Latest Updates
-
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా!
ఇంటిఅందాన్నేకాదు,ఇంటిల్లిపాదికి ఆనందం పంచి పెట్టే లివింగ్ రూమ్
ఇంట్లో ఎన్ని గదులున్నా లివింగ్ రూమ్‌లోనే ఎక్కువ సమయాన్ని గడుపుతాం. కుటుంబమంతా కలిసి కబుర్లు చెప్పుకోవటానికి, సరదాగా గడపటానికి లివింగ్ రూమ్‌నే ఎంచుకుంటాం. రోజు మొత్తంలో మనం ఎక్కువ సమయాన్ని ఆ గదిలోనే గడిపేస్తాం కాబట్టి లివింగ్ రూమ్‌కు ఆ పేరొచ్చింది. గాలీ, వెలుతురు సోకుతూ విశాలంగా ఉండే లివింగ్ రూమ్‌ని మనం కేవలం కాలక్షేపానికే కాకుండా ఇతర పనులకూ వాడుతుంటాం. దాన్లో కూర్చుని టెలివిజన్‌లో సినిమాలు చూస్తాం. స్నేహితులతో కబుర్లు చెబుతాం. పిల్లలతో ఆటలాడతాం. ఇలా మన జీవితంలోని ఎన్నో మధురమైన అనుభవాలకు లివింగ్ రూమ్ వేదికవుతుంది. కాబట్టే ఆ గదితో మనకు బలమైన అనుబంధం ఏర్పడిపోతుంది. మరి ఇంతటి మధురానుభూతులను మిగిల్చే లివింగ్ రూమ్‌ను ఆహ్లాదకరంగా అలంకరించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది కదా! మరి ముఖ్యంగా ఆ గదిలో అలంకరించిన ప్రతి వస్తువుకూ అక్కడ గడిపే క్షణాలను మధుర ఙ్ఞాపకాలుగా మలిచేంత శక్తి ఉంటుంది. అందుకే లివింగ్ రూమ్ అలంకరణ, దాన్లో ఉండవలసిన, ఉండకూడని వస్తువుల గురించి తెలుసుకోవటం అత్యవసరం.

లివింగ్ రూమ్‌లో వీటికి స్థానం కల్పించండి:
లివింగ్ రూమ్ అలంకరణలో మన అభిరుచి ప్రతిబింబించాలి. అతిథులు మెచ్చేలా, నాణ్యమైన సమయాన్ని గడిపేందుకు ఇష్టపడేలా ఉండాలి. ఇందుకోసం లివింగ్ రూమ్ అలంకరణలో ప్రత్యేక శ్రద్ధ పాటించాలి.
1. లివింగ్ రూమ్ గోడలకు వేసే రంగు మనసుకు ఆహ్లాదం కలిగించేలా ఉండాలి. ఇందుకోసం లేతవి, తటస్థమైన రంగులనే ఎంచుకోవాలి. అలాగే గదిలో రెండు రకాల రంగులు వేస్తే వాటి మధ్య పొంతన కుదరాలి.
2. గది వైశాల్యాన్ని బట్టి ఫర్నిచర్ ఎంచుకోవాలి. కంటికి నచ్చినది కాకుండా లివింగ్ రూమ్‌లో ఇరుకుకు ఆస్కారం లేని ఫర్నిచర్ కొనాలి.
3. లివింగ్ రూమ్ వైశాల్యం, ఆకారం ఆధారంగా ఫర్నిచర్ అలంకరణ ఉండాలి. స్క్వేర్, రెక్టాంగిల్, ట్రయాంగిల్, ఆక్టాగాన్...ఆకారం ఏదైనా దానికి తగ్గట్టు ఫర్నిచర్ అలంకరణ ఉండాలి.
4. గది ఎక్కువ విశాలంగా, నలుచదరంగా ఉంటే సోఫా సెట్‌ను మధ్యలో ఏర్పాటు చేసుకోవచ్చు. పొడవుగా ఉండే లివింగ్ రూమ్‌లో ఎల్ ఆకారంలో గోడవారగా వేస్తే గదికి అందమొస్తుంది.
5. ఫర్నిచర్ కూర్చోవటానికి, టెలివిజన్ చూడటానికి వీలుగా అమర్చాలి. గదిలో ఎక్కడ కూర్చున్నా గది మొత్తం కనిపించేలా ఫర్నిచర్ అమరిక ఉండాలి.
6. తరచుగా ఫర్నిచర్ స్థానాన్ని మార్చే అలవాటుంటే చక్రాల ఆధారంగా కదిలే ఫర్నిచర్‌ను ఎంచుకోవటం మేలు.
7. లివింగ్ రూమ్ మరింత ఆహ్లాదకరంగా ఉండాలంటే ఆ గదిలో మొక్కలకు, అందమైన శిల్పాలకు స్థానం కల్పించాలి. వీటిని గది మూలల్లో అలంకరిస్తే అందం ఇనుమడిస్తుంది.
8. లివింగ్ రూమ్ అందాన్ని పెంచే అలంకరణలో కర్టెన్లదీ ప్రముఖ పాత్రే! గది రంగుతో మ్యాచ్ అయ్యేలా కర్టెన్లను ఎంచుకోవాలి.
9. గది ఆకర్షణీయంగా కనిపించాలంటే లైటింగ్ మెరుగ్గా ఉండాలి. గదిలోని కొన్ని ప్రదేశాలను హైలైట్ చేయాలనుకుంటే ఓవర్ హెడ్ స్పాట్స్ ఎంచుకుని ట్రాక్ లైటింగ్ ఏర్పాటుచేయాలి. లివింగ్ రూమ్‌ను వెలుగుతో నింపటం కోసం టేబుల్ ల్యాంప్, ఫ్లోర్ ల్యాంప్స్‌ను వాడుకోవచ్చు.
10. గదిలోని వస్తువుల మధ్య సమన్వయం కుదిరేలా చూసుకోవాలి. సోఫా సెట్, కుర్చీలు, కిటికీలు, కర్టెన్లు దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. వీటికి ఇతర సామానుతో సమన్వయం కుదరాలంటే వాటి ఆకారాల్లో తేడా ఉండేలా చూసుకోవాలి. పిల్లోలు, టేబుల్, స్కల్చర్స్ ఓవల్ షేప్‌లో ఉండేవి ఎంచుకోవాలి.
11. గదిలోకి ధారాళంగా గాలీ, వెలుతురు ప్రసరించే కిటికీ ఉండటం అత్యవసరం. అయితే రాత్రి వేళ కిటికీని కప్పి ఉంచేందుకు బ్లైండ్స్ లేదా కర్టెన్లు ఏర్పాటు చేసుకోవాలి.
12. లివింగ్ రూమ్ డ్రమాటిక్‌గా ఉండాలనుకుంటే యాక్సెంట్ వాల్ తప్పనిసరిగా ఏర్పాటుచేసుకోవాలి. మిగతా గోడలన్నీ లేత రంగుల్లో ఉంటే ఈ గోడ ముదురు నారింజ, ఎరుపు, ఆకుపచ్చ, బూడిద రంగుల్లో కనిపించాలి.
13. లివింగ్ రూమ్ గోడలకు అందమైన పెయింటింగ్ వేలాడదీస్తే గది కళాత్మకంగా కనిపిస్తుంది. అయితే గది వైశాల్యాన్ని బట్టి పెయింటింగ్ సైజును ఎంచుకోవాలి. పెయింటింగ్ చిన్నదిగా ఉంటే దాన్ని పెద్ద మౌల్డింగ్ ఫ్రేమ్‌లో అమర్చితే పెద్దదిగా కనిపిస్తుంది. ఒకవేళ చిన్న సైజు పెయింటింగ్‌లను ఇష్టపడితే ఒకే సైజువి మూడు పెయింటింగ్‌లను పక్కపక్కనే అమర్చాలి.
14. షో కేస్ అలంకరణ కూడా లివింగ్ అందాన్ని పెంచుతుంది. దీన్లో వస్తువుల అమరిక పొందికగా ఉండాలి. దీన్లో నచ్చిన బొమ్మలన్నీ ఇరికించేయకుండా ఎక్కువ ఖాళీ ప్రదేశం ఉండేలా అలంకరించాలి.
15. లివింగ్ రూమ్‌లో సెంటర్ పీస్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. అది టేబుల్ అయితే దాని ఆకారం, మెటీరియల్ ప్రత్యేకంగా ఉండాలి. దానిపైన అందమైన ఫ్లవర్ వేజ్‌ను అమర్చాలి. తాజా పూలతో ఫ్లవర్ వేజ్‌ను నింపితే అందానికి అందం, పరిమళానికి పరిమళం.
16. లివింగ్ రూమ్‌లో ఉండే టెలివిజన్ గదిలో ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమించేలా ఉండకూడదు. వీలైతే ఫ్లాట్ స్క్రీన్ టీవీ ఎంచుకోవాలి. లేదా టెలివిజన్ ఇమిడేంత క్యాబినెట్ ఏర్పాటు చేసుకోవాలి.
17. గదిలో తక్కువ వెలుగునిచ్చే డిమ్మర్ స్విచ్ ఉండాలి. థియేటర్‌లో సినిమా చూస్తున్న అనుభూతి పొందాలనుకున్నప్పుడు మిగతా లైట్లు ఆర్పేసి డిమ్మర్ స్విచ్ ఆన్ చేయాలి.



Click it and Unblock the Notifications