మిగిలిన అన్నంతో క్రిస్పీ దోశ.. 10 నిమిషాల్లో సింపుల్‌గా ఇలా చేసుకోవచ్చు!

సాధారణంగా ప్రతి ఇంట్లో రాత్రుళ్ళు వండుకున్న అన్నం కొంచెం మిగిలిపోతూ ఉంటుంది. ఆ అన్నం పారేయడం చాలా మందికి ఇష్టం ఉండదు. అందుకే ఆ అన్నాన్ని కొందరు తినేస్తే కొందరు కొంచెం డిఫరెంట్‌గా ఏదైనా చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారు మిగిలిపోయిన అన్నంతో ఎంతో రుచికరమైన దోశలు వేసుకోవచ్చు. ఈ దోశలు క్రిస్పీగా చాలా రుచికరంగా ఉంటాయి. అయితే మిగిలిన అన్నంతో ఏ విధంగా దోశలు వేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మిగిలిన అన్నంతో దోశ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు

  1. రెండు కప్పుల అన్నం
  2. ఒక కప్పు ఉప్మా రవ్వ
  3. ఒక కప్పు పుల్లటి పెరుగు
  4. అర కప్పు మైదా పిండి లేదా గోధుమ పిండి
  5. పిండి కలుపుకోవడానికి సరిపడా నీరు
  6. కొంచెం నూనె
  7. రుచికి తగినంత ఉప్పు

మిగిలిన అన్నంతో దోశ తయారీ విధానం

ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు కప్పుల అన్నం, ఒక కప్పు ఉప్మా రవ్వ, పెరుగు, మైదా పిండి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసేటప్పుడు పిండి బిగుతుగా వచ్చే అవకాశం ఉంది. అందుకే మధ్య మధ్యలో మిక్సీని ఆపుతూ కొంచెం నీళ్లు చల్లుకుంటూ మెత్తగా పిండిని రుబ్బుకోవాలి.

అలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలో రుచికి సరిపడా ఉప్పు, కొంచెం సోడా ఉప్పు కూడా వేసుకోవాలి. దోశ వేసుకునేందుకు వీలుగా కొంచెం లూస్‌గా ఈ పిండిని కలుపుకోవాలి. ఆ పిండి దోశ వేసుకునేందుకు వీలుగా లేకపోతే కొంచెం నీళ్లు కలుపుకొని ఆ మాదిరిగా తయారు చేసుకోవాలి. ఆ తరువాత పిండిని బాగా కలిపి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

ఆ తరువాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలి. పెనం వేడయ్యాక దానిపై కొంచెం నూనె వేసుకొని సగం తరిగిన ఉల్లిపాయతో పెనం మొత్తం నూనె స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దోశ పిండిని తీసుకొని ఆ పెనంపై కాస్త మందంగానే దోశను వేసుకోవాలి. రెండు వైపులా దోశను కాల్చుకున్నాక ప్లేట్‌లో తీసుకోవాలి. ఇలా పిండి అయిపోయేంత వరకు అన్ని దోశలు వేసుకుంటే ఎంతో రుచికరమైన దోశ సిద్ధమైపోయినట్లే. ఈ దోశలను కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, లేదా పల్లి చట్నీలతో కూడా తినొచ్చు. ఎంతో రుచికరంగా ఉంటాయి.

[ of 5 - Users]
Story first published: Monday, December 9, 2024, 9:05 [IST]
Desktop Bottom Promotion