మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు!

మూత్ర విసర్జన పూర్తయిన తర్వాత కూడా తెలియకుండానే కొన్ని చుక్కల మూత్రం కారడం.. ఇది చాలా మందిని వేధించే ఇబ్బందికరమైన సమస్య. అయితే చాలామంది ఇదేమైనా పెద్ద సమస్యనా అని లైట్ తీసుకుంటారు. కానీ ఈ సమస్య దీర్ఘకాలం పాటు కొనసాగితే కచ్చితంగా హాస్పిటల్ కు వెళ్లాల్సిందేనని వైద్య నిపుణులు చెబుతుంటారు.

వైద్య పరిభాషలో ఈ సమస్యను పోస్ట్ మిక్ట్యూరిషన్ డ్రిబ్లింగ్ (Post Micturition Dribbling) అని పిలుస్తారు. మహిళల కంటే పురుషుల్లోనే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. దీని వెనుక ప్రధానంగా మూడు ఆరోగ్య సమస్యలు దాగి ఉండొచ్చని వైద్య నిపుణులు వివరిస్తున్నారు.

Urine Leaking After You Pee It Could Be a Sign of These 3 Diseases

ప్రొస్టేట్ గ్రంథి వాపు

యాభై ఏళ్లు పైబడిన మగవాళ్లలో ప్రొస్టేట్ గ్రంథి పరిమాణం పెరగడం అనేది చాలా సాధారణంగా కనిపించే మార్పు. ఈ గ్రంథి పరిమాణం పెరిగినప్పుడు, అది మూత్రనాళంపై తీవ్రమైన ఒత్తిడి పెంచి మూత్ర ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది. దీనివల్ల మూత్ర విసర్జన చేసినప్పటికీ, మూత్రాశయం పూర్తిగా ఖాళీ అవ్వదు. కొంత మూత్రం మూత్రనాళంలోనే నిలిచిపోయి, ఆ తర్వాత కొద్దిసేపటికి చుక్కలు చుక్కలుగా బయటకు వస్తుంది.

కటి కండరాలు బలహీనపడటం

మన శరీరంలోని కటి భాగం (Pelvic Floor) కండరాలు మూత్రనాళానికి, మూత్రాశయానికి ఒక బలమైన పునాదిలా మద్దతునిస్తాయి. ఈ కండరాలు బలహీనపడినప్పుడు మూత్రాన్ని పూర్తిగా బయటకు పంపే సామర్థ్యం తగ్గిపోతుంది. ఫలితంగా మూత్ర విసర్జన తర్వాత కూడా లీకేజీ సమస్య తలెత్తుతుంది. అధిక బరువు, తరచుగా బరువైన వస్తువులు ఎత్తడం, దీర్ఘకాలికంగా వేధించే దగ్గు లేదా గతంలో జరిగిన కొన్ని రకాల ఆపరేషన్స్ ప్రభావం వల్ల ఈ కండరాలు తమ బలాన్ని కోల్పోతాయి.

నాడీ సంబంధిత సమస్యలు

మెదడు నుంచి మూత్రాశయానికి సంకేతాలు అందించే నరాల్లో లోపాలు తలెత్తినా ఈ సమస్య వస్తుంది. కొన్ని రకాల నాడీ సంబంధిత వ్యాధులు లేదా మూత్రనాళానికి సంబంధించిన నరాల బలహీనత వల్ల మూత్రాశయం పనితీరు దెబ్బతింటుందని డాక్టర్ భాను మిశ్రా స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మూత్రంపై నియంత్రణ కోల్పోయి, అసంకల్పితంగా మూత్రం లీక్ అవుతుంది.

డాక్టర్లను ఎప్పుడు సంప్రదించాలి?

కేవలం మూత్రం చుక్కలుగా కారడమే కాకుండా, ఈ క్రింది లక్షణాలు కూడా మీలో కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను కలవడం అవసరం.

-పదే పదే మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం.

-మూత్రం పోసేటప్పుడు తీవ్రమైన మంట లేదా నొప్పి అనిపించడం.

-మూత్రం ధారగా కాకుండా, ఆగి ఆగి రావడం లేదా పోయడానికి బాగా ఇబ్బంది పడటం.

-మూత్రం ప్రవాహం (ఫోర్స్) బాగా తగ్గిపోవడం.

-మూత్రం ఎర్రగా లేదా రంగు మారి రావడం (రక్తం పడటం).

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Thursday, September 3, 2026, 16:48 [IST]
Desktop Bottom Promotion