కమ్మని పెరుగు సేమియా..ఆహా ఏమి రుచి, తినరా మైమరచి..

Posted By:

ఉరుకుల పరుగుల జీవితంలో ఉదయం పూట హడావుడి లేకుండా, ఆరోగ్యకరమైన, రుచికరమైన బ్రేక్ ఫాస్ట్ చేసుకోవాలని అందరికీ ఉంటుంది. రోజూ తినే ఇడ్లీ, దోశ, ఓట్స్ బోర్ కొట్టాయా? వంట చేయడం పెద్ద పనిలా అనిపించకుండా, చాలా సులువుగా, త్వరగా చేసుకోగలిగే బ్రేక్‌ ఫాస్ట్ రెసిపీ కోసం చూస్తున్నారా? అయితే పెరుగు సేమియా ట్రై చేయండి.

Bored of Idli Dosa Try This Quick and Creamy Curd Semiya Recipe in Telugu

ఇది కేవలం బ్రేక్‌ ఫాస్ట్ లాగే కాదు, మధ్యాహ్నం లంచ్ బాక్స్‌ లోకి, లేదా రాత్రికి తేలికపాటి డిన్నర్‌ గా కూడా అద్భుతంగా సరిపోతుంది. కడుపుకు చల్లగా, కమ్మగా ఉండే ఈ ఆరోగ్యకరమైన పెరుగు సేమియాను ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

పెరుగు సేమియా తయారీకి కావాల్సిన పదార్థాలు

సేమియా - 1 కప్పు
వేడి నీళ్లు - ఉడికించడానికి తగినన్ని
ఉప్పు - రుచికి సరిపడా
గట్టి పెరుగు- ఒకటింబావు కప్పు
తురిమిన క్యారెట్ - 1
సన్నగా తరిగిన కీరదోస - కొద్దిగా
నూనె లేదా నెయ్యి - ఒకటిన్నర టీస్పూన్
ఆవాలు - అర టీస్పూన్
మినప్పప్పు - అర టీస్పూన్
శనగపప్పు - అర టీస్పూన్
కరివేపాకు - కొద్దిగా
ఎండుమిర్చి - 1
అల్లం తురుము - అర టీస్పూన్
ఇంగువ - చిటికెడు
వేరుశనగ గుళ్లు (పల్లీలు) - 1 టేబుల్ స్పూన్
జీడిపప్పు - 1 టేబుల్ స్పూన్

పెరుగు సేమియా తయారీ విధానం

-ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో సేమియాను వేసి, తక్కువ మంట మీద దోరగా, మంచి సువాసన వచ్చేలా వేయించుకోవాలి.

-అదే పాన్ లో తగినన్ని వేడి నీళ్లు, కొద్దిగా ఉప్పు వేసి సేమియాను మెత్తగా ఉడికించుకోవాలి. మరీ ముద్దగా అయిపోకుండా చూసుకోవాలి. ఉడికిన సేమియాను పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి.

-ఇప్పుడు ఒక గిన్నెలో గట్టి పెరుగును తీసుకుని, ఉండలు లేకుండా క్రీమ్‌ లాగా గిలకొట్టాలి. ఈ పెరుగులో తురిమిన క్యారెట్, కీరదోస వేసి బాగా కలపాలి. ఆ తర్వాత పూర్తిగా చల్లారిన సేమియాను ఈ పెరుగు మిశ్రమంలో వేసి నెమ్మదిగా కలుపుకోవాలి.

-ఇప్పుడు తాలింపు కోసం చిన్న కడాయిలో నూనె లేదా నెయ్యి వేడి చేసి, ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. తర్వాత అందులో మినప్పప్పు, శనగపప్పు వేసి దోరగా వేయించాలి. తర్వాత ఎండుమిర్చి, అల్లం తురుము, ఇంగువ, కరివేపాకు వేసి స్టవ్ ఆపేయాలి. ఈ కమ్మని పోపును పెరుగు సేమియాలో వేసి కలపాలి.

-చివరగా అదే కడాయిలో కొద్దిగా నూనె వేసి పల్లీలు, జీడిపప్పులను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించి, సేమియా పైన చల్లుకోవాలి. అంతే పెరుగు సేమియా రెడీ.

-అన్నీ కలిపాక వెంటనే తినేయకుండా 10 నిమిషాలు పక్కన పెట్టి ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే ఆ రుచే వేరు.

[ of 5 - Users]
Story first published: Friday, April 17, 2026, 6:40 [IST]
Desktop Bottom Promotion