For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వరలక్ష్మీ వ్రతం ఎలా చేసుకోవాలి.. పూజా విధానం

కొత్తగా పెండ్లిఅయిన దంపతులు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. వారేగాక తెలుగింట ప్రతి ఒక్కరూ కలిగినంతలో వరలక్ష్మీవ్రతం చేసుకోవడం సంప్రదాయం.

|

Varamahalakshmi Festival
కొత్తగా పెండ్లిఅయిన దంపతులు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. వారేగాక తెలుగింట ప్రతి ఒక్కరూ కలిగినంతలో వరలక్ష్మీవ్రతం చేసుకోవడం సంప్రదాయం. ఈ వ్రతం చేసుకోవాలనుకొనే వారు ముందు రోజునే ఇల్లంతా శుభ్రంగా కడిగి, ముగ్గులు వేసి, గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి, గడపకు పసుపు, కుంకుమ అలంకరించుకోవాలి. ఇంటిలో ఈశాన్యమూలన రంగవల్లులు వేసి, మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మండపంపైన వెండి లేదా కంచు, ఇత్తడి పళ్లెరాన్ని వుంచి అందులో బియ్యం పోసి దాని మీద వెండి, బంగారం లేదా కంచు, రాగి కలశాన్ని వుంచాలి. ఆ కలశంలో కొత్తచిగుళ్లు గల మర్రి లేదా ఇతర మెక్కల చిగుళ్లను వుంచాలి. కలశాన్నిగంధం, పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. కలశంపై కొబ్బరి కాయను వుంచి దానిని కొత్త రవికల గుడ్డతో అలంకరిచుకోవాలి. దానికి "శ్రీ వరలక్ష్మీ" రూపు ప్రతిబింబించేటట్లు పసుపు ముద్దతో కనులు, ముక్కు, చెవులు మున్నగునవి తీర్చిదిద్దుకోవాలి. కుంకుమ, కనులకు కాటుకలను అమర్చి ఆ రూపును కలశపై ఉంచుకోవాలి.

ఆ తర్వాత ఆకుపచ్చని చీరతో కూర్చున్న లక్ష్మీదేవి ఫోటోను గానీ, ప్రతిమ (వీలైతే వెండిది)ను గానీ పసుపు కుంకుమలతో అలంకరించుకుని పూజకు సిద్ధం సుకోవాలి. పూజకు ఎర్రటి అక్షింతలు, పద్మములు, ఎర్రటి కలువ పువ్వులు, గులాబి పువ్వులు, నైవేద్యమునకు బొంబాయి రవ్వతో కేసరి బాత్, రవ్వలడ్డులు, జామకాయలు వంటివి సిద్ధం చేసుకోవాలి. పూజగదిలో రెండు వెండి దీపాలలో ఆరేసి ఆరేసి మొత్తం 12 తామర వత్తులతో నేతితో దీపమెలిగించాలి.

అంతకుముందు 9ముడులతో తయారు చేసుకొని వుంచుకొన్న తోరగ్రంథులను కలశం మీద వుంచాలి. ముత్తయిదువలను పిలుచుకుని వారి కాళ్లకు పసుపు రాయాలి. అందరూ కలిసి మండపం ముందు కూర్చిన తమలపాకు పై పసుపు వినాయకుని వుంచి విఘ్నేశ్వర పూజ చేసుకోవాలి. అనంతరం సంకల్పం చెప్పుకుని, ద్యానావాహనాది షోడశోపచారాలు చేసి లక్ష్మీ అష్టోత్తరం, సహస్రనామం చదువుతూ, అక్షింతలతోనూ, పూలతోనూ అమ్మవారికి పూజ చేయాలి. కథ చెప్పుకుని అక్షింతలు వేసుకున్న తర్వాత వరలక్ష్మికి నవకాయ పిండివంటలను నివేదించి కర్పూర నీరాజనం, తాంబూలం సమర్పించాలి.

ఇకపోతే.. సాయంత్రం ఆరుగంటల నుంచి పూజను ప్రారంభించాలి. నుదుట కుంకుమ బొట్టు పెట్టుకుని, మెడలో తామర మాల ధరించి పూజను ఆరంభించాలి. శ్రీ లక్ష్మి సహస్రనామము, వరలక్ష్మీ వ్రత కథ పారాయణ చేసి, "ఓం మహాలక్ష్మీదేవ్యై నమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. వీలైతే లక్ష్మీ అష్టోత్తరము, మహాలక్ష్మి అష్టకములను పఠించి, తదనంతరం నైవేద్యములను సమర్పించుకుని దేవదేవికి దీపారాధన చేయాలి.

అనంతరం పూజ చేయించిన పండితునికి దక్షిణ తాంబూలాలు సమర్పించుకోవాలి. ముత్తయిదువులకు కూడా శక్తి మేరకు పసుపు, కుంకుమ, రవికె, పండు, తాంబూలం ఇచ్చుకుని, ఇంటి ఆచారాన్ని బట్టి వాయన దానమివ్వాలి. చివరగా పూజలో వుంచిన తోరాలను కుటుంబ సభ్యులంతా చేతికి కట్టుకోవాలి. అందరూ కలిసి భోజనం చేయాలి. ఓపిక వుంటే సాయంత్రం కూడా పేరంటం పిలుచుకుని పసుపు కుంకుమ ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా పూజ చేసుకునే వారి ఇంట వరలక్ష్మి అనుగ్రహం వల్ల ధనకనక వస్తు వాహనాదులు సమకూరి, విద్యా ఉద్యోగవ్యాపారాలు అభివృద్ధి చెంది సకల సౌభాగ్యాలూ చేకూరతాయని సాంప్రదాయవాదుల నమ్మకం. విశ్వాసం.

English summary

How to celebrate Varamahalakshmi Festival | వరలక్ష్మీ వ్రతం ఎలా చేసుకోవాలి..

Festivals and rituals, the Hindu way have their own significance in one's spiritual evolution. Varamahalakshmi, The term Vara means “Blessing” Hence this day is to be believed that Lord lakshmi grants her blessing to the worshipers. This festival falls on Friday in the month of Ashada, also called as Adi, which corresponds to the English months of July-August. This festival is performed by married women before the full moon day.
Desktop Bottom Promotion