పల్లెటూరి ఫేమస్.. ఎండు మటన్ కూర, తక్కువ మాసాలతో ఇలా చేసుకుంటే కమ్మగా ఉంటుంది

వేసవి కాలంలో చాలా మంది ఊళ్లలో పండగలు చేస్తుంటారు. తెలంగాణలో అయితే మైసమ్మలు, దేవుళ్ళకు సంబంధించిన పూజలు చేస్తుంటారు. ఈ పండగలు చేసేటప్పుడు కచ్చితంగా యాటలను కొస్తుంటారు. ఇలా యాటలను కోసినప్పుడు.. మాంసం మిగిలిపోతే వాటికి పసుపు, ఉప్పు దట్టించి ఎండబెడతారు. అవి ఎండిన తరువాత వాటిని నిలువ చేసుకొని, ఇష్టమొచ్చినప్పుడు వండుకొని తింటుంటారు. ఆ కూర మాత్రం అద్భుతంగా ఉండేది. రుచి వేరే లెవెల్ ఉండేది. నాకు తెలిసి ఇది చదువుతున్న మీకు ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు వచ్చేసి ఉంటాయి. అయితే ఆ రకమైన వంటలు ఇప్పుడు కనుమరుగైపోతున్నాయి. చాలా మంది వాటిని మర్చిపోతున్నారు. అందుకే ఈ స్టోరీలో పాతకాలం విధానంలో ఎండు మటన్ వంటను ఎలా చేసుకోవాలి, చాలా సింపుల్ మసాలాలతో ఎలా వండుకోవాలి అనేది చెప్తాము రండి.

ఎండు మటన్ కూర తయారీకి కావాల్సిన పదార్థాలు

ఎండు మటన్ అరకిలో
రెండు ఉల్లిపాయలు
మూడు పచ్చి మిర్చి
అల్లం వెల్లుల్లి పేస్ట్
గరం మసాలా
మటన్ మసాలా
కొద్దిగా కరివేపాకు
వంటకు సరిపడా నూనె
రుచికి సరిపడా ఉప్పు
కొంచెం జొన్న పిండి
పసుపు
కారం

ఎండు మటన్ కూర తయారీ విధానం..

ఈ ఎండు మటన్ కూర తయారీ చాలా సులభం. ఈ కూరను వండుకోవడానికి ముందుగానే.. అరకిలో ఎండు మటన్ ముక్కలను నీటిలో నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోకపోతే ఆ మటన్ సరిగ్గా ఉడకదు. ఈ మటన్ ముక్కలు నానేలోపు మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని, అందులో వంటకు సరిపడా నూనె పోసుకోవాలి. ఈ వంటకు ప్రత్యేకమైన కోలతతో నూనె పోయాల్సిన అవసరం లేదు. కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. ఇప్పుడు నూనె కొంచెం వేడయ్యాక.. అందులో ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగాకా అందులో పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి.

మామిడి పండ్లతో అదిరిపోయే డిజర్ట్.. సింపుల్‌గా ఇలా చేసుకోవచ్చు, డిన్నర్ తరువాత తింటే అదిరిపోతుంది!

ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేవరకు వేయించుకోవాలి. పచ్చి వాసన పోయిన తరువాత.. అందులో ఎండు మటన్ ముక్కలను వేసుకొని వేపుకోవాలి. మటన్ ముక్కలు బాగా వేగిన తరువాత.. అందులో పసుపు వేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు వేసి మొత్తం కలుపుకొని కాసేపు ఉడకనివ్వాలి. ఆ తరువాత మూత తీసి.. దాంట్లో కారం వేసి కలుపుకోవాలి. అలాగే కొంచెం నీరు పోసి కాసేపు ఉడకనివ్వాలి.

ఇప్పుడు మూడు చెంచాల జొన్న పిండి తీసుకొని.. నీటిలో కలుపుకొని ఆ కూరలో వేసుకోవాలి. అనంతరం వాటన్నిటినీ బాగా కలుపుకొని.. అందులో గరం మసాలా, మటన్ మసాలా వేసుకొని కలుపుకోవాలి. దీనిని ఒక్క రెండు నిమిషాలు ఉడకబెట్టిన తరువాత రుచి సరి చేసుకొని, కొత్తిమీర చల్లుకొని దించుకోవడమే. ఎంతో రుచికరమైన పాతకాలం నాటి ఎండు మటన్ కూర సిద్ధమైనట్లే. ఒక్కసారి మీరు ఈ వంటను తిని చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని తినకపోతే చెప్పండి. నెక్స్ట్ లెవెల్ అంతే.

[ of 5 - Users]
Story first published: Tuesday, April 29, 2025, 13:34 [IST]
Desktop Bottom Promotion