5 భాషల్లో చికిరి చికిరి సంచలనం.. రామ్ చరణ్ సాంగ్‌కి రికార్డ్ వ్యూస్, ఎన్ని కోట్లంటే?

ఈ ఏడాది చాలా పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సంక్రాంతికి వస్తున్నాంలో గోదారి గట్టు మీద రామచిలుకతో మొదలుపెడితే ఈ లిస్ట్ చాలా పెద్దది. వాటిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ పెద్దిలోని చికిరి చికిరి సాంగ్ కూడా ఒకటి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పాటే కనిపిస్తోంది. డీజే బాక్స్‌లలో చికిరి సాంగ్ మోత మోగుతోంది. ఈ ఒక్క పాటే పెద్ది సినిమాపై అంచనాలను భారీగా పెంచడంతో పాటు వ్యూస్‌పరంగా సరికొత్త రికార్డులు సృష్టించింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

పెద్ది విడుదల ఎప్పుడంటే?
గేమ్ ఛేంజర్ తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పెద్ది అనే సినిమా చేస్తున్నారు రామ్ చరణ్. వృద్ది సినిమాస్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై కిలారు వెంకట సతీష్, ఇషాన్ సక్సేనాలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ సూపర్‌ స్టార్ శివరాజ్ కుమార్ కీలకపాత్ర పోషిస్తున్నారు. దివ్యెందు శర్మ, జగపతి బాబు, విజి చంద్రశేఖర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విజేత, మ్యూజిక్ మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని వచ్చే ఏడాది మార్చి 27న పెద్ది సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Chikiri Chikiri from Ram Charan starrer Peddi song crosses 150 million views

నవంబర్ 7న చికిరి చికిరి సాంగ్ విడుదల
సినిమాపై హైప్ పెంచేందుకు గాను నవంబర్ 7న చికిరి చికిరి సాంగ్‌ను విడుదల చేశారు. బాలాజీ సాహిత్యం అందించిన ఈ పాటను మోహిత్ చౌహాన్ ఆలపించగా.. ఏఆర్ రెహమాన్ అదిరిపోయే మాస్ బీట్స్ అందించారు. జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్‌లో రామ్ చరణ్ వేసిన స్టెప్స్, జాన్వీ కపూర్ అందం అన్నీ కలగలిపి చికిరి చికిరి సాంగ్‌కు ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు రీల్స్, వీడియోలు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు.

16 రోజుల్లోనే సెంచరీ వ్యూస్
విడుదలైన క్షణం నుంచే చికిరి చికిరి సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేసింది. కేవలం 46 గంటల్లోనే 46 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకోవడంతో పాటు భారతీయ చిత్ర పరిశ్రమ చరిత్రలోనే కేవలం ఒక్కరోజులోనే ఇన్ని వ్యూస్ సాధించిన తొలి పాటగా రికార్డుల్లోకి ఎక్కింది. అంతేకాదు.. కేవలం 13 గంటల్లోనే 32 మిలియన్ల వ్యూస్‌ను అందుకుని .. గతంలో 24 గంటల్లో 32 మిలియన్ల వ్యూస్ సాధించిన పాటల రికార్డులను బద్ధలు కొట్టింది. ఆ తర్వాత అన్ని భాషల్లోనూ కలిపి కేవలం 16 రోజుల్లోనే 100 మిలియన్ల వ్యూస్‌ను సాధించి సంచలనం సృష్టించింది.

చికిరి చికిరి కొత్త రికార్డ్
తాజాగా చికిరి చికిరి సాంగ్ మరో రికార్డును తన ఖాతాల్లో వేసుకుంది. కేవలం విడుదలైన నెలలోనే ఒక్క తెలుగు వెర్షన్‌లోనే 100 మిలియన్ వ్యూస్‌ను క్రాస్ చేయడంతో పాటు తెలుగుతో పాటు మొత్తం 5 భాషల్లో కలిపి 150 మిలియన్ల వ్యూస్‌ను రాబట్టి సంచలన రికార్డును సృష్టించింది. రామ్ చరణ్ జోరు చూస్తుంటే రిలీజయ్యే నాటికి ఇంకెన్నీ రికార్డులను నెలకొల్పుతుందోనని ఉత్కంఠ నెలకొంది. అంతేకాదు.. పెద్ది నుంచి వచ్చే ఇతర పాటలపైనా ఆసక్తి నెలకొంది.

Desktop Bottom Promotion