క్యాటరింగ్ స్టైల్ దొండకాయ ఫ్రై..ఈ స్పెషల్ మసాలాతో చేస్తే ప్లేట్ మొత్తం క్షణాల్లో ఖాళీ!

Posted By:

మీ ఇంట్లో వాళ్లకు దొండకాయ కూర అంటే ఇష్టం లేదా? దొండకాయ వండుతున్నానని చెప్పగానే ముఖం మాడ్చుకుని, ప్లేట్లు వదిలేసి పరుగులు తీస్తుంటారా? ఇంట్లో దొండకాయ కూర చూసి ఆమడ దూరం పారిపోయే వాళ్ళు కూడా పెళ్లిళ్లలో, ఫంక్షన్లలో వడ్డించే క్యాటరింగ్ స్టైల్ దొండకాయ ఫ్రై అంటే ఎగబడి తింటారు. క్యాటరింగ్ స్టైల్ లో చేసే దొండకాయ వేపుడు వేడి వేడి అన్నంలో కలుపుకుని తినడానికే కాదు పప్పు, సాంబార్, రసంలోకి సైడ్ డిష్‌గా కూడా అద్భుతంగా ఉంటుంది.

Catering Style Ivy Gourd Fry How To Make Crispy Tasty Function Style Dondakaya Fry in Telugu

క్యాటరింగ్ స్టైల్ దొండకాయ ఫ్రై తయారీకి కావాల్సినవి

దొండకాయలు - అర కేజీ
నూనె - 1 లేదా 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - 1 టీస్పూన్
మినపపప్పు - 1 టీస్పూన్
పల్లీలు లేదా పచ్చి శనగపప్పు - 1 టీస్పూన్
కరివేపాకు - 1 రెమ్మ
పసుపు - పావు టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా

స్పెషల్ మసాలా పొడి కోసం

ఎండు మిరపకాయలు - 3
కాశ్మీరీ ఎండు మిరపకాయలు - 4
కరివేపాకు - 1 కట్ట
పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి తురుము - 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - 1 టీస్పూన్

క్యాటరింగ్ స్టైల్ దొండకాయ ఫ్రై తయారీ విధానం

-ముందుగా దొండకాయలను నీళ్లలో శుభ్రంగా కడిగి, సన్నగా, పొడవుగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని అందులో నూనె వేడి చేయండి. నూనె కాగాక ఆవాలు, మినపపప్పు, పల్లీలు వేసి దోరగా వేయించండి. చివరగా కరివేపాకు వేసి చిటపటలాడనివ్వండి.

-ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను కడాయిలో వేసి ఒక రెండు నిమిషాల పాటు నూనెలో బాగా వేయించండి. ఆ తర్వాత ముక్కలకు తగినంత పసుపు, సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. మంటను మీడియంలో పెట్టి, మూత మూసి సుమారు 10 నిమిషాల పాటు దొండకాయలను మగ్గనివ్వండి.

-దొండకాయలు మగ్గుతున్న సమయంలో, పక్కన వేరొక స్టవ్ మీద చిన్న పాన్ పెట్టుకోండి. అందులో సాధారణ ఎండుమిర్చి, కాశ్మీరీ ఎండుమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించండి. మిరపకాయలు వేగాక కొబ్బరి తురుము వేసి, కొబ్బరిలోని తేమ పోయి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించి స్టవ్ ఆపేయండి. ఈ వేయించిన మిశ్రమాన్ని బాగా చల్లారనివ్వండి. చల్లారాక మిక్సీ జార్‌ లో వేసి, దానికి ఒక టీస్పూన్ జీలకర్ర జతచేసి బరకగా లేదా మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోండి.

-పది నిమిషాల తర్వాత దొండకాయలు 80 శాతం మెత్తగా ఉడికినట్లు అనిపించగానే, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని అందులో చల్లి ముక్కలన్నింటికీ మసాలా బాగా పట్టేలా కలుపుకోండి. తర్వాత మూత పెట్టకుండా, సన్నటి మంట మీద మరో 5 నిమిషాల పాటు వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేయండి.

-అంతే ఎంతో గుమగుమలాడే, కరకరలాడే క్యాటరింగ్ స్టైల్ దొండకాయ ఫ్రై రెడీ.

[ of 5 - Users]
Story first published: Saturday, July 25, 2026, 11:05 [IST]
Desktop Bottom Promotion