హైదరాబాద్ అనగానే బిర్యానీనే కాదు.. ఈ ఖట్టీ దాల్ -తలా హువా గోష్ట్ కాంబో రుచి అదిరిపోతుంది!

Posted By:

హైదరాబాద్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది బిర్యానీ. కానీ, అసలైన హైదరాబాదీల ఇళ్లలో ప్రతి వీకెండ్ లేదా ఏదైనా ప్రత్యేకమైన రోజున తప్పనిసరిగా చేసుకునే మరో అద్భుతమైన కాంబినేషన్ ఒకటుందండోయ్. అదే వేడి వేడి అన్నంలో కలుపుకోవడానికి పుల్లపుల్లని ఖట్టీ దాల్, దానికి నంజుకోవడానికి నోరూరించే తలా హువా గోష్ట్ (హైదరాబాదీ మటన్ ఫ్రై). కమ్మని పప్పు, కారం కారంగా కరకరలాడే మటన్ ముక్క.. ఈ రెండింటి కలయిక ఇస్తుంటే, ఆ మజాయే వేరు. పేరు వింటుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయా? అయితే బక్రీద్ సందర్భంగా బయట రెస్టారెంట్లకు వెళ్లే పనిలేకుండా, అచ్చమైన హైదరాబాదీ స్టైల్‌ లో ఈ రెండు వంటకాలను మీ ఇంట్లోనే ఎంతో సులువుగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Bakrid Special Authentic Hyderabadi Tala Hua Gosht and Khatti Dal Recipe in Telugu

తలా హువా గోష్ట్ తయారీకి కావలసిన పదార్థాలు

మటన్ - 500 గ్రాములు (లేతది)
పసుపు - 1 టీస్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - మీ రుచికి సరిపడా
నీళ్లు - అర గ్లాసు
కారం - 2 టేబుల్ స్పూన్లు
నూనె - 5 టేబుల్ స్పూన్లు
కరివేపాకు - కొద్దిగా
పచ్చిమిర్చి - కొన్ని (పొడవుగా చీల్చినవి)
కొత్తిమీర - కొద్దిగా (సన్నగా తరిగినది)
నిమ్మకాయ - సగం చెక్క

తలా హువా గోష్ట్ తయారీ విధానం

-ముందుగా మటన్‌ ను శుభ్రంగా కడిగి ఒక ప్రెషర్ కుక్కర్‌ లో వేయండి. అందులో పసుపు, ఫ్రెష్‌ గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా ఉప్పు,అర గ్లాసు నీళ్లు పోసి అన్నీ ముక్కలకు పట్టేలా బాగా కలపండి. కుక్కర్ మూతపెట్టి 5 నుండి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. మటన్ మెత్తగా ఉడికితేనే ఫ్రై రుచిగా ఉంటుంది.

-ఇప్పుడు ఒక వెడల్పాటి ఇనుప పెనం (తవా) తీసుకుని పొయ్యి మీద పెట్టండి. అందులో కుక్కర్‌ లో ఉడికించిన మటన్ ముక్కలను నీటితో సహా వేసి, ఆ నీరంతా పూర్తిగా ఇగిరిపోయేలా ఉడికించండి. నీరు ఇగిరిపోయాక, అందులో 5 టేబుల్ స్పూన్ల నూనె, కారం వేసి బాగా వేయించండి. ముక్కలకు కారం పట్టి మంచి ఎరుపు రంగులోకి మారుతాయి.

-మటన్ ముక్కలు ఎర్రగా, క్రిస్పీగా వేగుతున్న సమయంలో అందులో కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు వేసి మరో రెండు నిమిషాలు కలపండి. వాటి సువాసన మటన్‌కు అద్భుతంగా పడుతుంది.

-చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని, స్టవ్ ఆపేసి నిమ్మరసం పిండుకుంటే.. ఘుమఘుమలాడే హైదరాబాదీ తల హువా గోష్ట్ రెడీ.

ఖట్టీ దాల్ తయారీ విధానం

-200 గ్రాముల కందిపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్‌ లో వేయండి. అందులో 2 టమాటోల ముక్కలు, 4 పచ్చిమిర్చి, 2 టీస్పూన్ల కారం, 1 టీస్పూన్ పసుపు, 3 టీస్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక గ్లాసు నీళ్లు పోసి 3-4 విజిల్స్ వచ్చేదాకా మెత్తగా ఉడికించుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత పప్పుగుత్తితో మెత్తగా ఎనుపుకోవాలి.

-ఇప్పుడు ఆ పప్పులో మీ రుచికి తగినంత చింతపండు గుజ్జు, ఉప్పు, అదనంగా మరికొన్ని పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, కొత్తిమీర వేయండి. పప్పు మరీ చిక్కగా కాకుండా, కొంచెం పలచగా (సూప్ లాగా) ఉండటానికి తగినన్ని నీళ్లు పోసి 15 నిమిషాల పాటు సన్నని మంటపై బాగా మరిగించాలి. పప్పు ఎంత బాగా మరిగితే అందులోని మసాలాల ఫ్లేవర్ అంత బాగా తెలుస్తుంది.

-వేడి వేడి అన్నం వడ్డించుకుని, అందులో ఈ పుల్లని ఖట్టీ దాల్ వేసుకుని, పక్కన కరకరలాడే మటన్ ఫ్రై ముక్కను పెట్టుకుని తింటుంటే.. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేనిది.

[ of 5 - Users]
Story first published: Wednesday, May 27, 2026, 18:46 [IST]
Desktop Bottom Promotion