Just In
- 21 min ago చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- 32 min ago తీర్చుకోలేని రుణం అమ్మ ప్రేమ..! అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు..
- 1 hr ago ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- 3 hrs ago మీనరాశిలో కుజుడు-రాహువు కలయిక వల్ల అంగారక యోగం ఏర్పడుతుంది..జూన్ 1 వరకు ఈ రాశులకు కష్టాలు తప్పవు..జాగ్రత్త
మొక్కజొన్న తింటే ఎవరికైనా సంతోషం కలుగుతుంది.. ఎందుకో తెలుసా? బేబీ కార్న్ తో బోలెడన్నీ ప్రయోజనాలు
మొక్కజొన్న ఈ పేరు అందరికీ తెలిసిందే. అందులో లేత మొక్క జొన్న విత్తనాలతో వచ్చే ప్రయోజనాలు చాలా ఉంటాయి. ఇక సూప్ తాగినా సలాడ్‌గా తిన్నా ఏ రూపంలో తీసుకున్నా మొక్కజొన్న రుచే వేరు. మొక్కజొన్న ఉపయోగాలు.
మొక్కజొన్న ఈ పేరు అందరికీ తెలిసిందే. అందులో లేత మొక్క జొన్న విత్తనాలతో వచ్చే ప్రయోజనాలు చాలా ఉంటాయి. ఇక సూప్ తాగినా సలాడ్‌గా తిన్నా ఏ రూపంలో తీసుకున్నా మొక్కజొన్న రుచే వేరు. చిరుతిండిగా తినే పాప్‌కార్న్ సంగతి సరేసరి. అందుకే సుమారు తొమ్మిది వేల సంవత్సరాల క్రితమే మెజో అమెరికన్లు పండించిన మొక్కజొన్న నేడు ప్రపంచవ్యాప్త ఆహారంగా మారింది. ఒకప్పుడు మెజో అమెరికన్లు పండించిన మొక్కజొన్నను మాయన్లు పెంచి పోషించారని చెప్పాలి.
అల్పాహారంగా..
ఆనాటి నుంచి ఈనాటి వరకూ దీన్ని వాళ్లు కూరగాయగానూ అల్పాహారంగానూ చిరుధాన్యంగానూ వాడుతూనే ఉన్నారు. అంతేకాదు, జన్యుమార్పుల ద్వారా మేలైన వంగడాలనూ సృష్టిస్తున్నారు. ఇక కార్న్ లో కూడా చాలా రకాలుంటాయి. ఇక బేబీ కార్న్ తో చాలా ప్రయోజనాలున్నాయి.
రకరకాల వంటకాలు చేసుకుని తింటుంటారు
బేబీ కార్న్‌తో చాలా మంది అనేక రకాల వంటకాలు చేసుకుని తింటుంటారు. బేబీ కార్న్ కేవలం రుచిలో మాత్రమే కాదు, మనకు ఆరోగ్యకర ప్రయోజనాలను అందించడంలోనూ బాగా పనిచేస్తుంది. బేబీ కార్న్‌లో మన శరీరానికి అవసరమైన కీలకమైన పోషకాలు ఉంటాయి. ఇవి మనకు అనేక లాభాలను కలిగిస్తాయి. బేబీ కార్న్‌ను తరచూ తింటుంటే చాలా ప్రయోజనాలు కలుగుతాయి.
బరువు తగ్గాలనుకునే వారికి
బేబీ కార్న్‌లో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి. 100 గ్రాముల బేబీ కార్న్ తింటే కేవలం 26 క్యాలరీలు మాత్రమే వస్తాయి. అందువల్ల ఇది బరువు తగ్గాలనుకునే వారికి మేలైన ఆహారంగా పనిచేస్తుంది.
ఫైబర్ (పీచు పదార్థం) పుష్కలం
బేబీ కార్న్‌లో ఫైబర్ (పీచు పదార్థం) పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది. అందువల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. మలబద్దకం తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.
శారీరక, మానసిక ఆరోగ్యం
బేబీ కార్న్‌లో ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. దీంతోపాటు విటమిన్ ఎ, ఐరన్, విటమిన్ సిలు కూడా వీటిల్లో ఉంటాయి. కనుక ఇవి మనకు చక్కని పోషణను అందిస్తాయి. శారీరక, మానసిక ఆరోగ్యం కలుగుతుంది.
పోషకాలు సమృద్ధిగా ఉంటాయి
బేబీ కార్న్‌లో కెరోటినాయిడ్స్ అనబడే పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి దృష్టి సంబంధ సమస్యలను దూరం చేస్తాయి. చూపు బాగా పెరుగుతుంది. నేత్ర సమస్యలు ఉన్నవారు బేబీ కార్న్‌ను తరచూ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దీంతోపాటు కంటి శుక్లాలు రాకుండా ఉంటాయి.
ఫోలేట్ అనే పోషక పదార్థం
ఫోలేట్ అనే పోషక పదార్థం బేబీ కార్న్‌లో పుష్కలంగా ఉంటుంది. ఇది గర్భిణీలకు మేలు చేస్తుంది. శిశువు ఎదుగుదలకు సహాయపడుతుంది. అందువల్ల గర్భిణీలు బేబీ కార్న్ తినడం చాలా మంచిది.
ఆరోగ్యం సమతుల్యం
మొక్కజొన్నను అప్పుడప్పుడు తింటూ ఉంటే అనారోగ్యానికి ఆమడ దూరం ఉండొచ్చు. కానీ ఇందులో కొలెస్ట్రాల్ ఎక్కువ, క్యాలరీలు ఎక్కువ అనే సాకు చెప్పి కొందరు వీటిని తినరు. ఆరోగ్యకరమైన కోలెస్ట్రాల్‌ని శరీరం కలిగి ఉండాలి అనే వాస్తవాన్ని విస్మరించి పుష్టికరమైన ఆహారాన్ని దూరం పెట్టడం ఇప్పుడు పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. మొక్క జొన్న లోని విటమిన్లు, యాంటీ యాక్సిడెంట్లు, ఖనిజాలు, రసాయనాలు మానన శరీర ఆరోగ్యాన్ని అత్యంత సమతుల్యతలో ఉంచుతాయి.
సంతోషభావనను పెంచే రసాయనాలు
మొక్కజొన్న పొత్తులను మనం ఏదో సరదాగా తింటుంటాం. కానీ మనకు మొక్క జొన్న పొత్తుతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వీటిని సరదాగా తినేప్పుడు సంతోషం కూడా కలుగుతుంది కదా. అందుకూ ఒక కారణం ఉంది. మొక్కజొన్నలో సంతోషభావనను పెంచే రసాయనాలైన ఫ్లేవనాయిడ్స్ ఉండడమే కారణం.
బీటా–కెరోటిన్
మొక్కజొన్నలో బీటా-కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. వంద గ్రాముల మొక్కజొన్న గింజలను తింటే ఒక రోజులో అవసరమైన విటమిన్-ఏ లోని ఆరు శాతం మనకు సమకూరుతుంది. విటమిన్-ఏ మన కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న విషయం తెలిసిందే.
క్యాన్సర్లను నివారించే సామర్థ్యం
మొక్కజొన్నలో ఫెలురిక్ యాసిడ్ అనే శక్తిమంతమైన యాంటీ-ఆక్సిడెంట్ ఉంటుంది. అనేక రకాల క్యాన్సర్లను నివారించే సామర్థ్యం దానికి ఉంది. అంతేకాదు... అది వయసు పెరుగుతున్నప్పుడు కనిపించే దుష్ప్రభావాలను అరికడుతుంది. గాయం అయినప్పుడు కలిగే ఇన్ఫ్లమేషన్ (వాపు, మంట, నొప్పి)ను తగ్గించే శక్తి కూడా దీనికి ఉంది.
అనేకానేక జీవక్రియల నిర్వహణకు
మొక్కజొన్నలో విటమిన్ బి-కాంప్లెక్స్‌లోని థయామిన్, నియాసిన్, పాంటోథెనిక్ యాసిడ్, ఫోలేట్స్, రైబోఫ్లేవిన్, పైరిడాక్సిన్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. మన శరీరంలో జరిగే అనేకానేక జీవక్రియల నిర్వహణకు అవి తోడ్పడతాయి.ఇక మన ఆరోగ్యానికి అవసరమైన ప్రధాన ఖనిజాలైన జింక్, మ్యాంగనీస్, కాపర్, ఐరన్, మ్యాంగనీస్ వంటివి కూడా మొక్కజొన్నలో చాలా ఎక్కువ. అందుకే తక్కువ ధరకే అందుబాటులో ఉండే మొక్కజొన్ననూ వదలొద్దు.
చాలా రంగుల్లో మొక్కజొన్న
మనకు ఎక్కువగా పసుపు, తెలుపు రంగుల్లోని సాదా, తీపిమొక్కజొన్న(స్వీట్‌కార్న్)లు మాత్రమే తెలుసు. కానీ ఎరుపూ, గులాబీ, వూదా, ఆకుపచ్చ, నలుపూ, నీలమూ, హరివిల్లూ... ఇలా మనకు తెలీని రంగులు చాలానే ఉన్నాయి. ఒక్కో రంగుదీ ఒక్కో ప్రత్యేకత.
అద్భుతమైన యాంటీఆక్సిడెంట్స్
పసుపు రంగు కార్న్‌లో ల్యూటెన్, జియాక్సాంథిన్... వంటి కెరోటినాయిడ్లు ఎక్కువగా ఉంటే, నీలి రంగు మొక్కజొన్నలో ఆంథోసైనిన్ల శాతం ఎక్కువ. వూదారంగు మొక్కజొన్నలో హైడ్రాక్సీ బెంజాయిక్ ఆమ్లం దొరుకుతుంది. ఇవన్నీ కూడా అద్భుతమైన యాంటీఆక్సిడెంట్లలా పనిచేస్తాయి.
స్వీట్‌కార్న్
రంగుల సంగతలా ఉంచితే, ఉపయోగించే పద్దతిని బట్టి ఫ్లోర్, పాప్, డెంట్, ఫ్లింట్, స్వీట్, వాక్సీ... ఇలా ఆరు ప్రధాన రకాలుగా మొక్కజొన్నల్ని చెప్పవచ్చు. ఫ్లోర్, ప్లింట్, డెంట్... రకాలను ఎక్కువగా పిండికీ ఫ్లేక్స్కీ వాడితే, వేడి చేసినప్పుడు పాప్ అయ్యే రకాన్ని మాత్రం పాప్కార్న్గానే వాడతారు. జన్యుమార్పు ద్వారా ఆవిర్భవించిన స్వీట్‌కార్న్‌ను నేరుగానూ లేదా ఉడికించీ తింటారు.
బేబీ కార్న్కోసం..
మెరుస్తున్నట్లుగా ఉండే వ్యాక్సీ రకాన్ని టెక్స్టైల్స్, కాగితం తయారీ పరిశ్రమలతోబాటు మెయొనెజ్, మార్గరిన్, చూయింగ్‌గమ్, ఐస్‌క్రీమ్ తదితర ఆహారపదార్థాల్లోనూ వాడుతుంటారు. జిగటదనం దీని ప్రత్యేకత. పోతే, బేబీ కార్న్కోసం స్వీట్ లేదా ఇతర రకాల మొక్కజొన్నల్ని లేత దశలోనే కోయడం లేదా అందుకోసమే సృష్టించిన వంగడాలనూ వేస్తుంటారు.
ఏ రకం మొక్కజొన్నతో అయినా
ఇవే కాదు, కంటెయినర్లలో మాత్రమే పెరిగే బ్లూ జేడ్, మెరిసే రత్నాల్లాంటి గ్లాసీ కార్న్, అందంకోసమూ పెంచే పాడ్ కార్న్... లాంటివి వృక్షశాస్త్ర నిపుణుల్ని సైతం చకితుల్ని చేస్తున్నాయి. మొత్తంగా ఏ రకం మొక్కజొన్నతో అయినా రొట్టెలూ కూరలూ పలు రకాల స్నాక్ వెరైటీలూ చేసుకోవచ్చు. ఉడికించిన గింజల్ని సలాడ్లూ సూపుల్లోనూ వాడుకోవచ్చు.
ఎంతో మంచిది
తాజాగా ఉడికించి తింటే ఏ రకం మొక్కజొన్న అయినా మంచిదే. ఇందులో శక్తిమంతమైన పోషకాలతోబాటు ఎ, బి, సి, ఇ విటమిన్లూ, కొన్ని ఖనిజాలూ కూడా లభ్యమవుతాయి. కార్న్‌కి కాస్త నిమ్మకాయ రాసుకుని తినడంవల్ల వాటిల్లో శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు, నియాసిన్... లాంటి పోషకాల శాతం మరింత పెరుగుతుంది.
ఓ కప్పు కార్న్ గింజల్లో..
రోజువారీ అవసరమైన పీచు ఓ కప్పు కార్న్ గింజలనుంచి దొరుకుతుంది. ఇది జీర్ణసంబంధ సమస్యల్ని నివారిస్తుంది. మలబద్ధకంతోబాటు కొలొరెక్టల్, పేగు క్యాన్సర్లనూ అడ్డుకుంటుంది. మొక్కజొన్నలో పుష్కలంగా ఉండే థైమీన్, నియాసిన్ అనే విటమిన్లు నాడీ వ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తాయి. ఇంకా పాంటోథెనిక్ ఆమ్లం జీవక్రియకు దోహదపడుతుంది. గర్భిణులకు అవసరమైన ఫోలేట్ శాతం కూడా మొక్కజొన్నల్లో ఎక్కువే. ఇ-విటమిన్ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తూ వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.
ఖనిజాల శాతమూ ఎక్కువే
మొక్కజొన్నలో ఖనిజాల శాతమూ ఎక్కువే. ఫాస్ఫరస్ మూత్రపిండాల పనితీరుకి తోడ్పడితే, మెగ్నీషియం ఎముక బలాన్ని పెంచుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు క్సానర్ నిరోధకాలుగానూ పనిచేస్తాయి. ఫెరూలిక్ ఆమ్లం క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తూ రొమ్ము, కాలేయ క్యాన్సర్లతో పోరాడుతుంది. వూదారంగు మొక్కజొన్నల్లోని ఆంతోసైనిన్లు సైతం క్యాన్సర్ కారకాలను అడ్డుకుంటాయి.
అనేక వ్యాధుల నివారణ
ఆల్జీమర్స్, మధుమేహం, బీపీ, హృద్రోగాలనూ నివారిస్తాయని తాజా పరిశోధనలూ చెబుతున్నాయి. మిగిలిన ఆహారపదార్థాలకు భిన్నంగా ఉడికించడంవల్ల స్వీట్‌కార్న్‌లో యాంటీఆక్సిడెంట్ల శాతం మరింత పెరుగుతుంది. పసుపురంగు కార్న్‌లో కంటికీ చర్మానికీ అవసరమైన బీటాకెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది.
కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి
మొక్కజొన్నల నుంచి తీసిన నూనెలో అన్‌శాచ్యురేటెడ్ కొవ్వులూ స్టెరాల్స్ ఎక్కువగా ఉండటంవల్ల అవి కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యానికి దోహదపడతాయట. రక్తనాళాల్లో పాచి పేరుకోకుండా చేయడంద్వారా గుండెపోటు, పక్షవాతం వంటివి రాకుండా చేస్తాయి. బీపీనీ తగ్గిస్తాయట.కార్న్‌లోని ఐరన్ రక్తహీనతనీ తగ్గిస్తుంది.
చక్కెర నిల్వలు పేరుకోకుండా చేస్తుంది
మొక్కజొన్నలోని ఫైటోకెమికల్స్ శరీరంలో ఇన్సులిన్ శాతాన్ని నియంత్రించడం ద్వారా రక్తంలో చక్కెర నిల్వలు పేరుకోకుండా చేస్తుంది. చూశారుగా... మనం సరదాగా కాలక్షేపంకోసం తినే రుచికరమైన మొక్కజొన్నలో ఎంత ఆరోగ్యం దాగుందో... అయితే తియ్యదనంకోసం మొక్కజొన్న నుంచి తీసిన కార్న్ సిరప్‌ను ప్రాసెస్డ్ ఆహారపదార్థాలూ శీతలపానీయాల్లో విరివిగా వాడుతుంటారు. ఈ సిరప్‌లో ఫ్రక్టోజ్ శాతం ఎక్కువ. అది ఆరోగ్యానికి అంతగా మంచిది కాదు. కాబట్టి వాటితో మాత్రం కాస్త జాగ్రత్త.