PG vs Hostel: హాస్టల్, పీజీ మధ్య తేడా ఏంటీ? ఎందులో ఉంటే మంచిది?

చదువుల కోసమో లేదా ఉద్యోగం కోసమో లేదా ఇతర పనుల మీద సొంతూరు వదిలి పట్నంకి లేదా నగరాలకు వచ్చినప్పుడు చాలామంది హాస్టల్స్ లేదా పీజీల్లో ఉంటుంటారు. నెలకు ఇంత అని డబ్బులు కట్టి అక్కడే బస చేస్తుంటారు. రూమ్ లు తీసుకుంటే వంట చేసుకోవడం లేదా బట్టలు ఉతుక్కోవడం వంటివన్నీ తమకు సెట్ కావు భావించోటేళ్లు అన్నీ టైంకి అందుబాటులో ఉండే హాస్టల్, పీజీల్లో ఉండేందుకు ఇష్టపడతారు.

చాలామందికి హాస్టల్, పీజీ మధ్య తేడా తెలియదు. ఈ రెండూ ఒకటే కదా అని పొరపడుతుంటారు. వాస్తవానికి ఈ రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ప్రస్తుతం ఎండాకాలం సెలవులు ముగించుకొని మళ్లీ కాలేజీలు, స్కూల్స్ రీ ఓపెన్ అయ్యాయి. ఈ క్రమంలో చాలామంది విద్యార్థులు సిటీలకు వస్తున్నారు. హాసల్స్ లేదా పీజీలలో ఉంటున్నారు. ఈ క్రమంలో అసలు హాస్టల్ లో ఉండటం బెటరా లేదా పీజీలో ఉంటే బెటరా, లాభనష్టాలు ఏంటో ఇక్కడ చూడండి.

Know the difference between hostel and pg which is better for living

హాస్టల్, పీజీ తేడాలు ఇవే

హాస్టల్
ఇది స్కూల్, కాలేజీ లేదా యూనివర్శిటీ ప్రాంగణంలోనే లేదా దానికి అతి సమీపంలో ఉండే వసతి గృహం. దీన్ని విద్యాసంస్థ యాజమాన్యమే నిర్వహిస్తుంది కాబట్టి ఇక్కడ కచ్చితమైన నియమ నిబంధనలు ఉంటాయి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఒక క్రమశిక్షణతో కూడిన జీవనం అలవడుతుంది. భోజనం, కరెంటు, నీరు, వైఫై వంటి ప్రాథమిక సౌకర్యాలన్నీ నెలవారీ ఫీజులోనే కలిసి ఉంటాయి. ఇక్కడ భద్రతకు, క్రమశిక్షణకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది.

పేయింగ్ గెస్ట్ (PG)

ఇది ప్రైవేట్ వ్యక్తులు తమ ఇళ్లలో లేదా భవనాలలో విద్యార్థులు, ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసే వసతి. ఇక్కడ హాస్టల్‌ తో పోలిస్తే నియమాలు చాలా సరళంగా ఉంటాయి. స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. అద్దెతో పాటు భోజనం, కరెంటు బిల్లు, ఇంటర్నెట్ వంటి వాటికి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది లేదా కొన్ని ప్యాకేజీలు అందుబాటులో ఉండవచ్చు. ఇది కళాశాలకు దూరంగా ఉండే అవకాశం ఉంది. ఇది ఒకరకంగా ఇంటిలాంటి వాతావరణంలో స్వేచ్ఛాయుత జీవనం అని చెప్పవచ్చు.

హాస్టల్‌ లో చేరడం వల్ల కలిగే ప్రయోజనాలు

హాస్టళ్లలో 24/7 వార్డెన్లు, సెక్యూరిటీ గార్డుల పర్యవేక్షణ, సీసీటీవీ కెమెరాల నిఘా ఉంటుంది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత గురించి నిశ్చింతగా ఉండవచ్చు. భోజనం, వసతి, విద్యుత్ వంటి అన్ని సౌకర్యాలకూ కలిపి ఒకే ఫీజు చెల్లించడం వల్ల బడ్జెట్ నిర్వహణ సులభమవుతుంది. అదనపు ఖర్చుల బెడద ఉండదు. క్యాంపస్ ‌లోనే లేదా దగ్గరలోనే ఉండటం వల్ల ప్రయాణ సమయం, ఖర్చులు పూర్తిగా ఆదా అవుతాయి. ఆ సమయాన్ని చదువుపై లేదా ఇతర వ్యాపకాలపై కేటాయించవచ్చు. తోటి విద్యార్థులతో కలిసి ఉండటం వల్ల కొత్త స్నేహాలు ఏర్పడతాయి. బృందంగా చదువుకోవడం, పండుగలు జరుపుకోవడం, ఒకరికొకరు సహాయం చేసుకోవడం వంటి లక్షణాలు అలవడతాయి. క్రమశిక్షణ కూడా అలవడుతుంది. నిర్ణీత సమయానికి భోజనం, నిద్ర వంటివి ఒక పద్ధతి ప్రకారం జరగడం వల్ల విద్యార్థులలో క్రమశిక్షణ, సమయపాలన అలవడతాయి.

హాస్టల్‌ లోని ప్రతికూలతలు
కఠిన నిబంధనలు ఉంటాయి. బయటకు వెళ్లాలన్నా, తిరిగి రావాలన్నా సమయ పరిమితులు ఉంటాయి. బయటి వ్యక్తులను కలవడంపై ఆంక్షలు ఉండటం వల్ల స్వేచ్ఛ పరిమితంగా ఉన్నట్లు అనిపించవచ్చు. ఒకే గదిలో ఇద్దరు లేదా ముగ్గురు విద్యార్థులు సర్దుకుపోవాల్సి ఉంటుంది. ఇది వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవచ్చు. రోజూ ఒకే రకమైన మెనూ, కొన్నిసార్లు రుచిలేని ఆహారం విసుగు తెప్పించవచ్చు. ఇంటి భోజనంలా ఉండదు.

Know the difference between hostel and pg which is better for living

పీజీలో ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు

సమయ పరిమితులు వంటి కఠిన నిబంధనలు ఉండవు. సింగిల్ లేదా డబుల్ షేరింగ్ గదులు అందుబాటులో ఉంటాయి. ప్రశాంతంగా చదువుకోవడానికి, వ్యక్తిగత సమయం గడపడానికి ఇది అనుకూలం.
మీకు నచ్చిన విధంగా భోజనం, వై-ఫై వంటి సౌకర్యాలను ఎంచుకోవచ్చు లేదా సొంతంగా ఏర్పాటు చేసుకోవచ్చు. మీ బడ్జెట్, అవసరాలకు తగినట్లుగా వివిధ ప్రాంతాలలో, వివిధ సౌకర్యాలతో ఉన్న పీజీలను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది.

పీజీలోని ప్రతికూలతలు
హాస్టల్‌ తో పోలిస్తే పీజీలలో భద్రతా ఏర్పాట్లు తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇది తల్లిదండ్రులకు ఆందోళన కలిగించే ప్రధాన అంశం. అద్దె కాకుండా కరెంటు, నీరు, ఇంటర్నెట్, ఆహారం వంటి వాటికి విడిగా చెల్లించాల్సి రావడం వల్ల బడ్జెట్ పెరిగిపోవచ్చు. చాలా పీజీలు కళాశాలలకు దూరంగా ఉంటాయి. దీనివల్ల రోజువారీ ప్రయాణ సమయం, ఖర్చు పెరుగుతుంది. ఇంటి యజమాని ప్రవర్తన, సౌకర్యాల నాణ్యత, ఒప్పంద నిబంధనలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయని చెప్పలేం. కొన్నిసార్లు సమస్యలు ఎదురుకావచ్చు.

Story first published: Monday, June 16, 2025, 10:58 [IST]
Desktop Bottom Promotion