పిల్లలకు మాటలు రావట్లేదా? ఐతే ఇదిగో సింపుల్ టిప్స్

సహజంగా కొంత మంది పసిపిల్లలకు ఒక సంవత్సరం అవ్వగానే ఏదో ఒకటి మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటారు. అయితే కొంత మంది పిల్లలు రెండేళ్లు నిండినా కానీ మాట్లాడలేరు, మాట రావట్లేదని చాలా కంగారు పడిపోతుంటారు . పసిపిల్లలు నెలలు నిండే కొద్దీ, వారు ఎలా మాట్లాడుతో, అమ్మ, తాతా, అత్త అని ఎప్పుడు పిలుస్తారో అని ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. పిల్లలు పుట్టినప్పుటి నుండి పెరిగే క్రమంలో పాకడం, నడవడం లాంటివి వయస్సును బట్టి ఎలా నేర్చుకుంటారో మాట్లాడడం కూడా అలాగే వయస్సు బట్టి అలవడాలి. ఈ నేపథ్యంలో మొదటి రెండు సంవత్సరాల్లోనే పిల్లలకు మాటలొస్తాయి. కానీ కొందరు పిల్లల్లో ఈ ప్రక్రియ కాస్త నెమ్మదిగా జరుగుతుంది. దీంతో వాళ్ళ తల్లిదండ్రులు గాబరా పడిపోతుంటారు. ఈ క్రమంలో పిల్లలకు వాళ్ల వయస్సును బట్టి సరైన సమయానికే మాటలు రావాలంటే తల్లిదండ్రులు ఏ విధమైన ప్రోత్సాహం అందించాలో చూద్దాం...

ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడాలి: మీరు గమనించే ఉంటారు..పిల్లలు పుట్టినప్పటి నుంచి తల్లి వారి ముందు ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. ఎందుకంటే చిన్న పిల్లలకు ఏ విషయాన్నైనా సులభంగా గ్రహించే శక్తి ఉంటుంది. కాబట్టి, వారితో ఎక్కువగా మాట్లాడడం, ఏ విషయమైనా వారితో చెప్పడం..లాంటివి చేస్తుంటారు. ఇదంతా వారికి త్వరగా మాటలు రావడానికి చేసే ఓ ప్రయత్నమే...

Tips To Get Your Toddler Talking

ఆటవస్తువులతోనూ: పిల్లల్ని ఆడించడానికి తల్లులు ఎక్కువగా ఉపయోగించేవి ఆటవస్తువులు. ఈ క్రమంలో వివిధ ఆటవస్తువుల గురించి వివరిస్తూ పిల్లల్ని ఆడించడానికి ప్రయత్నించాలి. దీని వల్ల పిల్లలు ఆటవస్తువుల కంటే తల్లి చెప్పే దాని మీదే ఎక్కువ శ్రద్ద పెడతారు. కాబట్టి ఇలా ఆడుకునే ప్రతి వస్తువు పేరు, దాని గురించి చెప్పడం,..లాంటివి చేస్తే వాళ్ళలో వినికిడి శక్తి పెరుగడంతో పాటు గ్రాహ్యాశక్తి పెరిగి మాటలు త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది.

కథలు చెప్పాలి: చాలా మంది పిల్లలు కథలు వింటూ నిద్రపోవడానికే ఎక్కువ మొగ్గు చూపుతారు. దీని వల్ల పిల్లల్లో గ్రాహ్యశక్తితో పాటు ఆలోచనాశక్తి కూడా పెరుగుతుంది. ఇలా ప్రతి రోజూ చాలా మాటలు వినడం వల్ల ఇందులో నుంచి కొన్ని మాటలైనా వాళ్ల మనస్సుల్లో నాటుకుపోతాయి. దీంతో నెమ్మదిగా వాళ్ళు మాట్లాడడానికి ప్రయత్నించే అవకాశం ఉంటుంది.

ఒక టీచర్ గా: పిల్లలకు మాటలు రావాలంటే తల్లిదండ్రులే టీచర్లుగా మారాలి. ఉదాహరణకి మీరు పిల్లల్ని ఆడిస్తూ టీవీ చూస్తున్నారనుకోండి. అందులో ఏవైనా జంతువులల్లాంటివి కనిపిస్తే వాటి పేర్లు చెప్పడం లాంటివి చేయాలి. అలాగే ఏదైనా బొమ్మల పుస్తకం, ఇంగ్లీష్ లేదా తెలుగు అక్షరమాల పుస్తకం చూపిస్తూ వాటి పేర్లు చెప్పడం..ఇలా కూడా చేయవచ్చు. దీంతో పాటు మీ కుటుంబ సభ్యులంతా ఒక చోట చేరి ‘ఈమె మీ అమ్మ, ఈయన మీ నాన్న, ఈమె మీ అత్త..'ఇలా బాంధవ్యాల గురించి చెప్పడం...ఇలాంటివి తరచూ చేస్తుంటే పిల్లలకు మీరు ఎదురు చూడకముందే మాటలొచ్చే అవకాశం ఉంటుంది. అలాకాకుండా మీరు ఏం చెప్పకముందే మాటలు రావాలంటే కాస్త కష్టమే....

తప్పులు సరిదిద్దాలి: సాధారణంగా చిన్నపిల్లలు మనం చెప్పిన పదాలను తప్పు్ల్లేకుండా పలకరు. వాళ్ళు అప్పుడప్పుడే మాటలు నేర్చుకుంటుంటారు. కాబట్టి, స్పష్టంగా పలకలేరు. అందువల్ల వాళ్లు పదాల్ని స్పష్టంగా పలకాలంటే తల్లిదండ్రులే వాళ్ళ తప్పుల్ని సరిదిద్దాలి. ‘అలా కాదమ్మా...ఇలా పలకాలి' అని నెమ్మదిగా నేర్పించే ప్రయత్నం చేయాలి. దీంతో క్రమక్రమంగా వారిలో స్పష్టంగా మాట్లాడే ధోరణి అలవడుతుంది.

వారికిష్టమైనవి: పిల్లలకు ఇష్టమైన పదార్థాలు, వాళ్లకిష్టమైన ఆటవస్తువులు మొదలైన వాటిని వాళ్లు చేసేటప్పుడు వాళ్లకు అందకుండా ఉంచడం...లాంటివి చేయడం వల్ల వాటిని తినాలనే, అందుకోవాలనే ఆశతో వారు మాట్లాడడానికి ప్రయత్నించే అవకాశం ఉంటుంది.

కాసేపలా: ఎప్పుడూ ఇంట్లోనే పిల్లలకు కూడా బోర్. కాబట్టి, వాతావరణాన్ని ఆస్వాదించడం కూడా పిల్లలకు అలవాటు చేయాలి. దీనికోసం వాళ్లను అప్పుడప్పడూ అలా బయటికి తీసుకువెడుతుండాలి. పార్కులకు, స్నేహితుల ఇళ్లకు తీసుకెళ్లాలి. దాంతో అక్కడి పిల్లలు మాట్లాడుతుంటే మీ పిల్లలు కూడా ఆటోమేటిక్ గా మాట్లాడటానికి ప్రయత్నించవచ్చు.

ఓపిగ్గా ఉండాలి: కొంత మంది పిల్లలకు ఏం చెప్పినా, ఏం చేసినా, మాటలు రావట్లేదని ఒక్కోసారి చేయి చేసుకోవడం కూడా చూస్తుంటాం. కానీ అది మంచిది కాదు. దీని వల్ల వాళ్లలో ప్రతికూల భావాలు రెట్టింపు అవుతాయి. ఇలా మీరు బాధపడుతూ వాళ్లను బాధపెట్టడం సమంజసం కాదు. కాబట్టి తల్లిదండ్రులు ఓపికతో ఉంటూ పిల్లలకు మాటలు నేర్పడం అనేది ఉత్తమమైన మార్గం.. ఇలా అన్ని రకాలుగా ప్రయత్నించిన తర్వాత కూడా మీ పిల్లలకు మాటలు రావట్లేదంటే వెంటనే డాక్టర్ వద్దకు తీసుకెళ్ళడం అవసరం...

Story first published: Monday, November 3, 2014, 18:56 [IST]
Desktop Bottom Promotion