ఆయుష్షు పెరగుతుంది: గుండె వయస్సును వెనక్కి తిప్పగలమా?..పరిశోధనలో సంచలన విషయాలు

మనిషి సహా ఈ భూమ్మీద పుట్టిన ఏ జీవికి అయినా మరణం తప్పదు. వయసు పెరగడం అనేది ఏ జీవి లైఫ్ లో అయినా ఒక అనివార్యమైన భాగం. అయితే మనుషులకు వయస్సు పెరిగే కొద్దీ చర్మంపై ముడతలు, జుట్టు రంగు మారడం వంటివి సహజంగా జరుగుతుంటాయి. అయితే మన కంటికి కనిపించని, శరీరంలోని అత్యంత కీలకమైన అవయవమైన గుండెలో కూడా వృద్ధాప్య ఛాయలు ప్రవేశిస్తాయని మీకు తెలుసా? కాలక్రమేణా గుండె పనితీరు మందగించడం, రక్తనాళాలు గట్టిపడటం వంటివి సహజమేనని ఇప్పటివరకు మనం భావిస్తూ వచ్చాం.అయితే ఆ భావనను తలకిందులు చేసే ఒక విప్లవాత్మకమైన ఆవిష్కరణ వెలుగులోకి వచ్చింది. గుండె వృద్ధాప్య ప్రక్రియను కేవలం నిరోధించడమే కాదు, దానిని వెనక్కి తిప్పడం కూడా సాధ్యమేనని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

ఈ అద్భుతమైన పరిశోధన వివరాలు ప్రఖ్యాత నేచర్ మెటీరియల్స్ జర్నల్‌ లో ప్రచురించబడింది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గుండె కణాలను నేరుగా మార్చడానికి బదులుగా ఆ కణాల చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చడం ద్వారా వాటిని పునరుజ్జీవింపజేయవచ్చని నిరూపించడం. ఇది వయస్సు సంబంధిత గుండె జబ్బుల ట్రీట్మెంట్ లో ఒక కొత్త చరిత్రకు నాంది పలుకుతోంది.

Reversing Heart Aging Scientists Make Groundbreaking Discovery

గుండె వృద్ధాప్యానికి అసలు కారణం
మన గుండె కేవలం కండరాల కణాల సమూహం మాత్రమే కాదు. ఆ కణాలకు మద్దతునిస్తూ వాటిని ఒకచోట పట్టి ఉంచుతూ వాటి మధ్య సమాచారాన్ని చేరవేసే ఒక సంక్లిష్టమైన వల లాంటి నిర్మాణం ఉంటుంది. దీనినే బాహ్య కణ మాతృక లేదా ఎక్స్‌ట్రాసెల్యులర్ మ్యాట్రిక్స్ (ECM) అంటారు. ECM.. గుండె కణజాలానికి నిర్మాణ సమగ్రతను ఇస్తుంది. గాయాలైనప్పుడు మరమ్మతులు చేయడంలో సహాయపడుతుంది, కణాల మనుగడకు అవసరమైన జీవరసాయన సంకేతాలను అందిస్తుంది. వయసు పెరిగే కొద్దీ ఈ ECMలో మార్పులు వస్తాయి. ఇది తన సహజమైన మృదుత్వాన్ని,సాగే గుణాన్ని కోల్పోయి గట్టిగా,బిరుసుగా మారుతుంది. ఇలా గట్టిపడిన ECM, గుండె కణాలపై ఒత్తిడి పెంచుతుంది. దానివల్ల గుండె రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యం తగ్గుతుంది, కణాలు సరిగ్గా పనిచేయలేవు. ఇదే క్రమంగా అధిక రక్తపోటు, గుండె వైఫల్యం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది.

ఇన్నాళ్లు వృద్ధాప్య పరిశోధనలన్నీ గుండె కణాలలో జరిగే మార్పులపైనే దృష్టి పెట్టాయి. అయితే ఇప్పుడు సింగపూర్‌ లోని మెకనోబయాలజీ ఇన్‌స్టిట్యూట్ సైంటిస్టులు ఒక అడుగు ముందుకు వేసి అసలు సమస్య కణంలో కాదని, కణం చుట్టూ ఉన్న వాతావరణంలో ఉందని గుర్తించారు.

Take a Poll

వృద్ధాప్యాన్ని జయించిన గుండె కణాలు

పరిశోధకులు "DECIPHER" అనే ఒక అత్యాధునిక ప్రయోగశాల నమూనాను సృష్టించారు. ఇందులో వారు యవ్వనమైన,వృద్ధాప్యంలోని ఎలుకల గుండె కణజాలాన్ని, వాటి సహజ వాతావరణాన్ని పోలిన జెల్‌ తో కలిపారు. ఈ జెల్‌ ను వారు యవ్వనమైన ECM లాగా,వృద్ధాప్యంలోని ECM లాగా రెండు రకాలుగా తయారుచేశారు.

యవ్వన కణాలు, వృద్ధ వాతావరణంలో: ఆరోగ్యంగా చురుకుగా ఉన్న యవ్వన గుండె కణాలను వృద్ధాప్య ECM (గట్టిపడిన జెల్)లో ఉంచినప్పుడు అవి నెమ్మదిగా తమ శక్తిని కోల్పోయాయి. వాటి పనితీరు మందగించి వృద్ధాప్య సంకేతాలను చూపించడం ప్రారంభించాయి. అంటే మంచి కణాలను కూడా చెడు వాతావరణం పాడుచేసింది.

Reversing Heart Aging Scientists Make Groundbreaking Discovery

వృద్ధ కణాలు, యవ్వన వాతావరణంలో: ఇది అసలైన అద్భుతం. బలహీనపడి, వృద్ధాప్యంలో ఉన్న గుండె కణాలను యవ్వన ECM (మృదువైన, ఆరోగ్యకరమైన జెల్)లో ఉంచినప్పుడు, అవి మళ్ళీ పునరుజ్జీవనం పొందాయి. వాటి పనితీరు మెరుగుపడింది, అవి యవ్వన కణాల వలె చురుకుగా మారాయి. అంటే వాతావరణం మారితే కణాల తలరాత కూడా మారుతుందని స్పష్టమైంది.

ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ జెన్నిఫర్ యంగ్ మాటల్లో చెప్పాలంటే..'చాలా వృద్ధాప్య పరిశోధనలు కణాల లోపల ఏం జరుగుతుందో చూస్తాయి. మేము కణం బయట చూశాము, అది మా దృక్పథాన్నే మార్చేసింది. ఈ ఆవిష్కరణ భవిష్యత్తులో గుండె జబ్బుల ట్రీట్మెంట్ ను పూర్తిగా మార్చేయగలదు'అని అన్నారు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Tuesday, July 1, 2025, 11:04 [IST]
Desktop Bottom Promotion