లక లక లక... అదిరిపోయే కిక్ ఇచ్చే స్పైసీ చంద్రముఖి చికెన్ ఫ్రై..ఎలా చేసుకోవాలంటే..

Posted By:

ఈ మధ్య కాలంలో భోజన ప్రియుల మనసు దోచుకుంటున్న మరో అద్భుతమైన, స్పైసీ స్టార్టర్ చంద్రముఖి చికెన్ ఫ్రై. పేరు వినగానే ఇది ఎంత స్పైసీగా, కిక్ ఇచ్చేలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. చంద్రముఖి సినిమాలో ఆ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో, ఈ చికెన్ ఫ్రై రుచి కూడా అంతే ఘాటుగా, నోరూరించేలా ఉంటుంది.

కారంగా, క్రంచీగా ఉండే ఈ ఫ్రైని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇది కేవలం రుచికి మాత్రమే కాదు, ఇందులో వాడే దినుసుల వల్ల శరీరానికి పలు ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందుతాయి. చంద్రముఖి చికెన్ ఫ్రైని ఇంట్లోనే పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Chandramukhi Chicken Fry Recipe in Telugu The Ultimate Fiery Starter for Chicken Lovers

కావాల్సిన పదార్థాలు
-బోన్‌లెస్ చికెన్
-అల్లం వెల్లుల్లి పేస్ట్
-పసుపు
-కారం
-ధనియాలు
-మిరియాలు
-సోంపు
-లవంగాలు
-యాలకలు
-దాల్చిన చెక్క
-ఉల్లిపాయ
-ఉప్పు
-నూనె
-పచ్చిమిర్చి
-కరివేపాకు
-జీడిపప్పు
-ఎండుమిర్చి
-కొత్తిమీర
-కసూరి మేతీ
-ఎండు కొబ్బరి తురుము

Chandramukhi Chicken Fry Recipe in Telugu The Ultimate Fiery Starter for Chicken Lovers

తయారీ విధానం

-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 750 గ్రాముల శుభ్రంగా కడిగిన చికెన్ వేసి ఇందులోనే ఒకటింబావు కప్పుల నీళ్లు, పావు టీస్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి కలిపి మూతపెట్టి చికెన్ ను మెత్తగా ఉడకనివ్వాలి. 80 శాతం ఉడికితే చాలు.

-ముక్కను పట్టుకున్నప్పుడు ఇంకా 5-6 నిమిషాలు ఉడకాలి అన్నట్లు ఉడికితే చాలు..అప్పుడు స్టవ్ ఆపేసి చికెన్ ముక్కలను ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి.

-తర్వాత స్టవ్ మీద మరో పాన్ పెట్టి అందులో 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక ఇందులో 1 టీస్పూన్ మిరియాలు, 3 లవంగాలు, 2 యాలకలు, అంగుళంన్నర దాల్చిన చెక్క, సగం అవాస పువ్వు ముక్క వేసి 30 సెకన్ల పాటు వేయించాలి.

-దాల్చిన చెక్క పొంగడం మొదలవ్వగానే అందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 3-4 ఎండుమిర్చి, 1 టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ సోంపు వేసి పొంగించండి. మసాలాలు జస్ట్ పొంగితే చాలు.. ఎర్రగా వేపితే చేదు వస్తుందని గుర్తు పెట్టుకోండి.

-ధనియాలు పొంగగానే అందులో పావు కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి, 2 పచ్చిమిరపకాయల ముక్కలు వేసి వేపండి. ఉల్లిపాయ కాస్త రంగు మారిన తర్వాత స్టవ్ ఆపేసి దీనిని మిక్సీ గిన్నెలో వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు స్టవ్ మీద పాన్ లో పావు కప్పు ఆయిల్ వేసి వేడయ్యాక అందులో 2 యాలకలు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 3 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసి వేయించాలి. జీడిపప్పు రంగు మారుతున్నప్పుడు అందులో ముప్పావు కప్పు ఉల్లిపాయ తరుగు, రుచికి సరిపడా ఉప్పు, 2 రెబ్బల కరివేపాకు వేసి వేయించాలి.

-ఉల్లిపాయ ముక్కలు లేత బంగారు రంగులోకి రాగానే అందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించాలి. తర్వాత పాన్ లో ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి ఒక నిమిషం వేపండి.

-తర్వాత అందులో గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసి మొత్తం చికెన్ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోండి. గ్రేవీలో నుంచి నూనె పైకి తేలేంతవరకు కలుపుతూ వేయించుకోవాలి.

-నూనె పైకి తేలుతున్నప్పుడు అందులో అర టేబుల్ స్పూన్ కసూరి మేతీని నలిపి వేసుకోండి, ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కారం చల్లి బాగా కలుపుకోండి. అవసరం అనుకుంటే చికెన్ ఉడికించుకున్న నీళ్లు కొద్దిగా చిలకరించుకోండి.

-కారాలు వేగిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి తురుము వేసి ఒక నిమిషం వేపుకొని స్టవ్ ఆపేయండి. ఇప్పుడు అందులో కొత్తిమీర తరుగు చల్లుకొని కలుపుకోండి. అంతే చంద్రముఖి చికెన్ ఫ్రై రెడీ.

[ of 5 - Users]
Story first published: Saturday, February 21, 2026, 17:58 [IST]
Desktop Bottom Promotion