ఒకప్పుడు బ్యాంకులో టాయిలెట్లు కడిగేది..ఇప్పుడు అదే బ్యాంకులో మేనేజర్!..జీవితం మారడం అంటే ఇదేగా

నీ కోరిక బలమైనదైతే అది తప్పకుండా నెరవేరుతుందని మన పెద్దలు తరచుగా చెబుతుంటారు. ధృడ సంకల్పం, మొక్కవోని ఆత్మవిశ్వాసం, నిరంతర శ్రమ ఉంటే ఎలాంటి అసాధ్యాలను కూడా సుసాధ్యం చేయవచ్చని ఎంతోమంది నిరూపించారు. అలాంటివాళ్లలో ప్రతీక్ష తోండ్వాల్కర్ ఒకరు. ఒకప్పుడు ఎస్బీఐ బ్యాంకులో స్వీపర్ గా తుడుస్తూ టాయిలెట్లు కడుగుతూ ఉండే ప్రతీక్ష నేడు అదే ఎస్బీఐ బ్యాంకులో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా ఎదిగింది. జస్ట్ ఒక స్వీపర్ ఈ స్థాయికి రావడం అంటే చిన్న విషయం కాదు..దీని వెనుక ఎన్నో నిద్రలేని రాత్రులను ఆమె గడిపింది. తన కష్టాన్ని,పట్టుదలని నమ్ముకొని అసాధ్యం కానిదేదీ లేదు అంటూ అందరికీ స్ఫూర్తినిస్తుంది.

మహారాష్ట్రకు చెందిన ప్రతీక్ష తోండ్వాల్కర్ ఓ పేద కుటుంబంలో జన్మించారు.ఇంట్లోని ఆర్థిక ఇబ్బందుల కారణంగా 17 ఏళ్ల వయస్సులో 10వ తరగతి సదాశివ్ అనే వ్యక్తితో చదువుతుండగానే ఆమెకు పెళ్లి చేశారు. దీంతో ప్రతీక్ష చదువు మానేయాల్సి వచ్చింది. సదాశివ్..ముంబైలోని ఓ ఎస్బీఐ బ్యాంకులో బుక్ బైండర్‌ గా పనిచేసేవాడు. జీవితం ప్రశాంతంగా సాగుతోందనుకున్న సమయంలో ఓ విషాధం నెలకొంది. ప్రతీక్ష భర్త సదాశివ్ ఓ యాక్సిడెంట్ లో చనిపోయాడు. అప్పటికి ప్రతీక్షకు కేవలం 20 ఏళ్ల వయస్సు మాత్రమే. ఓ కొడుకు కూడా ఉన్నాడు. చిన్న వయసులోనే వైధవ్యం, ఒడిలో పసిబిడ్డతో ఒంటరిగా మిగిలిపోయిన ప్రతీక్షకు జీవితం అంధకారంగా తోచింది. భవిష్యత్తుపై బెంగ, బిడ్డను ఎలా పోషించాలన్న ఆందోళన ఆమెను చుట్టుముట్టాయి.

From Sweeper to AGM The Inspiring Journey of Pratiksha Tondwalkar

పసిబిడ్డను పోషించుకోవడానికి తన కాళ్లపై తాను నిలబడటానికి ఏదో ఒక పని చేయాల్సిన పరిస్థితి. పూర్తిస్థాయి విద్యార్హతలు లేకపోవడంతో మంచి ఉద్యోగం దొరకడం గగనమైంది. చివరికి తన భర్త పనిచేసిన SBI బ్యాంకులోనే నెలకు 60-65 రూపాయల జీతానికి స్వీపర్‌ గా చేరింది. టాయిలెట్లు క్లీన్ చేయడం, ఫర్నీచర్ తుడవడం ఆమె దినచర్య. ఈ కొద్దిపాటి సంపాదనతోనే ఇంటిని నెట్టుకురావడం, కొడుకు బాగోగులు చూడటం, బాధ్యతలన్నీ ఒంటరిగానే మోసింది. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆమె నిరాశ చెందలేదు,వెనుకడుగు వేయలేదు. తన కుమారుడికి బంగారు భవిష్యత్తును అందించాలన్న తపన ఆమెలో బలంగా ఉండేది. ఓటమిని అంగీకరించే ప్రసక్తే లేదు అనుకున్న ప్రతీక్ష.. తన చదువును కొనసాగించాలని నిశ్చయించుకుంది.

కష్టాల కన్నీళ్లను దిగమింగుకుంటూనే చదువుకోవాలని కోరికను కూడా పెంచుకుంది. తన జీవితాన్ని, తన కొడుకు భవిష్యత్తును మార్చుకోవాలంటే ఇప్పుడు చదువు ఒక్కటే తనముందు ఉన్న మార్గమని ఆమె బలంగా నమ్మింది. పగలంతా బ్యాంకులో స్వీపర్ గా పని చేసి అలసిపోయి ఇంటికి వచ్చిన ఆ తర్వాత ముంబైలోని విఖ్రోలిలో ఉన్న నైట్ కాలేజీకి వెళ్లి తన చదువును కొనసాగించింది. మొక్కవోని పట్టుదలతో ఇంటర్మీడియట్ పూర్తిచేసింది. ఆ తర్వాత తన జీవితాన్ని,వృత్తిని మార్చుకోవాలనే దృఢ సంకల్పంతో సైకాలజీలో డిగ్రీ కూడా సాధించింది. ఓ వైపు ఇంటి బాధ్యతలు, మరోవైపు బ్యాంకులో పని ఇంకోవైపు చదువు ఈ మూడింటినీ సమన్వయం చేసుకుంటూ ఆమె పడిన శ్రమ వర్ణనాతీతం. ఆమె అంకితభావం, కష్టపడే తత్వం SBI అధికారుల దృష్టిని ఆకర్షించాయి.చదువు పూర్తికావడంతో స్వీపర్‌గా పనిచేస్తున్న ప్రతీక్ష గారికి అదే బ్యాంకులో క్లర్క్‌గా ప్రమోషన్ లభించింది. ఇది ఆమె జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు. ఒకప్పుడు తాను శుభ్రం చేసిన చోటే క్లర్క్‌గా కూర్చోవడం ఆమె ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది.

స్వీపర్‌ గా పనిచేసిన అదే బ్యాంకులో క్లర్క్‌ గా కూర్చోవడం ఆమెకు ఎంతో గర్వంగా అనిపించింది. ఈ విజయం ఆమెలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపింది. 1993లో ప్రతీక్ష జీవితంలో మరో వసంతం వికసించింది. 1993లో ప్రమోద్ తోండ్వాల్కర్‌ అనే వ్యక్తితో ప్రతీక్షకు రెండో పెళ్లి జరిగింది. ప్రమోద్ తోండ్వాల్కర్‌ కూడా ప్రతీక్ష ఆశయాలకు అండగా నిలిచారు. నువ్వు ఏదవి సాధించాలనుకుంటావో సాధించు నీ వెనుక నేనున్నా అంటూ భార్యను ప్రోత్సహించాడు. తన భార్యకు ఇష్టమైన బ్యాంకింగ్ వృత్తిలో ఆమె ఉన్నత స్థానానికి చేరుకోవాలని బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధం కావడానికి ప్రోత్సహించారు. రెండవ భర్త ప్రమోద్ తొండ్వాల్కర్ అందించిన అండదండలు ఆమె విజయానికి మరింత బలాన్నిచ్చాయి.

భర్త ప్రోత్సాహం, తనలోని అకుంఠిత దీక్షతో ప్రతీక్ష బ్యాంకింగ్ పరీక్షలకు సన్నద్ధమయ్యారు. పగలంతా బ్యాంకు పని, ఇంటి బాధ్యతలు నిర్వర్తిస్తూనే రాత్రిళ్లు మేల్కొని చదివేది. ఎన్నో నిద్రలేని రాత్రులు, అంతులేని శ్రమ ఆమెను విజయానికి మరింత దగ్గర చేశాయి. ఆమె అవిశ్రాంత కృషి ఫలితంగా ప్రతీక్ష ట్రైనీ ఆఫీసర్‌గా ఎంపికైంది. ఇది ఆమె వృత్తి జీవితంలో మరో మైలురాయి. అక్కడితో ఆమె ప్రస్థానం ఆగలేదు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతి సవాలునూ ధైర్యంగా ఎదుర్కొంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. పనిపట్ల ఆమెకున్న నిబద్ధత, సహోద్యోగులతో ఆమె ప్రవర్తించే తీరు, సమస్యలను పరిష్కరించడంలో ఆమెకున్న నైపుణ్యం ఆమెను ఉన్నత శిఖరాలకు చేర్చాయి.

ట్రైనీ ఆఫీసర్ స్థాయి నుండి స్కేల్ I, స్కేల్ II, స్కేల్ III, స్కేల్ IV, ఛీఫ్ మేనేజర్... ఇలా ఒక్కో మెట్టూ ఎక్కుతూ, చివరకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (AGM) అనే అత్యున్నత పదవిని అలంకరించారు. ఒకప్పుడు అదే బ్యాంకు ఆవరణలో చీపురు పట్టిన చేతులతో నేడు వేలాది మంది ఉద్యోగులను నిర్దేశించే స్థాయికి ఎదగడం ప్రతీక్ష అసాధారణ ప్రతిభకు, మొక్కవోని ధైర్యానికి నిదర్శనం. కుటుంబ సహకారం, వ్యక్తిగత కృషి కలిస్తే అసాధ్యాలను కూడా సుసాధ్యం చేయవచ్చనడానికి ప్రతీక్ష జీవితమే ఒక ఉదాహరణ.

ప్రతీక్ష తోండ్వాల్కర్ జీవితం కేవలం ఒక విజయగాథ మాత్రమే కాదు..ధైర్యం, కఠోర శ్రమ, ఆత్మవిశ్వాసం ఉంటే ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా అధిగమించవచ్చని ఆమె నిరూపించారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహా పురుషులవుతారు అనే నానుడికి సజీవ సాక్ష్యం. బాల్య వివాహం, పేదరికం, భర్త మరణం, ఒంటరితనం, విద్యాభ్యాసానికి ఆటంకాలు ఇలాంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, వాటిని విజయానికి సోపానాలుగా మార్చుకున్న ఆమె ప్రస్థానం నేటి యువతకు, ముఖ్యంగా మహిళలకు ఆమె జీవితం ఒక గొప్ప ఆదర్శం. పరిస్థితులు మన చేతుల్లో లేకపోయినా, మన భవిష్యత్తును మనమే నిర్మించుకోవచ్చనే నమ్మకాన్ని ఆమె జీవితం మనకు తెలియజేస్తుంది.

Story first published: Friday, May 9, 2025, 18:31 [IST]
Desktop Bottom Promotion