For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మూర్చ వ్యాధి గురించి కొన్ని అపోహలు- వాస్తవాలు

|

సాధారణంగా రోడ్డు మీద వెళ్తుంటే హఠాత్తుగా కింద పడిపోయి కాళ్లూ చేతులు కొట్టుకుంటూ ఉండేవాళ్లను చూసే ఉంటాం. ఇది ఒకరి నుంచి ఒకరికి అంటుకుంటుందని, పిల్లలకు కూడా ఈ వ్యాధి వస్తుందని రకరకాల అభిప్రాయాలతో మూర్ఛవ్యాధి ఉన్నవారిని పెళ్లి చేసుకోవడానికి కూడా ఎవరూ ముందుకు రారు. అంతేకాదు.. మూర్ఛ ఉందన్న కారణంగా విడాకుల కోసం వెళ్లేవాళ్లు కూడా కనిపిస్తుంటారు. నిజానికి ఈ వ్యాధి అనుకున్నంత ప్రమాదకరం ఏమీ కాదు. మూర్చవ్యాధి గురించి మరికొన్ని సందేహాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే...

నాడీవ్యవస్థ పైన ప్రభావం చూపించే వ్యాధి మూర్ఛ వ్యాధి లేదా ఎపిలెప్సీ. ఇది ఏ వయసు వారికైనా రావచ్చు. 0.5 నుంచి 2 శాతం మందిలో జీవిత కాలంలో ఎప్పుడో ఒకసారి మూర్ఛ రావచ్చు. మనదేశంలో దాదాపు 10 మిలియన్ల మందికి మూర్ఛ ఉంది. అంటే ప్రతి వెయ్యిమందిలో పదిమందికి మూర్ఛ ఉందన్నమాట.

మెదడులో విద్యుత్తు అనియంత్రితంగా విడుదల అయినప్పుడు ఇలా మూర్ఛలు వస్తాయి. ఒక వ్యక్తికి కనీసం రెండుసార్లు మూర్ఛ వస్తేనే దాన్ని మూర్ఛవ్యాధి లేదా ఎపిలెప్సీగా పరిగణిస్తారు. విపరీతమైన జ్వరం రావడం, పుట్టుకతో లోపాలు, మెదడులో లోపాలు, కణుతులు, మెనింజైటిస్ లాంటి ఇన్‌ఫెక్షన్లు, తలకు గాయాలు కావడం, మరీ వేడినీళ్లతో తలస్నానం చేయడం, అతిగా మద్యం తీసుకోవడం, నిద్ర లేకపోవడం, నెలసరి సమయాలు, మందుల మధ్య ప్రతిచర్యలు సాధారణంగా మూర్ఛకు కారణమవుతాయి.

మూర్ఛ వ్యాధి యొక్క అపోహలు- నిజానిజాలు

1. అపోహ: ఇది అంటువ్యాధి
వాస్తవం : గాలి, ఆహారం, నీరు, స్పర్శ లేదా మరే ఇతర మార్గం ద్వారా గాని మూర్ఛ ఒకరి నుంచి మరొకరికి అంటుకోదు.

2. అపోహ: మూర్ఛ వచ్చిన వ్యక్తిని పట్టుకుని ఉండాలి

వాస్తవం: వ్యక్తిని నిర్బంధించే ప్రయత్నం చేయవద్దు. ఇది మరింత గాయం కలిగించవచ్చు. గట్టి, పదునైన వస్తువులను వారికి దగ్గరలో ఉంచవద్దు. తలకింద ఏదైనా మెత్తని వస్తువును ఉంచాలి.

3. అపోహ: మూర్ఛ వ్యాధి పుట్టుకతోనే వస్తుంది

వాస్తవం: ఏ వయసులోనైనా, ఏ సమయంలోనైనా మూర్ఛ రావచ్చు. అయితే సాధారణంగా మొదట పిల్లల్లోనూ, తరువాత యువకులైన పెద్దవాళ్లలోనూ వస్తుంది.

4. అపోహ: మూర్ఛ తెలివితేటలు తక్కువగా ఉన్నాయనడానికి సంకేతం

వాస్తవం: ఇది ఒక శారీరక స్థితి మాత్రమే గాని మానసిక లోపం ఎంతమాత్రమూ కాదు. అసాధారణమైన తెలివితేటలు కలిగిన ప్రముఖ వ్యక్తులెందరో మూర్ఛవ్యాధి ఉన్నవాళ్లే.

5. అపోహ: మూర్ఛ ఉన్నవాళ్లను దేవుడు ఆవహించి ఉంటాడు

వాస్తవం: దేవుడు ఆవహించాడని వీళ్లకు పూజలు చేస్తుంటారు కొందరు. కాని మూర్ఛ ఉన్నప్పుడు ఈ రోగులు అదుపు చేయలేని విధంగా పిచ్చిగా ప్రవర్తిస్తారు. ఇది మానవాతీత శక్తుల పని కాదు. మెదడులో సమతుల్యత దెబ్బతినడం కారణం. కాబట్టి వారిని పూజించడం కాకుండా సకాలంలో వైద్య చికిత్సలు అందించి, ఆదరించాలి.

6. అపోహ: మూర్ఛ రోగి ఉంటే ఆ కుటుంబానికే కళంకం :

వాస్తవం: ఇలా భావించి చాలామంది ఈ నిజాన్ని దాచివుంచుతుంటారు. దీనివల్ల మరిన్ని సమస్యలు రావడమే తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇలాంటి మూఢ భావాలను తొలగించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి.

Myths and Facts About Epilepsy

చేయకూడనివి...
1.మూర్ఛ వ్యాధి ఉన్నప్పుడు ఉన్నట్టుండి మందులను ఆపేయకండి. దీనివల్ల నరాల సంబంధితమైన అత్యవసర పరిస్థితి అయిన ఎపిలెప్టికస్‌ని తొందరగా తీసుకురావచ్చు.
2. మీకు మీరుగా మందుల బ్రాండ్‌ను మార్చకూడదు.
3. మందుల మోతాదులో మార్పులు సొంతంగా చేయకూడదు.
4. ఏ మందుల వల్లనైనా దుష్ప్రభావాలు కలిగినా, సహించకపోయినా వెంటనే డాక్టర్‌కు చెప్పడానికి వెనుకాడవద్దు.
5. ఏకకాలంలో ఇతర వ్యాధులున్నప్పుడు, గర్భిణిగా ఉన్నప్పుడు ఇతర మందులను నిలిపివేయడం గాని, తగ్గించడం గాని మీకు మీరుగా చేయకూడదు.
6. మరీ కాంతిమంతమైన దీపాలకు, బిగ్గరగా ఉండే ధ్వనులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి.
చేయకూడనివి
7. వాహనాలను నడపడం
8. ఈత కొట్టడం
9. ఎత్తయిన చోట్ల పనిచేయడం, ఎత్తులకు ఎక్కడం చేయకూడదు.
10. భారీ యంత్రాలు, లేదా ఉపకరణాలతో పనిచేయడం.

మూర్ఛ వచ్చినప్పుడు: మూర్ఛను ఆపే ప్రయత్నం చేయొద్దు., ఆ సమయంలో బలవంతంగా నోట్లోకి ఏమీ కుక్కవద్దు. తగినంత గాలి ఆడేందుకు వీలు కలిగించాలి. వాంతి మింగకుండా ఉండేందుకు పక్కకు తిరగాలి. వీలయినంత త్వరగా వైద్య సహాయం అందేలా చూడాలి.

Story first published: Thursday, December 4, 2014, 14:13 [IST]
Desktop Bottom Promotion