For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్లౌడీ యూరిన్ సమస్య, లక్షణాలు, కారణాలు మరియు చికిత్సా విధానం.

By Chaitanya
|

మూత్రం దాని ప్రధాన లక్షణాలకు వ్యతిరేకంగా రంగు మరియు రూపాలలో భిన్న తేడాలను ప్రదర్శిస్తూ చిక్కదనం కూడుకుని, నురుగుతో కనిపిస్తున్న ఎడల, దీన్ని క్లౌడీ యూరిన్ సమస్యగా వ్యవహరించడం జరుగుతుంది. వాస్తవానికి ఇది మూత్రనాళ సంబంధిత అంటువ్యాధులను (UTI - యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్), లైంగిక సంబంద వ్యాధులను, మూత్ర పిండాల సమస్యను, లేదా డీహైడ్రేషన్ సమస్యను కూడా సూచిస్తుంది. అంతేకాకుండా కొన్ని అంతర్లీన సమస్యలను, సమస్యల తీవ్రతను కూడా బహిర్గతం చేస్తుంది. తెల్ల రక్తకణాలు మరియు ఎర్ర రక్తకణాల స్థితిగతులను అర్ధం చేసుకోవడంలో కూడా ఇది దోహదపడుతుంది.

కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కాన్సర్ వంటి సమస్యను కూడా బహిర్గతం చేస్తుందని చెప్పబడింది. అదనంగా వెజైనల్ డిశ్చార్జ్, ప్రోస్టేట్ సమస్యలు, వల్వోవాగినిటిస్, వాపు, మధుమేహం, కిడ్నీలో రాళ్ళు వంటి సమస్యలు ఉన్న నేపధ్యంలో కూడా మూత్రంలో ఈ లక్షణం కనిపిస్తుంటుందని చెప్పబడింది.

ఈ క్లౌడీ యూరిన్లో ఏముంటుంది :

మూత్రంలో మ్యూకస్, చీము, రక్తం మరియు కొన్ని రకాల వ్యర్ధాలు కలిసి చిక్కటి ద్రావణంలా తయారయిన పక్షంలో క్లౌడీ యూరిన్ వలె ఏర్పడి, మూత్రంలో అసాధారణ మార్పులు చోటు చేసుకుంటాయి. క్రమంగా కొన్ని సందర్భాలలో మూత్ర నాళం వద్ద నొప్పి, మంటతో కూడుకుని చికాకుకు కారణమవుతుంది. ముఖ్యంగా మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడిన నేపధ్యంలో కాల్షియం, పాస్ఫేట్ మరియు యూరేట్స్ వంటివి చిన్న చిన్న స్పటికాలుగా ఏర్పడి మూత్రంలో అధిక స్థాయిలో విలీనమై, మూత్రంలో అసాధారణ మార్పులకు కారణమవుతాయి.

క్లౌడీ యూరిన్ లక్షణానికి గల ప్రధాన కారణాలు మరియు వాటి వివరాలు :

లైంగిక సంబంధ వ్యాధులు :

లైంగిక సంబంధ వ్యాధులు :

గనేరియా, సిఫిలిస్ వంటి లైంగిక సంబంధ వ్యాధులు తలెత్తినప్పుడు మూత్రంలో మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి. క్రమంగా చీము, రక్తంతో కూడుకుని మూత్రం చిక్కగా తయారవుతుంది. సరైన సమయంలో వ్యాధి తీవ్రత పెరుగకుండా వైద్యుని సంప్రదించి, యాంటీ బయాటిక్స్ తీసుకోవలసి ఉంటుంది.

మూత్రపిండాలలో రాళ్ళు :

మూత్రపిండాలలో రాళ్ళు :

కాల్షియం శోషణ అధికంగా ఉన్న కారణాన, మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడడం జరుగుతుంటుందని మనందరికీ తెలిసిన విషయమే. కానీ, ఈ కాల్షియం నిక్షేపాలు మూత్రంలో కరిగి మూత్రపిండాల సమస్య తీవ్రతను బహిర్గతం చేస్తుంది.

డీహైడ్రేషన్ :

డీహైడ్రేషన్ :

శరీరానికి తగినంత మోతాదులో నీటిని అందించడం ఎంతో ముఖ్యం. లేనిచో ఆ ప్రభావం మూత్రాశయం మీద ప్రధానంగా పడుతుంది. కావున తరచుగా, నీరు లేదా పండ్ల రసాలను తీసుకుంటూ ఉండాలి. కానీ, కార్బోనేటెడ్ , సోడా ఆల్కహాల్ వంటివాటికి దూరంగా ఉండాలని గుర్తుంచుకోండి.

UTI (యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్) :

UTI (యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్) :

మూత్ర నాళంలో ఇన్ఫెక్షన్స్ తలెత్తినప్పుడు కూడా చీము, చెడురక్తం మరియు వ్యర్ధాలు కూడుకుని మూత్రం క్లౌడీగా తయారవుతుంది. కావున లక్షణాన్ని పసిగట్టిన ఎడల, తక్షణమే వైద్యుని సంప్రదించి చికిత్స ప్రారంభించడం ఉత్తమం. ఇవి ఎక్కువగా అశుభ్రంగా ఉన్న టాయిలెట్ల వాడకం వలన సంభవిస్తుందని వైద్యులు సూచిస్తుంటారు.

కిడ్నీ ఇన్ఫెక్షన్ :

కిడ్నీ ఇన్ఫెక్షన్ :

ఏ ఇతర కారణాల వలన మూత్ర పిండాలు, ఇన్ఫెక్షన్ బారినపడినా ఆ సంకేతాలు మూత్రం రంగు మరియు ఆకృతిలో కనిపిస్తాయి. కావున ఎటువంటి అసాధారణతలు తలెత్తినా ఆలోచించకుండా, వైద్యుని సంప్రదించడం ఉత్తమంగా ఉంటుంది. కొన్ని పరిస్థితులను ప్రారంభంలోనే నిర్దారించడం వలన, సమస్య జఠిలం కాకుండా జాగ్రత్తపడవచ్చు.

ఆహార ప్రణాళికలు :

ఆహార ప్రణాళికలు :

ఒక్కోసారి వ్యక్తి జీవనశైలి విధానాలు, ఆహార ప్రణాళికలు కూడా ఈ సమస్యకు కారణం కావొచ్చు. ఒకవేళ ఇదే ప్రధాన కారణం అయితే, ఎటువంటి చింతా లేకుండా న్యూట్రిషనిస్ట్ లేదా వైద్యుని సూచనల మేరకు ఆహార మరియు జీవనశైలి విధానాలలో ఆరోగ్యకర మార్పులను చేయడం ద్వారా, పరిస్థితిని సకాలంలోనే అధిగమించవచ్చు.

మధుమేహం :

మధుమేహం :

మధుమేహం వలన మూత్ర పిండాల సమస్యలు కూడా తలెత్తవచ్చు. వ్యక్తి ఆరోగ్య స్థితిగతులను అంచనా వేయడానికి కూడా ఈ సమస్య సంకేతంగా ఉంటుంది. క్రమంగా మధుమేహం తీవ్రతను తగ్గించడానికి చికిత్స తీసుకోవలసి ఉంటుంది.

వల్వోవాగినిటిస్:

వల్వోవాగినిటిస్:

ఈ సమస్య మహిళలకు సంబంధించినది. యోని భాగంలో వాపు లేదా ఇన్ఫెక్షన్ సూచించే ఈ వల్వోవాగినిటిస్ సమస్య తలెత్తినప్పుడు కూడా, మూత్రంలో ఈ పరిస్థితి కనిపిస్తుంది. క్రమంగా ఈ లక్షణాలను చికిత్స చేయడానికి వైద్యుడు యాంటీబయాటిక్, యాంటీ ఫంగల్, లేదా యాంటీవైరల్ ఔషధాలను సిఫారసు చేయవచ్చు.

ప్రోస్టేటిస్:

ప్రోస్టేటిస్:

ప్రోస్టేటిస్ సమస్య, పురుషుల వృషణాలలో వాపును సూచిస్తుంది. ప్రోస్టేట్ గ్రంధి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ బారిన పడిన ఎడల వైద్యుని సూచనల మేరకు రోగలక్షణాల చికిత్సకు యాంటీబయాటిక్స్ వాడవలసి ఉంటుంది. దీర్ఘకాలిక కేసులకు సంబంధించి, రోగలక్షణాలను నియంత్రించడానికి వైద్యులు కొన్ని ఔషధాలను సిఫారసు చేయవచ్చు.

ఇన్ని రకాల ఆరోగ్య సమస్యలకు క్లౌడీ యూరిన్ సంకేతంగా ఉన్నా కూడా, అధిక శాతం డీహైడ్రేషన్ దాని పర్యవసానాలు మరియు కిడ్నీ ఇన్ఫెక్షన్ల మీదనే ఆధారపడి ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. కావున నీటిని తరచుగా తీసుకోవలసినదిగా సిఫార్సు చేయబడుతుంది.

చికిత్సా విధానం :

చికిత్సా విధానం :

ఒకవేళ క్లౌడీ యూరిన్ లక్షణాలను కలిగి ఉన్నట్లయితే, రోగనిర్ధారణ కొరకు వైద్యుని సంప్రదించవలసి ఉంటుంది. క్రమంగా వైద్యుడు మూత్ర పరీక్షలను సిఫార్సు చేయవచ్చు. ఈ మూత్ర పరీక్షలు, సంక్రామ్యతల గురించిన వివరాలను అందిస్తుంది. సాధారణ లైంగిక సంబంధిత వ్యాధుల నిర్ధారణకు కూడా ఈ పరీక్షలను అనుసరించవచ్చు.

వ్యక్తి యొక్క లక్షణాల తీవ్రతను బట్టి, మూత్రపిండాల సమస్యలను తనిఖీ చేయడం కొరకు వైద్యుడు రక్త పరీక్షలను కూడా సిఫారసు చేయవచ్చు. క్రమంగా వ్యాధి నిర్ధారణ గావించిన తర్వాత, తీవ్రత దృష్ట్యా యాంటి బయాటిక్స్, ఆహార ప్రణాళిక, జీవన శైలి విధానాల గురించిన జాగ్రత్తలను సూచించడం జరుగుతుంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

Read more about: urine treatment
English summary

Cloudy causes and treatment

Due to the presence of excess protein the urine may appear cloudy. There are several causes for cloudy urine such as UTI, kidney infection etc.
Story first published:Thursday, April 18, 2019, 14:52 [IST]
Desktop Bottom Promotion