మందులు వద్దు.. రోజుకో బెల్లం-కొబ్బరి లడ్డూ'తో మీ ఎముకలు ఉక్కులా!

Posted By:

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో కీళ్ల నొప్పులు, ఎముకల బలహీనత అనేది వయసుతో సంబంధం లేకుండా అందరినీ వేధిస్తున్న ప్రధాన సమస్య. ఎముకల బలం అనగానే మనం వెంటనే మందులు లేదా సప్లిమెంట్ల వైపు చూస్తుంటాం. కానీ మన అమ్మమ్మలు, నానమ్మలు ఆచరించిన సాంప్రదాయ ఆహారపు అలవాట్లలోనే ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. అలాంటి ఒక అద్భుతమైన,రుచికరమైన దేశీయ పరిష్కారమే బెల్లం-కొబ్బరి లడ్డూ.

బెల్లంలో పుష్కలంగా ఉండే ఐరన్, మినరల్స్..కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, అలాగే డ్రై ఫ్రూట్స్ అందించే పోషకాలు అన్నీ కలిసి మీ ఎముకలను దృఢంగా మారుస్తాయి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే బెల్లం కొబ్బరి లడ్డూలను ఇంట్లోనే చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Healthy Tasty and Easy How to Make Jaggery Coconut Laddu at Home Recipe in Telugu

బెల్లం-కొబ్బరి లడ్డూ తయారీకి కావాల్సిన పదార్థాలు

నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు
బాదం, జీడిపప్పు- 1 కప్పు
పల్లీలు- 100 గ్రాములు
తురిమిన పచ్చి కొబ్బరి - 2 కప్పులు
నాణ్యమైన బెల్లం - 250 గ్రాములు
యాలకుల పొడి - 1 టీస్పూన్
సోంపు పొడి - 1 టీస్పూన్
ఎండుద్రాక్ష- 2 టేబుల్ స్పూన్లు
పుచ్చకాయ గింజలు - 2 టేబుల్ స్పూన్లు
ఎండు కొబ్బరి పొడి- 2 టేబుల్ స్పూన్లు

బెల్లం-కొబ్బరి లడ్డూ తయారీ విధానం

-ముందుగా ఒక బాండీని స్టవ్ మీద పెట్టి పల్లీలను సన్నని మంటపై దోరగా వేయించండి. అవి చల్లారాక పొట్టు తీసి, మిక్సీలో వేసి కరకరలాడేలా బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.

-అదే బాండీలో డ్రై ఫ్రూట్స్ వేసి కొద్దిగా వేయించి తీసేయండి. చల్లారాక వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు బాండీలో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి, అందులో తురిమిన కొబ్బరిని వేయండి. సన్నని మంటపై లేత బంగారు రంగు వచ్చే వరకు కలుపుతూ వేయించండి. వేగిన కొబ్బరిలో ముందుగా గ్రైండ్ చేసిన పల్లీల పొడి, కట్ చేసిన డ్రై ఫ్రూట్స్, ఎండుద్రాక్ష, పుచ్చకాయ గింజలు వేసి అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేయండి.

-స్టవ్ మీద మరొక గిన్నెలో బెల్లం వేసి, కొద్దిగా నీళ్లు పోసి కరిగించండి. బెల్లం పూర్తిగా కరిగి పల్చటి పాకంలా తయారు చేసుకోండి.

-సిద్ధమైన వేడి బెల్లం పాకాన్ని కొబ్బరి-డ్రై ఫ్రూట్స్ మిశ్రమంలో పోసి గరిటెతో బాగా కలపండి. యాలకుల పొడి, సోంపు పొడి వేసి మరోసారి అంతా కలుపుకోండి.

-మిశ్రమం కాస్త చల్లారి చేతితో పట్టగలిగే వేడికి రాగానే, నెయ్యి రాసుకున్న చేతులతో చిన్న చిన్న ఉండలుగా గుండ్రంగా చుట్టండి. ఆ లడ్డూలను ఎండు కొబ్బరి పొడిలో దొర్లించండి.

-అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యానికి మేలు చేసే బెల్లం-కొబ్బరి లడ్డూలు రెడీ.

-ఈ లడ్డూలను గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుని, ప్రతిరోజూ ఒక లడ్డూను మితంగా తినడం వల్ల మీ ఎముకలు ఉక్కులా మారడమే కాకుండా, శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.

[ of 5 - Users]
Story first published: Monday, March 30, 2026, 8:13 [IST]
Desktop Bottom Promotion