నవరాత్రి ఉపవాసంలో శక్తినిచ్చే హెల్తీ డ్రింక్స్ ఇవే..ఎలా చేసుకోవాలంటే

Posted By:

హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో దసరా ఒకటి. ఈ ఏడాది దసరా పండుగను అక్టోబర్ 2న జరుకుంటారు. దసరా పండుగ మొదటి తొమ్మిది రోజులను నవరాత్రులు అంటారు. శరన్నవరాత్రులు వచ్చేశాయంటే చాలు ఇంటా బయటా పండుగ వాతావరణం వెల్లివిరుస్తుంది. అమ్మవారిని కొలుస్తూ తొమ్మిది రోజుల పాటు ఎంతో భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఉండటం మన సంప్రదాయం. ఈ దీక్ష మనసుకి ప్రశాంతతను ఇచ్చినా, రోజంతా ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరం నీరసించి, అలసిపోవడం సహజం.

ప్రత్యేకించి డీహైడ్రేషన్ సమస్య వేధించవచ్చు. అటువంటి సమయంలో మీ శరీరాన్ని ఉత్తేజంగా, తాజాగా ఉంచే కొన్ని అద్భుతమైన డ్రింక్స్ ఉన్నాయి. ఇవి కేవలం దాహాన్ని తీర్చడమే కాదు, ఉపవాసానికి అవసరమైన శక్తిని అందించి మిమ్మల్ని రోజంతా చురుకుగా ఉంచుతాయి.

5 Must Have Drinks to Stay Fresh and Active During Navratri

కొబ్బరి నీళ్లు - తక్షణ శక్తికి
ఉపవాసంలో అమృతంలా పనిచేసేవి కొబ్బరి నీళ్లు. ఒక గ్లాసు తాజా కొబ్బరి నీళ్లలో కొద్దిగా నిమ్మరసం, నాలుగైదు పుదీనా ఆకులు వేసి కలిపి తాగండి. ఇది శరీరంలోని ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేసి, తక్షణ శక్తిని అందించి, మిమ్మల్ని రోజంతా తాజాగా ఉంచుతుంది.

మారేడు పండు షర్బత్ - ఒంటికి చలువ
ఉపవాసానికి ఇది ఒక సంప్రదాయ పానీయం. మారేడు పండు గుజ్జును నీటిలో బాగా కలిపి వడకట్టాలి. ఆ రసంలో రుచికి తగినంత తేనె లేదా బెల్లం పొడి కలిపి చల్లగా సేవించండి. ఇది శరీరానికి చల్లదనాన్ని ఇచ్చి, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

పెరుగు పండ్ల స్మూతీ - కడుపు నిండుగా
ఒక కప్పు చిక్కటి పెరుగులో ముక్కలు చేసిన అరటిపండు, ఆపిల్ లేదా బొప్పాయి వేయండి. అవసరమైతే కొద్దిగా తేనె జోడించి, మిక్సీలో నున్నగా బ్లెండ్ చేయండి. ఈ స్మూతీ కడుపు నిండిన అనుభూతిని ఇవ్వడమే కాకుండా, శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లను అందిస్తుంది.

పుదీనా నిమ్మరసం నీరు - శరీరం శుభ్రం
ఒక గ్లాసు చల్లటి నీటిలో ఒక చెక్క నిమ్మరసం పిండి, కొన్ని తాజా పుదీనా ఆకులను నలిపి వేయండి. ఐదు నిమిషాల తర్వాత తాగితే, ఇది అద్భుతమైన రిఫ్రెష్‌ మెంట్‌ ను ఇస్తుంది. శరీరాన్ని డిటాక్స్ చేసి, ఉపవాస సమయంలో తేలికగా అనిపించేలా చేస్తుంది.

బాదం పాలు - బలహీనతకు విరుగుడు
రాత్రంతా నానబెట్టిన బాదంపప్పులను మెత్తని పేస్ట్‌ లా చేసి, గోరువెచ్చని పాలలో కలపండి. చిటికెడు యాలకుల పొడి, కొద్దిగా తేనె జోడించి తాగండి. ఇది ఉపవాసం వల్ల కలిగే బలహీనత, అలసటను దూరం చేసి, శరీరానికి బలాన్ని, పోషణను అందిస్తుంది.

[ of 5 - Users]
Story first published: Monday, September 22, 2025, 15:00 [IST]
Desktop Bottom Promotion