గుండె,కిడ్నీ,లివర్ భద్రమేనా? ప్రతి సంవత్సరం తప్పక చేయించుకోవాల్సిన బ్లడ్ టెస్టులు ఇవే

మనం మన కార్లకు,బైకులకు తరచుగా సర్వీసింగ్ చేయిస్తుంటాం. ఎందుకంటే చిన్న సమస్య పెద్దది అయ్యి మన వాహనం లైఫ్ ని పెంచడానికి. అయితే వాహనాల విషయంలోనే ఇంత జాగ్రత్తగా ఉండే మరి మన శరీరం అనే అత్యంత విలువైన యంత్రం విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి. కార్లు,బైకుల మాదిరిగానే మన శరీరానికి కూడా ప్రతి ఏటా సర్వీసింగ్ అవసరం. ఆ సర్వీసింగే వార్షిక ఆరోగ్య పరీక్షలు. అయితే మనదేశంలొ ప్రజలకు వైద్యం అనేది అత్యంత ఖరీదైనదిగా మారిపోయింది..పేదవారు హాస్పిటల్ కి వేళ్లే తడిసిమోపెడయ్యే ఖర్చులకు భయపడి ఇలాంటి టెస్టులు చేయించుకోలేకపోతున్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో చేయించుకోవచ్చు కదా అంటే అక్కడ ఒకటి ఉంటే మరొకటి లేదన్నట్లు అరకొర వసతులతో ఉంటాయి. కానీ డబ్బు ఖర్చు అవుతుందని ఆరోగ్య పరీక్షలను నిర్లక్ష్యం చేయవద్దు.

ఇది మీ భవిష్యత్తు ఆరోగ్యంపై మీరు పెట్టే ఒక చిన్న పెట్టుబడిగా భావించండి. సరైన సమయంలో పరీక్షలు చేయించుకోవడం ద్వారా, వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి, సులభంగా ట్రీట్మెంట్ పొందవచ్చు. ఎలాంటి అనారోగ్యం రాకముందే మనల్ని మనం కాపాడుకోడానికి, మన ఆరోగ్యం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోడానికి ఈ టెస్టులు ఒక రిపోర్ట్ కార్డు లాంటివిగా ఉంటాయి. అయితే ఏ టెస్టులు చేయించుకోవాలి? ఎప్పుడు చేయించుకోవాలి? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. డాక్టర్ పసునూతి సుమంత్ ఓ ఇన్ స్టాగ్రామ్ వీడియోలో దీనికి సంబంధించిన వివరాలను తెలియజేశారు.

A Doctor s Advice The Essential Annual Blood Tests You Shouldn t Miss

ప్రతి ఒక్కరూ చేయించుకోవాల్సిన ప్రాథమిక పరీక్షలు(Basic Tests)
ఈ పరీక్షలు మన శరీరం యొక్క ప్రాథమిక పనితీరును అంచనా వేస్తాయి. వీటిని బేసిక్ హెల్త్ ప్యాకేజ్ అని కూడా అంటారు.

CBP (కంప్లీట్ బ్లడ్ పిక్చర్): మీ రక్తంలో ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్‌ లెట్ల సంఖ్యను తెలియజేస్తుంది. దీని ద్వారా రక్తహీనత , ఇన్ఫెక్షన్లు, ఇతర రక్త సంబంధిత సమస్యలను గుర్తించవచ్చు.

LFT (లివర్ ఫంక్షన్ టెస్ట్): మన శరీరంలో కీలకమైన కాలేయం ఆరోగ్యాన్ని ఇది అంచనా వేస్తుంది. హెపటైటిస్, జాండిస్ వంటి కాలేయ సమస్యలను ముందుగానే పసిగట్టవచ్చు.

RFT (రీనల్ ఫంక్షన్ టెస్ట్): మూత్రపిండాల పనితీరు ఎలా ఉందో ఈ పరీక్ష తెలియజేస్తుంది. కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది కీలకం.

లిపిడ్ ప్రొఫైల్: రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను ఇది పర్యవేక్షిస్తుంది. అధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బులకు దారితీస్తుంది కాబట్టి ఇది చాలా ముఖ్యమైన పరీక్ష.

HbA1c: గత మూడు నెలల సగటు చక్కెర స్థాయిలను ఈ టెస్టు తెలియజేస్తుంది. డయాబెటిస్ ఉందో లేదో తెలుసుకోవడానికి, ఉన్నవారిలో నియంత్రణను అంచనా వేయడానికి ఇది సహాయపడుతుంది.

TSH (థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్): థైరాయిడ్ గ్రంథి పనితీరులో అసమతుల్యత (హైపో లేదా హైపర్ థైరాయిడిజం)ను ఈ పరీక్ష గుర్తిస్తుంది. బరువు పెరగడం లేదా తగ్గడం, నీరసం వంటి లక్షణాలకు ఇది ఒక కారణం కావచ్చు.

A Doctor s Advice The Essential Annual Blood Tests You Shouldn t Miss

ప్రత్యేక పరీక్షలు (Special Tests)

ప్రాథమిక పరీక్షలతో పాటు ఆధునిక జీవనశైలి వల్ల తలెత్తే కొన్ని లోపాలను తెలుసుకోవడానికి ఈ పరీక్షలు ఉపయోగపడతాయి.

విటమిన్ డి: ఎముకల బలం, రోగనిరోధక శక్తికి ఇది అత్యవసరం. దీని లోపం వల్ల విపరీతమైన అలసట, కండరాల నొప్పులు వస్తాయి. విటమిన్స్ తో చాలా పంచాయతీ ఉంటుందని డాక్టర్ పసునూతి సుమంత్ తెలిపారు . ప్రతి పెద్ద జబ్బు విటమిన్ డెఫీషియన్సీతోనే ప్రారంభమవుతుంది. విటమిన్ డి అంటే కేవలం బొక్కలు గురించే అనుకుంటారని కానీ ఇది గుండెకు, బ్రెయిన్ కి చాలా చాలా ముఖ్యం అని చెప్పారు. విటమిన్ డి రక్తనాళాలు హెల్దీగా ఉండటానికి చాలా చాలా ముఖ్యమన్నారు.

విటమిన్ బి12: దీని లోపం వల్ల తీవ్రమైన నీరసం, కాళ్లు చేతుల్లో తిమ్మిర్లు, మతిమరుపు వంటి సమస్యలు తలెత్తుతాయి.

హోమోసిస్టీన్: రక్తంలో దీని స్థాయిలు ఎక్కువగా ఉంటే గుండె, మెదడు ఆరోగ్యానికి ప్రమాదం. ఇది గుండెపోటు, స్ట్రోక్ వంటి వాటికి ఒక ముఖ్యమైన మార్కర్.

పరీక్షలు ఎప్పుడు చేయించుకోవాలి?
50 ఏళ్ల లోపు వారు (ఆరోగ్యంగా, ఎటువంటి రిస్క్ లేనివారు) బేసిక్, ప్రత్యేక పరీక్షలన్నీ సంవత్సరానికి ఒకసారి చేయించుకోవడం మంచిది.

50 ఏళ్లు పైబడిన వారు (ఆరోగ్యంగా ఉన్నప్పటికీ)వయసుతో పాటు వచ్చే మార్పులను గమనించడానికి, బేసిక్, స్పెషల్ పరీక్షలను ప్రతి 6 నుండి 12 నెలలకు ఒకసారి చేయించుకోవాలి.

డయాబెటిస్, అధిక రక్తపోటు, ఊబకాయం ఉన్నోళ్లు: మీ సమస్యలు నియంత్రణలో ఉంటే ప్రతి 6 నెలలకు ఒకసారి పరీక్షలు చేయించుకోవాలి. సమస్యలు అదుపులో లేకపోతే ప్రతి 3 నెలలకు ఒకసారి వైద్యుని సలహా మేరకు పరీక్షలు తప్పనిసరి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Desktop Bottom Promotion