For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Sirivennela:అనకాపల్లిలో ఆరంభించి.. అక్షరమాలను పంచి.. ఆణిముత్యంగా నిలిచి.. శోకసంద్రంలో ముంచి..

|

'అల అనకాపల్లిలో ఆరంభించి...
అక్కడి నుంచి విరంచి.. విపంచి..
మురిపించి.. మైమరిపించి..
అర్థశతాబ్దపు అజ్ణానాన్ని గుర్తించి..
అందరికీ 'వెన్నెల'ను పంచి..
అందరినీ శోక సంద్రంలో ముంచి..

ఎంతవరకో.. ఎందుకొరకో..
ఎవరికొరకో.. జగమంతా నాదే అంటివి..
సిగ్గు లేని జనాన్ని కలంతో కడిగితివి..
నమ్మలేని నిజాన్ని మిగిల్చితివి..'

'నొప్పిలేని నిమిషమేది జననమైనా.. మరణమైనా
జీవితాన అడుగు అడుగున నీరసించి నిలిచిపోతే..
నిమిషమైన నీది కాదు బతుకు అంటే నిత్యం ఘర్షణ..
దేహముంది.. ప్రాణముంది.. నెత్తురుంది.. సత్తువుంది..
ఇంతకన్నా సైన్యముండునా..
ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను ఆశయమ్ము సారధవునురా
నిరంతరం ప్రయత్నమ్మున్నదా నిరాశకే నిరాశ పుట్టదా
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..ఎప్పుడూ ఒదులుకోవద్దురా ఓరిమి..'
- సిరివెన్నెల సీతారామశాస్త్రి..

తెలుగు సినిమాలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చెప్పినట్టు 'ఆయన రాత్రి పూట ఉదయించే సూర్యుడు. అర్థరాత్రి ఉదయించే సూర్యుడు' సిరివెన్నెల. తెలుగు సినీ సంగీతం, సాహిత్యానికి కొత్త సోబగులద్దిరన వారిలో ఆయన అగ్రగణ్యులు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే తన కలంతో అందరిలోనూ చైతన్యం రగిలించే పాటలు రాశారు. తన చివరి శ్వాస విడిచే ముందు బలమైన అక్షరాల ఆయుధాలను తయారు చేశారు.. అంతేకాదు ఈ పాటను స్వయంగా తానే పాడారు. కానీ అంతలోనే అకస్మాత్తుగా మనల్ని వదిలి వెళ్లారు.. ఈ విషయం తెలుసుకున్న వెంటనే సినీ అభిమానులంతా శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

అనకాపల్లిలో ఆరంభం..

అనకాపల్లిలో ఆరంభం..

విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలంలో డాక్టర్ సి.వి. యోగి, శ్రీమతి సుబ్బలక్ష్మీ దంపతులకు 1955 మే 20వ తేదీన చేంబోలు సీతారామశాస్త్రి జన్మించారు. తన బాల్యంలో ప్రాథమిక విద్యను అక్కడే పూర్తి చేశారు. పదో తరగతి వరకు అక్కడే చదువుకున్నారు. ఇంటర్మీడియట్ కోసం కాకినాడ వెళ్లారు. ఆ తర్వాత ఆంధ్ర విశ్వకళా పరిషత్ లో డిగ్రీ పూర్తి చేశారు.

తన సోదరుడే..

తన సోదరుడే..

తనకు పదో తరగతి అర్హతతోనే బిఎస్ఎన్ఎల్ లో జాబ్ రావడంతో రాజమహేంద్రవరానికి వెళ్లారు. అక్కడ కొంత కాలం పని చేసిన ఆయన లో ఓ కవి ఉన్నాడని గుర్తించిన తొలి వ్యక్తి తన సోదరుడు. చిన్నప్పటి నుండి సీతారామశాస్త్రికి పాటలు పాడాలని కోరికగా ఉండేదట. ఒకట్రెండు సార్లు అలాంటి ప్రయత్నం చేసినా.. తాను అందుకు సరిపోనని అటువైపు అడుగులు వేయలేదట. అయితే ఎప్పుడూ కొత్త పదాలతో ఎప్పుడూ ఏదో ఒక ప్రయత్నం చేసే ఆయన్ను గమనించిన ‘అన్నయ్యా కవిత్వం కూడా బాగా రాస్తున్నావు. నువ్వు ఒకసారి ప్రయత్నించు' అని చెప్పడంతో ఏవీ క్రిష్ణారావు, చాగంటి శరత్ బాబుతో కలిసి సాహితీ సభలకు వెళ్లేవారట.

సిరివెన్నెలతో సినీ ప్రస్థానం..

సిరివెన్నెలతో సినీ ప్రస్థానం..

అనకాపల్లిలో ఆయన పలకా బలపం పడితే.. తన అక్షరమాలను నాట్యం చేయించడానికి బీజం పడింది మాత్రం ‘సిరివెన్నెల' సినిమాతోనే. తను డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ప్రముఖ తెలుగు సినీ దర్శకులు విశ్వనాథ్ తనకు సిరివెన్నెల సినిమాలో అవకాశం కల్పించారు. తండ్రి నుండి ఆస్తుల కంటే సాహిత్యాన్నీ వారసత్వంగా పొందిన తను అప్పటినుండి అందరినీ ఆప్తులుగా మార్చేసుకున్నారు.

సిరా వెన్నెల..

సిరా వెన్నెల..

‘అక్షరాలు.. చైతన్య కిరణాలై ఉదయిస్తుంటాయి..

తన కలం నుంచి జాలువారినప్పుడు.

అక్షరాలు.. స్పూర్తి తరంగాలై ఎగిసిపడుతుంటాయి..

తన అంతరంగంలో మెరిసినప్పుడు..

అక్షరాలు.. హిత బోధ చేస్తాయి..

తను అందుకున్న కాగితంపై రూపుదిద్దుకున్నప్పుడు..

అయితే ఇప్పుడు ఆ కలం కరిగిపోయింది..

కాగితం కళ కోల్పోయి కన్నీరు పెడుతోంది..

కవిత్వం ఎప్పుడు అవసరమంటే..

కవిత్వం ఎప్పుడు అవసరమంటే..

‘నేనెప్పుడూ చిత్ర పరిశ్రమలోకి వస్తానని అనుకోలేదు. అసలు సినీ గేయ రచయిత అవ్వాలని కూడా అనుకోలేదు. వాస్తవానికి నా చిన్నతనంలో నేను రాస్తున్న దాన్ని కవిత్వం అంటారనే అవగాహన కూడా లేదు. దేహానికి దెబ్బ తగిలితే మందు కావాలి.. ఆత్మకు తగిలితే మందు సరిపోదు. మనసు కావాలి. అప్పుడే కవిత్వం అవసరమవుతుంది' అని సిరివెన్నెల ఓ సందర్భంగా స్పష్టంగా చెప్పారు.

13 సార్లు నంది అవార్డులు..

13 సార్లు నంది అవార్డులు..

తన తొలి పాట ‘సిరివెన్నెల'లోని ‘విధాత తలపున.. విరంచి.. విపంచి'ఏకంగా నంది అవార్డు దక్కింది. అలా మొదలైన అక్షరమాలతో ఆయన మూడు వేలకు పైగా పాటలు రాశారు. అందులో ఆయనకు ఏకంగా పదమూడు సార్లు నంది అవార్డు దక్కించుకున్నారు. అంతేకాదు ఉత్తమ గేయ రచయితగా నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డులు సైతం అందుకున్నారు. పలు సినిమాల్లో నటుడిగా సైతం కనిపించారు. సాహిత్య రంగంలో ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2019లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది..

పద కవితా చక్రవర్తి..

పద కవితా చక్రవర్తి..

సిరివెన్నెల మూడు దశాబ్దాల సినీ ప్రస్థానం సందర్భంగా అనకాపల్లిలోని డైమండ్ హిట్స్ సంస్థ 2016 ఆగస్టు 26వ తేదీన పద కవితా చక్రవర్తి బిరుదును ప్రదానం చేసి సత్కరించింది. ఆయన రాసిన ప్రతి ఒక్క పాట ఒక ఆణిముత్యం అని ప్రముఖులు చెబుతున్నారు. ఆయన మనల్ని విడిచివెళ్లడం.. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని చెబుతున్నారు.

సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎప్పుడు, ఎక్కడ జన్మించారు?

విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలంలో డాక్టర్ సి.వి. యోగి, శ్రీమతి సుబ్బలక్ష్మీ దంపతులకు 1955 మే 20వ తేదీన చేంబోలు సీతారామశాస్త్రి జన్మించారు. తన బాల్యంలో ప్రాథమిక విద్యను అక్కడే పూర్తి చేశారు. పదో తరగతి వరకు అక్కడే చదువుకున్నారు. ఇంటర్మీడియట్ కోసం కాకినాడ వెళ్లారు. ఆ తర్వాత ఆంధ్ర విశ్వకళా పరిషత్ లో డిగ్రీ పూర్తి చేశారు.

సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎప్పుడు.. ఎలా మరణించారు?

సిరివెన్నెల సీతారామశాస్త్రి నవంబర్ 30వ తేదీన మంగళవారం నాడు ఉదయం హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో మరణించారు. ఆయన న్యూమోనియాకు సంబంధించిన వ్యాధితో బాధపడ్డారని.. ఈ కారణంగానే తుదిశ్వాస విడిచారని వైద్యులు తెలిపారు.

English summary

Interesting Facts About Lyricist Sirivennela Sitaramashastry in Telugu

Here we are talking about the interesting facts about lyricist sirivennela sitaramashastry in Telugu. Have a look
Story first published: Wednesday, December 1, 2021, 11:32 [IST]