చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా..

Posted By:

ఎప్పుడూ తినే చికెన్, మటన్ లేదా వెజ్ బిర్యానీలు తిని బోర్ కొట్టిందా? అయితే ఈ సారి కాస్త భిన్నంగా, పుల్లపుల్లగా, కారంకారంగా, అదిరిపోయే రుచితో ఉండే టమాటా బిర్యానీని ట్రై చేయండి. ఇంట్లో ఉండే సాధారణ పదార్థాలతోనే, ప్రెషర్ కుక్కర్లో చాలా సులభంగా తయారు చేసుకోగలిగే అద్భుతమైన వంటకం ఇది.

పల్లీల కరకరలు, టమాటా పులుపు, మసాలాల ఘాటు కలగలిసి ప్రతీ ముద్దలోనూ సరికొత్త రుచిని పంచుతుంది. నోరూరించే టమాటా బిర్యానీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

Easy Pressure Cooker Tomato Biryani Recipe in Telugu Simple Ingredients Amazing Taste

టమాటా బిర్యానీ కావాల్సిన పదార్థాలు

టమాటా మసాలా పేస్ట్ కోసం:
నీళ్లు - తగినన్ని
గరం మసాలా దినుసులు (యాలక,లవంగ, చెక్క,షాజీరా తదితరాలు)
అల్లం - చిన్న ముక్క
వెల్లుల్లి రెబ్బలు - కొన్ని
టమాటాలు - తగినన్ని
బ్యాడగి ఎండుమిర్చి - కొన్ని
గుంటూరు ఎండుమిర్చి - కొన్ని
బిర్యానీ తయారీకి:
నూనె - తగినంత
బిర్యానీ ఆకు - 1 లేదా 2
కసూరి మేతి - కొద్దిగా
ఉల్లిపాయ - 1
పల్లీలు - ఒక గుప్పెడు
టమాటా - 1
కొత్తిమీర, పుదీనా ఆకులు - కొద్దిగా
సాధారణ నీళ్లు - బియ్యానికి తగినన్ని
బాస్మతి బియ్యం - అరగంట పాటు నానబెట్టినవి
ఉప్పు - రుచికి సరిపడా
నిమ్మరసం - కొద్దిగా

నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం

టమాటా బిర్యానీ తయారీ విధానం

-ముందుగా టమాటా మసాలా తయారీ కోసం.. ఒక గిన్నెలో తగినన్ని నీళ్లు పోసి, అందులో గరం మసాలా దినుసులు, అల్లం, వెల్లుల్లి, ముక్కలుగా చేసుకున్న టమాటాలు, రంగునిచ్చే బ్యాడగి మిర్చి,గుంటూరు మిర్చి వేసి బాగా మరిగించాలి. టమాటాలు, ఎండుమిర్చి మెత్తబడే వరకు ఉడికించాలి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి, ఈ మిశ్రమాన్ని కాస్త చల్లారనివ్వాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్‌ లో వేసి మెత్తటి పేస్ట్‌లా పట్టుకోవాలి. ఈ పదార్థాలను ఉడికించిన నీళ్లను పారబోయకుండా, బిర్యానీలో వాడుకోవడానికి పక్కన పెట్టుకోండి. మసాలా ఫ్లేవర్స్ అన్నీ ఆ నీళ్లలోనే ఉంటాయి.

-ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి, తగినంత నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కాక బిర్యానీ ఆకు, కసూరి మేతి వేసి వేయించాలి. ఆపై సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి అవి బంగారు వర్ణంలోకి మారేదాకా దోరగా వేయించాలి. ఆ తర్వాత పల్లీలు వేసి రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు తరిగిన టమాటా ముక్కలు వేసి మెత్తగా మగ్గనివ్వాలి.

-టమాటాలు మగ్గాక, ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా మసాలా పేస్ట్‌ ను వేసి, పచ్చివాసన పోయేదాకా నూనెలో బాగా వేయించాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా ఆకులు చల్లుకోవాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న మసాలా నీళ్లతో పాటు, ఎసరుకు సరిపడా సాధారణ నీళ్లను పోయాలి. ఎసరు మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని, రుచికి సరిపడా ఉప్పును వేసి నిదానంగా కలపాలి. చివరగా కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి.

-అన్ని పదార్థాలు వేసిన తర్వాత కుక్కర్ మూతపెట్టి, మంటను పూర్తిగా తగ్గించి 15 నిమిషాల పాటు ఉడికించాలి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసి, వెంటనే మూత తీయకుండా కాసేపు అలాగే వదిలేయాలి. ప్రెషర్ పోయాక మూత తీసి, అన్నం మెతుకులు విరిగిపోకుండా గరిటెతో నెమ్మదిగా కలుపుకోవాలి.

-అంతే వేడి వేడి టమాటా బిర్యానీ రెడీ. దీనికి చల్లని రైతా కాంబినేషన్‌ తో వడ్డిస్తే ఆ రుచికి ఇంట్లో వాళ్ళంతా ఫిదా అవ్వాల్సిందే.

[ of 5 - Users]
Story first published: Friday, October 16, 2026, 21:13 [IST]
Desktop Bottom Promotion