, జింక్ మరియు విటమిన్ కె ఉంటాయి. ఇవి చర్మానికి పోషణ అందివ్వడంతో పాటు, చర్మం స్థితిస్థాపకతను మెరుగుపరుస్తుంది మరియు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుంది.

కావలసిన పదార్ధాలు :

• ½ టీ స్పూన్ పసుపు

• 1 టీ స్పూన్ పాలు

ఉపయోగించే విధానం :

• పదార్ధాలన్నిటినీ ఒక పాత్రలో వేసి, మిశ్రమంగా కలుపుకోవాలి.

• ఈ మిశ్రమాన్ని ముఖం మీద నలుదిక్కులా విస్తరించునట్లు సమానంగా అప్లై చేయాలి.

• 15 నిమిషాలపాటు అలానే వదిలేయండి.

• తర్వాత చల్లటి నీటితో శుభ్రపరచండి.

6. కంది పప్పు మరియు పెరుగు :

కంది పప్పులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్రీ రాడికల్ సమస్య నుండి చర్మాన్ని రక్షించడానికి సహాయపడుతుంది. ఇది చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ (చర్మం పొడిబారకుండా) చేస్తుంది మరియు చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.

కావలసిన పదార్ధాలు :

• 2 టేబుల్ స్పూన్ల కందిపప్పు పొడి

• పెరుగు (అవసరమైన మోతాదులో)

ఉపయోగించే విధానం :

• కందిపప్పులో అవసరమైన మోతాదులో పెరుగును చేర్చి మృదువుగా మిశ్రమంలా తయారు చేసుకోవాలి.

• ఈ మిశ్రమాన్ని ముఖం మరియు మెడ మీద సమానంగా అప్లై చేయాలి.

• పూర్తిగా ఆరేవరకు అలాగే వదిలేయండి.

• ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రపరచండి.

7. బీట్రూట్, నిమ్మరసం మరియు పెరుగు :

బీట్రూట్ లో విటమిన్ సి ఉంటుంది, ఇది చర్మం స్థితిస్థాపకత మెరుగుపరుస్తుంది. మరియు ప్రకాశవంతమైన చర్మాన్ని అందివ్వడంలో దోహదపడుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉన్న కారణాన, చర్మాన్ని మృదువుగా చేయడంలో మరియు ఫ్రీ రాడికల్ సమస్యను నిరోధించడంలో సహాయపడుతుంది. నిమ్మరసం చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. దీనిలో విటమిన్ సి మరియు ఫ్లేవొనాయిడ్స్ ఉంటాయి,. ఇవి చర్మాన్ని హానికరమైన బాక్టీరియా నుండి కాపాడడంలో సహాయం చేస్తూ, చర్మానికి పునరుత్తేజాన్ని కలిగిస్తుంది.

కావలసిన పదార్ధాలు :

• 2 టేబుల్ స్పూన్ల బీట్రూట్ జ్యూస్

• 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం

• 1 టేబుల్ స్పూన్ పెరుగు

• 2 టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టి లేదా సెనగ పిండి

ఉపయోగించే విధానం :

• బీట్రూట్ రసాన్ని ఒక గిన్నెలోనికి తీసుకోవాలి.

• దీనిలో ముల్తానీ మట్టి లేదా శెనగ పిండిని చేర్చి బాగా కలపాలి.

• తరువాత అందులో పెరుగు మరియు నిమ్మరసం చేర్చి, మృదువుగా మిశ్రమంలా తయారయ్యే వరకు కలపాలి.

• క్రమంగా ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై సమానంగా నలుదిక్కులా విస్తరించేలా వర్తించండి.

• 15 నిమిషాల పాటు అలానే వదిలేయండి.

• దీన్ని గోరువెచ్చని నీటితో శుభ్రపరచండి.

• తర్వాత టవల్తో నీటిని తొలగించండి.

• ఉత్తమ ఫలితాల కోసం నెలలో 5 నుండి 7 మార్లు అనుసరించండి.

8. పెరుగు మరియు నిమ్మరసం :

పెరుగు మరియు నిమ్మరసం చర్మానికి మాయిశ్చరైజ్ వలె పనిచేస్తూ, చర్మం పాడవకుండా కాపాడుతుంది. తద్వారా చర్మాన్ని ప్రకాశవంతంగా చేయగలుగుతుంది.

కావలసిన పదార్ధాలు :

• 4 టేబుల్ స్పూన్ల పెరుగు

• 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం

ఉపయోగించే విధానం :

• ఈ రెండు పదార్ధాలను ఒక బౌల్లోనికి తీసుకుని మిశ్రమంగా చేయండి.

• ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై సమానంగా నలువైపులా విస్తరించునట్లు అప్లై చేయండి.

• 20 నిమిషాలపాటు అలానే వదిలేయండి.

• తరువాత దానిని చల్లని నీటితో శుభ్రపరచండి.

9. ఉల్లిపాయ మరియు తేనె :

ఉల్లిపాయలో యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇది చర్మ నష్టాన్ని నివారిస్తుంది మరియు చెడు బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయం చేస్తుంది. అంతేకాకుండా చర్మాన్ని ఆరోగ్యకరంగా ఉంచడంలో సహాయపడే అనేకరకాల విటమిన్లను కలిగి ఉంటుంది.

కావలసిన పదార్ధాలు :

• 1 టేబుల్ స్పూన్ ఉల్లిపాయ రసం

• ½ టేబుల్ స్పూన్ తేనె

ఉపయోగించే విధానం :

• ఈ రెండు పదార్ధాలను గిన్నెలో తీసుకుని మిశ్రమంగా కలపండి.

• ఈ మిశ్రమాన్ని మీ ముఖం మరియు మెడపై పూర్తిగా అప్లై చేయండి.

• దాన్ని పూర్తిగా పొడిగా మారే వరకు వదిలేయండి.

• తర్వాత చల్లని నీటితో శుభ్రపరచండి.

10. కుంకుమ పువ్వు, పాలు, పంచదార మరియు కొబ్బరి నూనె :

కుంకుమ పువ్వు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉండి, చర్మాన్ని మృదువుగా చేయడంలో సహాయపడుతుంది. ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా చేయడంతోపాటు మొటిమలు, డార్క్ సర్కిల్స్ మరియు హైపర్ పిగ్మెంటేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది. చక్కర చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది మరియు మృతకణాలను తొలగించి, లోతుగా మాయిశ్చరైజింగ్ చేయడంలో సహాయం చేస్తుంది. కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్ ఉంటుంది. అంతేకాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు క్రిమినాశక గుణాలను కలిగి ఉంటుంది. ఇది చర్మాన్ని మృదువుగా చేసి, ఆరోగ్యంగా ఉంచుతుంది.

కావలసిన పదార్ధాలు :

• 3 నుండి 4 కుంకుమ పువ్వులు.

• 1 టీస్పూన్ పాలు.

• 1 టీస్పూన్ పంచదార.

• కొన్ని చుక్కల కొబ్బరి నూనె.

ఉపయోగించే విధానం:

• నీటిలో, 2 టీస్పూన్ల కుంకుమ పువ్వును వేసి, రాత్రంతా నాననివ్వాలి.

• ఉదయం దానిలో పాలు, పంచదార మరియు కొబ్బరి నూనెను జోడించి, మిశ్రమంగా కలపండి.

• ఈ మిశ్రమాన్ని కాటన్ ప్యాడ్ ఉపయోగించి, ముఖంపై సమానంగా అప్లై చేయండి.

• 15 నిమిషాల పాటు అలానే వదిలేయండి.

• చల్లటి నీటిని ఉపయోగించి దానిని శుభ్రపరచండి.

• ఉత్తమ ఫలితాల కోసం వారంలో రెండు మార్లు అనుసరించండి.

11. మెంతులు :

మెంతులు యాంటీ యాక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉండి, ఫ్రీ రాడికల్ సమస్య నుండి కాపాడుతుంది. అలాగే చర్మం మీది చారలు, మరియు ముడుతలను తొలగించడంలో ఉత్తమంగా సహాయపడుతుంది.

కావలసిన పదార్ధాలు :

• 2 నుండి 3 టేబుల్ స్పూన్ల మెంతిగింజలు

ఉపయోగించే విధానం:

• ఒక గిన్నెలో మెంతులను తీసుకొని దానికి నీళ్ళు కలపండి.

• రాత్రంతా నీళ్ళలో నాననివ్వాలి.

• ఉదయాన్నే గ్రైండ్ చేసి, మిశ్రమంగా తయారు చేసుకోండి.

• ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై నలుదిక్కులా విస్తరించునట్లు అప్లై చేయండి.

• 15 నిమిషాలపాటు అలానే వదిలేయండి.

• సాధారణ నీటితో శుభ్రపరచండి.

12. కలబంద మరియు నిమ్మ రసం :

కలబంద గుజ్జు చర్మాన్ని లోతుగా మాయిశ్చర్ చేయడంలో సహాయం చేస్తుంది. ఇది చర్మం యొక్క స్థితిస్థాపకత మెరుగుపరచడానికి, మరియు దృఢంగా ఆరోగ్యకరంగా ఉంచడంలో సహాయపడుతుంది. నిమ్మరసం చర్మాన్ని తేలికపరుస్తుంది మరియు నల్ల మచ్చలను ఎదుర్కోవటానికి సహాయపడుతుంది.

కావలసిన పదార్ధాలు :

• 2 నుండి 3 టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జు.

• కొన్ని చుక్కల నిమ్మరసం

ఉపయోగించే విధానం :

• కలబంద గుజ్జులో నిమ్మరసం చేర్చి బాగా మిశ్రమంగా కలపాలి.

• ఈ మిశ్రమాన్ని తీసుకుని మీ ముఖంపై వృత్తాకారంలో సుమారు 2 నుండి 3 నిమిషాలపాటు మృదువుగా మర్దన చేయండి.

• మర్దన పూర్తయ్యాక 15 నిమిషాలపాటు అలానే వదిలేయండి.

• 15 నిమిషాల తర్వాత, సాధారణ నీటితో శుభ్రపరచండి.

13. నిమ్మ మరియు తేనె :

నిమ్మ మరియు తేనె పదార్ధాలు, చర్మాన్ని ప్రకాశవంతంగా మరియు ఆరోగ్యకరంగా ఉంచడంలో ఎంతగానో సహాయపడతాయి. క్రమంగా ఈ ఫేస్ ప్యాక్ మీ చర్మానికి పునరుత్తేజాన్ని తెస్తుంది.

కావలసిన పదార్ధాలు :

• 1 టేబుల్ స్పూన్ ముడి తేనె.

• కొన్ని చుక్కల నిమ్మరసం.

ఉపయోగించే విధానం :

• ఒక బౌల్లో ఈ పదార్ధాలను తీసుకుని మిశ్రమంగా కలుపుకోవాలి.

• ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై సమానంగా అప్లై చేయండి. .

• 10 నుండి 15 నిమిషాలపాటు అలానే వదిలేయండి.

• సాధారణ నీటిని ఉపయోగించి శుభ్రపరచండి.

• ఆశించిన ఫలితాల కోసం వారంలో రెండు నుండి మూడుసార్లు అనుసరించండి.

14. పెరుగు లేదా యోగర్ట్, తేనె మరియు రోజ్ వాటర్ :

రోజ్ వాటర్ చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో ఉత్తమంగా సహాయం చేస్తుంది. మరియు చర్మానికి మంచి టోన్ అందిస్తుంది. ఇది చర్మం యొక్క pH నిర్వహించడానికి మరియు చర్మాన్ని రిఫ్రెష్ చేయడానికి సహాయపడుతుంది.

కావలసిన పదార్ధాలు :

• 1 టేబుల్ స్పూన్ పెరుగు

• 1 టేబుల్ స్పూన్ తేనె

• 2 టేబుల్ స్పూన్స్ రోజ్ వాటర్

• కొన్ని గులాబీ రంగు పూలు (అవసరమని భావిస్తే)

ఉపయోగించే విధానం :

• ఒక గిన్నెలో కొన్ని గులాబీ పూలను క్రష్ చేయాలి.

• అందులో రోజ్ వాటర్, పెరుగు మిశ్రమాన్ని కలపండి.

• 2 నిమిషాలు మిశ్రమాన్ని పక్కన పెట్టండి.

• దీనికి తేనెను చేర్చి బాగా మిశ్రమంగా కలపాలి.

• వెచ్చని నీటిని ముఖం మీద చిలకరించి, పొడిగా ఆరనివ్వాలి.

• తర్వాత ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై సమానంగా నలుదిక్కులా విస్తరించునట్లు అప్లై చేయండి.

• 10 నిమిషాలపాటు అలానే వదిలేయండి.

• గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరచండి.

• ఉత్తమ ఫలితాల కోసం తరచుగా అనుసరించండి.

15. లావెండర్ ఆయిల్ మరియు అవకాడో :

లావెండర్ నూనెలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబయల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది చర్మాన్ని మృదువుగా చేయడంతోపాటు, చర్మాన్ని ముడతల బారిన పడకుండా సహాయపడుతుంది. అవకాడోలో విటమిన్ ఎ, విటమిన్ ఇ మరియు విటమిన్ సి, మెగ్నీషియం మరియు పొటాషియం నిక్షేపాలు పుష్కలంగా ఉంటాయి. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంపొందిస్తుంది, తద్వారా చర్మం స్థితిస్థాపకత మెరుగుపడుతుంది.

కావలసిన పదార్ధాలు :

• 1 టేబుల్ స్పూన్ అవకాడో గుజ్జు

• 3 నుండి 4 చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్

ఉపయోగించే విధానం :

• రెండు పదార్ధాలను మిశ్రమంగా కలుపుకోవాలి.

• ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై నలుదిక్కులా విస్తరించునట్లు సమానంగా అప్లై చేయండి.

• 15 నుండి 20 నిమిషాల పాటు అలానే వదిలేయండి.

• దీన్ని గోరువెచ్చని నీటితో శుభ్రపరచండి.

16. చందనం మరియు తేనె :

చందనం యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది, తద్వారా చెడు బ్యాక్టీరియాతో పోరాడటానికి మరియు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా చర్మాన్ని మృతకణాల బారిన పడకుండా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది మరియు సన్ టాన్, చారలు, ముడుతలను తగ్గిస్తుంది.

కావలసిన పదార్ధాలు :

• 1 టీస్పూన్ చందనం పొడి

• 1 టీస్పూన్ తేనె

ఉపయోగించే విధానం :

• ఈ రెండు పదార్ధాలను ఒక గిన్నెలోనికి తీసుకుని మిశ్రమంగా కలుపుకోవాలి.

• ఈ ప్యాక్ ను మీ ముఖంపై వర్తించండి.

• 15 నుండి 20 నిమిషాల పాటు అలానే వదిలేయండి.

• తరువాత దానిని చల్లని నీటితో శుభ్రపరచండి.

17. ఉసిరి, పెరుగు మరియు తేనె :

ఆమ్లా లేదా ఉసిరికాయ, విటమిన్ సి, ఫైబర్, మరియు యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉండే గొప్ప వనరు. ఇది ఫ్రీ రాడికల్ సమస్య తలెత్తకుండా సహాయపడుతుంది. అంతేకాకుండా చర్మానికి మంచి టోన్ అందించి, ప్రకాశవంతంగా మారుస్తుంది.

కావలసిన పదార్ధాలు :

• 1 చెంచా ఉసిరి పేస్ట్

• 1 టేబుల్ స్పూన్ పెరుగు

• 1 టేబుల్ స్పూన్ తేనె

ఉపయోగించే విధానం :

• ఒక గిన్నెలో ఉసిరి కాయల పేస్ట్ తీసుకోండి.

• అందులో తేనె మరియు పెరుగును కలపండి.

• మిశ్రమంగా అయ్యేవరకు బాగా కలపండి.

• ఈ మిశ్రమాన్ని, మీ ముఖంపై నలుదిక్కులా విస్తరించునట్లు సమానంగా వర్తించండి.

• పూర్తిగా ఆరేవరకు దాన్ని అలాగే వదిలేయండి.

• తర్వాత చల్లని నీటితో శుభ్రపరచండి.

18. తులసి, వేప మరియు పసుపు :

తులసి క్రిమినాశక గుణాలను కలిగి ఉంటుంది, తద్వారా చెడు బ్యాక్టీరియాను తగ్గించడంలో ఎంతగానో సహాయం చేస్తుంది. మరియు ఆరోగ్యవంతమైన చర్మాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. వేప చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేసి చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయం చేస్తుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది. బాక్టీరియా మరియు ఫ్రీ రాడికల్ సమస్యతో పోరాడటానికి సహాయం చేస్తుంది. క్రమంగా అదనపు నూనెను నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా మొటిమలతో పోరాడటానికి సహాయపడుతుంది. క్రమంగా మీకు ప్రకాశవంతమైన చర్మాన్ని అందివ్వడంలో సహాయం చేస్తుంది.

కావలసిన పదార్ధాలు :

• 4 తులసి ఆకులు

• 3 వేప ఆకులు

• 1 టేబుల్ స్పూన్ పసుపు

• ½ టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసం

ఉపయోగించే విధానం :

• తులసి, వేప ఆకులను మిశ్రమంగా చేయండి.

• ఈ పేస్ట్ లో పసుపు మరియు నిమ్మరసం జోడించి బాగా బ్లెండ్ చేయాలి.

• బ్రష్ సహాయంతో ఈ పేస్ట్ ను మీ ముఖంపై సమానంగా నలుదిక్కులా విస్తరించునట్లు అప్లై చేయాలి.

• దాన్ని పూర్తిగా ఆరేవరకు వదిలేయండి.

• తర్వాత చల్లని నీటితో శుభ్రపరచండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర మేకప్, ఫాషన్, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, మాతృ శిశు సంబంధ, వ్యాయామ, లైంగిక, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి

English summary

Home-made Face Packs For Glowing Skin

We try a plethora of products available in the market to get radiant skin, but to no avail. They just don't work like we expect them to. Nature has given us all that we need to get that glowing skin. Home remedies made from natural ingredients like honey, banana, curd, turmeric, aloe vera etc., can be used to get that radiant glow on the face.