For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సంక్రాంతి విశిష్టత: సంక్రాంతి పూజా విధానం

|

సంక్రాంతి లేదా సంక్రమణం..సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుండి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం..దీనినే సంక్రాంతి అంటారు. రైతులు చెమటోడ్చి పండించిన పంటలు చేతికొచ్చే సమయంలో సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి రైతుల పండుగగా దీన్ని అభివర్ణిస్తారు. సంక్రాంతి.. ఈ పండుగ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది పల్లె వాతావరణం, పాడి పంటలు. వివిధ పనులపై గ్రామాల నుండి పట్టణాలకు వలస వచ్చిన వారంతా సంక్రాంతి పండుగ సందర్భంగా వారి స్వగ్రామాలకు చేరుకుంటుంటారు.

మకర సంక్రాంతి పండుగలో సంక్రాంతికి ముందు రోజు భోగి పండుగను జరుపుకుంటారు. ఆ రోజు చలిపులిని తరమికొడుతూ ప్రజలు ఉదయాన్నే చలి మంటలు వేసుకుంటారు. తమలోని పాత ఆలోచనలు ఆ అగ్నికి ఆహుతై కొత్త ఆలోచనలు చిగురించాలని అగ్ని దేవుడిని వేడుకుంటారు. ఇందుకు గుర్తుగా తమ ఇంటిలోని పాత చెత్తా చెదారాన్ని ఆ అగ్నిలో ఆహుతి చేస్తారు. ఇంటి ఎదుట రంగు రంగుల ముగ్గులను వేస్తారు. చిన్నారులకు భోగి పండ్లు పోస్తారు.

రెండో రోజు సంక్రాంతి:
ఈ రోజు కూడా ఇంటి ఎదుట రంగు రంగులతో పోటా పోటీగా ముగ్గులు వేస్తారు. వాటిపై పూలతో అలంకరణలు చేసి వాటిచుట్టూ గొబ్బెమ్మ పాటలు పాడుతుంటారు. పలు పిండి వంటలు చేసి సూర్యదేవుడికి ప్రసాదంగా సమర్పిస్తుంటారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు, సన్నాయి రాగాలను అనుగుణంగా వాటిచేత నృత్యాలు చేయిస్తుంటారు. అంతేగాక హరిలో రంగ హరీ..అంటూ నడినెత్తిపై నుండి నాసిక దాక తిరుమణి పట్టెలతో, కంచు గజ్జెలలు ఘల్లుఘల్లుమనగా చిందులు తొక్కుతూ చేతుల్లో చిరుతలు బోడి తలపై రాగి అక్షయపాత్ర పెట్టుకుని హరిదాసు ప్రత్యక్షమవుతాడు.

మూడో రోజు కనుమ:
సంక్రాంతి పండుగ చివరి రోజును కనుమ అని పిలుస్తుంటారు. ఈ రోజు పిండివంటలు చేసుకుని బంధువులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఈ పండుగ దినాల్లో కోళ్ల పందాలు నిర్వహిస్తారు.

Significance of Makar Sankranti

ఇక సంక్రాంతి పూజ ఎలా చేయాలి?
మకర సంక్రాంతి పుణ్యదినాన దానధర్మాలు చేయడం ద్వారా జన్మజన్మల దారిద్ర్య బాధలు తొలగిపోతాయని విశ్వాసం. సంక్రాంతి రోజున స్త్రీలు పువ్వులు, పసుపు, కుంకుమ, పండ్లను దానం చేయడం ద్వారా సకలసంపదలతో పాటు దీర్ఘసుమంగళీ ప్రాప్తం లభిస్తాయి. సంక్రాంతి ఒంటరిగా రాదని పెద్దలంటూ ఉంటారు. మహారాణిలా ముందు "భోగిని" (భోగి పండుగ), వెనుక "కనుమ" (కనుమపండుగ)ను వెంటేసుకుని, చెలికత్తెల మధ్య రాకుమార్తెలా సంక్రాంతి వస్తుంది. ఇదేరోజున పితృదేవతారాధన చేయడం వల్ల వారి శుభాశీస్సులతో వర్ధిల్లుతారని పురోహితులు అంటున్నారు.

అందుచేత సంక్రాంతి రోజున సూర్యోదయానికి ముందే లేచి, పూజామందిరము, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరమును ముగ్గులతో అలంకరించుకోవాలి. స్త్రీలు తెల్లవారు జాముననే లేచి వారి వారి ముంగిళ్లలో రంగవల్లుల తీర్చిదిద్దుకోవాలి.

తెల్లవారు జాముననే హరిదాసు హరినామ సంకీర్తనలు, సాతాని జియ్యర్లు, జంగపుదేవరలు, బుడబుక్కల దొరలు, పంబలవాండ్లు, బైనాయుడులు, గంగిరెద్దుల వాళ్ళు ఇంటింటికీ తిరుగుతుంటారు. వారి వారి తీరులలో భక్తి గీతాలు పాడుతూ ఏడేడు జన్మలలో మన ఇళ్ల పెద్దలకు పుణ్యలోకాలు ప్రాప్తించాలని దీవెనలు ఇస్తుంటారు.

అన్ని కులాల వారు మకర సంక్రమణ సమయంలో తిలా తర్పణలు విడిచి గుమ్మడి పండ్లను దానం ఇస్తే విష్ణువుకు బ్రహ్మాండాన్ని దానమిచ్చిన ఫలం లభిస్తుందని విశ్వాసం. ఈ ఫలం వల్ల పెద్దలు తరిస్తారని పురాణాలు చెబుతున్నాయి.

ఆ రోజున తలస్నానము చేసి కొత్త బట్టలను ధరించి, చక్కెర పొంగలి, గారెలు, బూరెలు, పండ్లను నైవేద్యంగా పెట్టి సూర్యభగవానుడిని (శ్రీహరిని), పితృదేవతలను ప్రార్థించుకుంటే మోక్షమార్గము, సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయని నమ్మకం.

మకర సంక్రాంతి రోజున ఆడపడుచులను, అల్లుళ్లను ఇంటికి ఆహ్వానించి, వారికి కొత్త బట్టలు పెట్టి... బంధుమిత్రులతో కలిసి ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలు కొన్ని కొన్ని వ్రతాలను ఆచరించడం చేస్తారు. వాటిలో గొబ్బిగౌరి వ్రతం ఒకటి. ఈ వ్రతాన్ని భోగినాడు ప్రారంభిస్తారు. ధనుర్మాసం నెల పెట్టింది.. మొదలు సంక్రాంతి పండుగ వరకు ప్రతి ఇంటి లోగిలి రకరకాల ముగ్గులతో ముచ్చటగా కనిపిస్తుంది.

ఆ ఇంటి ఆడపడుచులు ఆ ముగ్గుల మధ్యన అందంగా గొబ్బిళ్లను తీర్చిదిద్ది, గొబ్బిపాటలు పాడుతూ.. కేరింతలు కొడుతుంటారు.

English summary

Significance of Makar Sankranti and Celebrations

The first celebration that welcomes a warm festive beginning to the New Year is the Makar Sankranti festival. Makar Sankranti is known as Pongal in South India and as Maghi in North India. Know more about this enthusiastic festival. Makar Sankranti is all about prayers, sweets, and kites.
Story first published: Monday, January 13, 2014, 17:52 [IST]
Desktop Bottom Promotion