షాపులో కొన్న నెయ్యి ఒరిజనలా లేదా కల్తీదా? ఇలా చేస్తే ఈజీగా తెలిసిపోతుంది

మన భారతీయుల వంటగదుల్లో ఉండే అతిముఖ్యమైన పదార్థాలలో నెయ్యి ఒకటి. స్వచ్ఛత, సాంప్రదాయినికి చిహ్నంగా నెయ్యిని భావిస్తుంటారు. వంటల్లో మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక సంప్రదాయాలలో,పూజలు వంటి వాటికి నెయ్యిని వాడుతుంటారు. నెయ్యి చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగించబడుతుంది. ఇక నెయ్యిని ఆహారంలో తీసుకోవడం వల్ల అనేక రకాలుగా మేలు జరుగుతుంది. అనేక ప్రమాదకరమైన వ్యాధుల నుంచి కూడా నెయ్యి మనల్ని కాపాడుతుంది. ఆయుర్వేదంలో కూడా నెయ్యికి ఓ ప్రత్యేక స్థానం ఉంటది.

ఇటీవల కాలంలో మార్కెట్ లోకి నకిలీ నెయ్యి వచ్చేస్తుంది. చాలామంది ఈ నకిలీ నెయ్యి వాడి అనారోగ్యాల పాలైపోతున్నారు. అందుకే కొంతమంది మా నెయ్యిలో కల్తీ ఉండదు, ఫ్యూర్ గా ఉంటుంది అని మరీ మార్కెట్ చేసుకుంటున్నారు. అయితే షాపులో నుంచి ఇంటికి తెచ్చుకున్న నెయ్యి కల్తీదో కాదో తెలుసుకోవడం చాలా సింపుల్. నెయ్యి ఒరిజినల్ గా ఉందా లేదా కల్తీ జరిగిందా ఎట్లా తెలుసుకోవాలో ఇక్కడ చూడండి.

how to check purity of ghee at home try these tricks

ఈ టిప్స్ ట్రై చేయండి

నీటితో కలపండి

మీరు కొన్న నెయ్యి నిజంగా స్వచ్ఛమైనదేనా అని అనుమానంగా ఉంటే.. చిన్న గిన్నెలో కొద్దిగా షాపు నుంచి కొన్న నెయ్యి వేయండి. అందులోనే రెండు మూడు చుక్కల నీళ్లు వేయండి. కాసేపు తర్వాత ఆ నెయ్యి నీటిలో వెంటనే కలిసిపోకుండా విడిపోయినట్లుగా అనిపించినా లేదా నీటి చుక్కలు నెయ్యి పైన తేలుతూ ఉన్నట్లు కనిపించినా అది కల్తీ నెయ్యి అని అర్థం చేసుకోవచ్చు. ఇలా జరిగిందంటే ఆ నెయ్యిలో ఖచ్యితంగా ఇతర పదార్థాలు అంటే ఆయిల్ లేదా జంతువుల కొవ్వులు కలిపి ఉండవచ్చు.

అదే స్వచ్ఛమైన నెయ్యి అయి ఉంటే అందులో నీరు కలిపినప్పుడు అది వేరుగా కాకుండా,నీటితో కలిసి ఒక మృదువైన మిశ్రమంగా తయారవుతుంది. అది నీటిలో కలిసినా కూడా తన సహజమైన రూపాన్ని నిలుపుకుంటుంది. ఈ చిన్న పరీక్షతో నెయ్యి నాణ్యతను నిర్ధారించుకోవచ్చు.

రంగు
మంచి స్వచ్ఛమైన నెయ్యి ఎప్పుడూ లేత బంగారు పసుపు రంగులో ఉంటుంది. ఈ రంగు చూడటానికి చాలా ఆకర్షణీయంగా,ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఒకవేళ మీరు కొన్న నెయ్యి సాధారణం కంటే ఎక్కువగా తెల్లగా ఉంటే అది స్వచ్ఛమైనది కాకపోవచ్చు. అలా ఉంటే అందులో పిండి పదార్థాలు,హానికరమైన రసాయనాలు లేదా జంతువుల కొవ్వులు కలిపి ఉండవచ్చు. నకిలీ నెయ్యికి.. అసలైన,మంచి నెయ్యికి ఉండే సహజమైన బంగారు రంగు ఉండదు. కాబట్టి నెయ్యి కొనేటప్పుడు దాని రంగును జాగ్రత్తగా పరిశీలించడం చాలా చాలా ముఖ్యం. రంగును బట్టి అది స్వచ్ఛమైనదా కాదా అని కొంతవరకు గుర్తించవచ్చు.

ఫ్రిడ్జ్ లో పెట్టండి
మీరు కొన్న నెయ్యి స్వచ్ఛమైనదా కాదా అని మరొక టెస్ట్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఒక చిన్న గిన్నెలో కొద్దిగా నెయ్యి తీసుకొని దానిని కొన్ని గంటలపాటు మీ ఫ్రిజ్‌లో పెట్టేయండి. కాసేపయ్యాక చూడండి. స్వచ్ఛమైన నెయ్యి అయితే అది గట్టిగా మారిపోతుంది. అంతేకాదు మీరు దానిని తాకితే జిడ్డుగా అనిపించకుండా ఒక గట్టి వెన్నలా ఉంటుంది. ఎలాంటి జిడ్డు మరకలు కూడా ఉండవు. స్వచ్ఛమైన నెయ్యి తన సహజమైన రూపాన్ని నిలుపుకుంటుంది.

ఒకవేళ ఆ నెయ్యి ఫ్రిజ్‌లో పెట్టిన తర్వాత కూడా పూర్తిగా గట్టిపడకుండా ద్రవంగానే ఉండినా, లేదా దాని చుట్టూ జిడ్డు జిడ్డుగా అనిపించినా అది కల్తీ నెయ్యి అయ్యే అవకాశం ఉంది. అలా ఉంటే, అందులో జంతువుల కొవ్వులు లేదా తక్కువ నాణ్యత కలిగిన చౌకైన ఆయిల్స్ వంటివి కలిపి ఉండవచ్చు. ఇటువంటి పదార్థాలు నెయ్యి సహజమైన గట్టిపడే స్వభావాన్ని మార్చేస్తాయి. కాబట్టి ఇకపై మీరు నెయ్యి కొన్నప్పుడు దాని స్వచ్ఛతను పరీక్షించడానికి ఈ ఫ్రిజ్ ట్రిక్‌ను తప్పకుండా ప్రయత్నించండి.

వాసన
స్వచ్ఛమైన నెయ్యిని ప్యాకెట్ ఓపెన్ లేదా బాక్స్ మూత తీసినా మీ ముక్కుపుటాలను తాకే ఆ సువాసన అద్భుతంగా ఉంటుంది. అది పాల నుండి వచ్చిన సహజమైన కొవ్వుల ప్రత్యేకమైన వాసన. ఆ సువాసనలోనే నెయ్యి స్వచ్ఛత దాగి ఉంటుంది. ఒకవేళ మీరు కొన్న నెయ్యికి ఆ మధురమైన వాసన లేకపోతే లేదా అది పుల్లగా అనిపించినా లేదా మీకు ఏదో అసహ్యకరమైన వాసన వస్తున్నట్లు అనిపించినా జాగ్రత్త వహించండి. అలా ఉంటే ఆ నెయ్యిలో వేరే నూనెలు, హానికరమైన రసాయనాలులేదా దానిని ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి వాడే ప్రిజర్వేటివ్స్ కలిపి ఉండవచ్చు. ఇటువంటి కల్తీలు నెయ్యి సహజమైన సువాసనను పూర్తిగా మార్చివేస్తాయి. కాబట్టి నెయ్యి కొనేటప్పుడు దాని సువాసనను తప్పకుండా పరిశీలించండి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Thursday, April 3, 2025, 15:31 [IST]
Desktop Bottom Promotion