For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వరలక్ష్మీ వ్రతం యొక్క విశిష్టత...!

|

సృష్టికంతటికీ ధనాన్ని ప్రసాధించే తల్లి మహాలక్ష్మి. ఐశ్వర్యదాయిని, శుభదాయిని, కోరిన వరాలనెల్లా తీర్చే కొంగుబంగారం వరలక్ష్మి. ఆ చల్లటి తల్లి అనుగ్రహించిందంటే అష్టయిశ్వర్యాలను ప్రసాధించి, భోగభాగ్యాలతో తులతూగేలా దీవిస్తుంది. ఆగ్రహించిందా, మహారాజయినా సరే, సమస్తం పోగుట్టుకొని రాజ్యభ్రష్టుడవుతాడు. 'కళ్ళకద్దుకుంటే కలకాలం వుంటాను, విసిరేస్తే వెళ్ళిపోతాను' అంటుందట ఆ అమ్మ. అందుకే ఎంతటి కోటీశ్వరుడైనా చిల్లరానాణెం కిందపడ్డా, కళ్లకద్దుకుని మీరీ భద్రం చేసుకుంటాడు.

Importance of Varamahalakshmi Vratha

లక్ష్మీ దేవికి ఇష్టమైన మాసం శ్రావణ మాసం. ఆ తల్లి కృపకు పాత్రులు కావాలనుకునే వారు ఈ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం లేదా పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వత్రం చేసుకుని సిరిసంపదలను, భోగభాగ్యాలను పొందుతారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు, వర్తక సంఘాలు, వరలక్ష్మీ వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించి తమ వ్యాపారాన్ని మరింత వృద్ది చేసుకుంటారు. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో వరలక్ష్మీ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించి నవకాయ పిండివంటలను నైవేద్యం పెట్టి ఆమె అనుగ్రహాన్ని పొందుతారు.

వరలక్ష్మీ వ్రత విశిష్టతను, ఆ వ్రతం చేయు విధానాన్ని పరమేశ్వరుడు పార్వతీ దేవికి చెప్పినట్లు సూతపురాణం చెబుతోంది. వ్రత కథ: పూర్వం మగధ దేశంలో కుండినమనే పట్టణముంది. ఈ పట్టణంలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ వుండేది. ఆమె భర్తనే దేవుడిగా భావించి, ప్రతి రోజూ ఉదయాన్నే స్నానం చేసి పుష్పాలతో భర్తపాదానలు పూజించి, తర్వాత అత్తమామలను కూడా పూజించేది. ఈమెపై లక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి, ఒకనాడు కలలో కనిపించి, శ్రావణ శుక్లపక్షపూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వత్రం చేసుకుంటే సకల సంపదలూ ప్రసాదిస్తానని, ఆ వ్రత విధానం చెప్పి అదృశ్యమయింది.

చారుమతి తక్షణం నిద్రనుంచి మేలుకొని, ఆ కల వృత్తాంతాన్ని భర్త, అత్తమామలకు చెప్పింది. వారు ఎంతో సంతోషించి శ్రావణ మాసం రాగానే ఆ వ్రతం చేసుకుందామని చెప్పారు. చారుమతి శ్రావణమాసంలో అమ్మవారు సూచించిన రోజున సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి, ఇంటిలో ఒక ప్రదేశంలో ఆవు పేడతో అలికి, ముగ్గులు వేసి, మంటపం ఏర్పరిచింది. ఆ మంటపం మీద ఒక ఆసనం వేసి, దానిపై కొత్త బియ్యం పోసి, మర్రిచిగుళ్లు మొదలైన ఐదువిధాల చిగురుటాకులతో కలశాన్నీ అలంకరించి, దానిపై లక్ష్మీదేవిని ఆవాహనం చేసి, స్త్రీలందరితో కలిసి సాయంకాలమున "పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే, నారాయణ ప్రియేదేవీ సుప్రీతాభవ సర్వదా' ను శ్లోకంచే ఆవాహనాది పూజలు చేసి, తొమ్మిది సూత్రాలు గల తోరాన్ని కుడిచేతికి కట్టుకొని, వరలక్ష్మీ దేవికి అనేక రకాల పిండి వంటలను నివేధించి ప్రదక్షిణ నమస్కారాలు చేయడం మొదలిడగానే అక్కడున్న స్త్రీలందరి కాళ్లయందు ఘల్లుఘల్లుమని శబ్దాలు వస్తూండడంతో వారు కాళ్లను చూసుకున్నారు. అందరి కాళ్లకు గజ్జెలు మున్నగు ఆభరణాలున్నాయి. మరొక ప్రదక్షిణం కాగానే చేతులకు కంకణాదిఆభరణాలు అమరాయి. మూడవ ప్రదక్షిణానికి వారందరూ సర్వాభరణ భూషితులయ్యారు. వ్రతం పూర్తికాగానే ఆ స్త్రీలందరినీ వారి వారి గృహముల నుంచి వీరిని తీసుకుపోవుటకు వాహనాలు వచ్చి ఉన్నాయి.

అనంతరం స్త్రీలందరూ తమతో ఈ వ్రతం చేయించిన విప్రోత్తముని పూజించి పన్నెండు కుడుముల వాయనదానం, దక్షిణ తాంబూలాలిచ్చి నమస్కారం చేశారు. ఆయన ఆశీర్వాదం పొంది వరలక్ష్మీదేవికి నివేదన చేసిన పిండివంటలను బంధువలతో కలసి అందరూ భుజించారు. తరువాత అందరూ తమకోసం వచ్చిన వాహనాలపై ఎవరి ఇళ్లకు వారు వెళ్లారు. ఆ తర్వాత ప్రతి యేటా ఆ స్త్రీలందరూ ఈ వ్రతం చేస్తూ పుత్రపౌత్రాభివృద్ధి కలిగి సర్వసంపదలతో సుఖంగా వున్నారు. ఈ కథను చదివిన వారికి, విన్నవారికి సకల కార్యాలూ సద్దిస్తాయి.

English summary

Importance of Varamahalakshmi Vratha | వరలక్ష్మీ వ్రతం యొక్క విశిష్టత...!

Importance of Varamahalakshmi Vratha
Desktop Bottom Promotion