For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు అనువైన పరదాలు...!

|

Curtains
వివిధ వర్ణాల మేళవింపుతో విభిన్నంగా కనిపించే పరదాలతో ఇంటి అలంకరణ చేస్తే ఆ అందమే వేరు. వీటి వాడకంతో పాటు ఎంపికలోనూ చిన్న పాటి జాగ్రత్తలు తీసుకొంటే ఎక్కువ కాలం మన్నుతాయి. సరికొత్తగా కనిపిస్తాయి.

ఎంతో ముచ్చటపడి కట్టించుకున్న ఇంటి కిటికీలు, తలుపులకు వాడే కర్టెన్లు పాలిస్టర్, కాటన్, ఆర్గాంజ్, సింథటిక్, జనపనార, సిల్కు లాంటి బట్టలతో తయారైన వాటిని ఉపయోగిస్తే సరిపోతుంది. ఇలాంటి కర్టెన్లలో బట్ట ఒక వరుసే ఉండటంవల్ల ఎండను నిరోధించటంతోపాటు, బయటి దృశ్యాలను కనబడకుండా చేస్తాయి. ప్రైవసీతోపాటు బయటి దృశ్యాలను చూసేందుకు వీలుగా ప్రస్తుతం 'డే షీర్' అనే కర్టెన్లు మార్కెట్లో లభిస్తాయి. సాధారణ కర్టెన్ల మాదిరిగా కాకుండా షీర్ కర్టెన్లలో బట్ట సన్నగా ఉంటుంది. వీటిల్లో కూడా అనేక డిజైన్లు లభిస్తున్నాయి. వీటిలో థ్రెడ్ కర్టెన్లు మంచి ఉపయోగకరంగా ఉంటాయి. అవసరాన్ని బట్టి, ప్రధాన కర్టెన్‌ను తీసివేసి, షీర్ కర్టెన్‌ను మాత్రమే వాడుకునే సౌలభ్యం ఉంటుంది.

పాలిస్టర్ బట్టతో తయారయ్యే థ్రెడ్ పరదాలను అవసరాన్ని బట్టి ఒకటి, రెండు రంగులతో ఎంచుకోవచ్చు. దారాల మధ్య చిన్న, పెద్ద పూసలతో కూడా ఇవి లభిస్తున్నాయి. వీటిని కిటికీలతో పాటు తలుపులకు కూడా వాడవచ్చు. షీర్ పరదాలు ఇళ్లలో ఫ్రెంచి విండోలు, డ్రాయింగ్ రూం లాంటి వాటికి చక్కగా నప్పుతాయి. కిటికీల్లోంచి సాయం సంధ్యవేళల్లో ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు అవి అనువుగా ఉంటాయి.

గదికో రంగు: పడకగది అలంకరణ ఎంత బాగుంటే అంత హాయి. పెద్ద పెద్ద డిజైన్లతో నీలం, గులాబీ, ముదురు కుంకుమ, ఆకుపచ్చ వంటి వర్ణాలకు తెలుపుని మేళవించి పరదాలను వేలాడదీస్తే కంటికి ఇంపుగా ఉంటాయి. హాలు, లివింగ్ రూమ్ లలో సంప్రదాయ వర్ణాలైన పసుపు, పచ్చ, ఎరుపులతో పాటూ ఊదాను వాడవచ్చు. ఎప్పుడైనా సరే గోడ వర్ణానికి భిన్నమైన రంగుల్లోనే ఇవి ఉండేట్లు చూసుకోవాలి. గోడకున్న పెయింట్ లేత వర్ణంలో ఉన్నప్పుడు ముదురు వర్ణం లోనివి ఎంచుకోవాలి. రెండు అంతకంటే ఎక్కువ రంగుల సమ్మేళనంతో రూపొందించినవి చక్కగా నప్పుతాయి.

వేడిని తట్టుకొనేలా పరదాలను ఎంపిక చేసుకొనేప్పుడు ఏ గదికి వాడబోతున్నారో దాని ఉపయోగంతో పాటూ ఎండ పడే తీరునీ పరిశీలించాలి. లేదంటే వేడి నుంచి రక్షణ కలగదు సరికదా రంగు కోల్పోతాయి. గది దక్షిణ ముఖంగా ఉన్నప్పుడు సూర్య కిరణాలు రోజంతా పడుతూనే ఉంటాయి. అలాంటి చోట్ల సిల్క్ తో చేసిన పరదాలు కాకుండా నూలు, ఇతర రకాలతో చేసినవి ఉపయోగించవచ్చు. ఉత్తర దిశలో ఉండే గదులు సాధారణంగానే చల్లగానే ఉంటాయి. ఇక్కడ వెలుగూ తక్కువే. ఇక్కడ కాంతిమంతంగా కనిపించే రంగుల్ని వాడితే గది చూడచక్కగా ఉంటుంది.

శుభ్రంగా : పరదాలు నిత్యం వేలాడుతూ ఎటువంటి రక్షణ లేకుండా ఉంటాయి. ఫలితంగా వాటిపై దుమ్ము చేరుతుంది. దాంతో చిన్నారులు వాటిని తాకినప్పుడు అలర్జీ వంటి సమస్యలు ఏర్పడతాయి. అందువల్ల ప్రతి పదిహేను రోజులకోసారి తప్పనిసరిగా వాటిని శుభ్రం చేసే పని పెట్టుకోవాల్సిందే. వాటిని ఉతికేటప్పుడు నీటిలో నాలుగు చుక్కల వెనిగర్, కొద్దిగా రాళ్ల ఉప్పు వేస్తే రంగు వెలిసి పోకుండా ఉంటాయి.

English summary

Curtains help provide a soft warm environment....!

Curtains help provide a soft warm environment as well as creating color, pattern and texture for your home decor window treatments.
 There are so many options and choices of fabrics, tracks, rods, styles and headings for drapery, that we often don’t know where to start looking to work out which curtain type will best suit the windows in our home and this can become confusing often causing us to give up before we even get started.
Story first published:Friday, June 8, 2012, 17:29 [IST]
Desktop Bottom Promotion