కనుమ స్పెషల్..చికెన్ కర్రీతో నోట్లో వెన్నలా కరిగిపోయే కొబ్బరి జీలకర్ర దోస

Posted By:

సాధారణంగా మన తెలుగు వారి ఇళ్లలో ఉదయం బ్రేక్‌ ఫాస్ట్ అనగానే గుర్తొచ్చేది ఇడ్లీ లేదా దోస. అందులోనూ దోస అంటే పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఇష్టమే. కానీ ప్రతిరోజూ మినప్పప్పు నానబెట్టి, రుబ్బి తయారుచేసే ఆ పాతకాలపు దోసనే తింటూ బోర్ కొట్టిందా? నాలుకకు కొత్త రుచిని పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే ఈసారి కొబ్బరి జీలకర్ర దోస ట్రై చేయండి.

ఈ దోస కేవలం రుచిలోనే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో మనం వాడే కొబ్బరి కమ్మదనాన్ని ఇస్తే, జీలకర్ర జీర్ణశక్తిని పెంచుతుంది. ఈ కనుమ నాడు దీనిని చికెన్ కర్రీతో గానీ, లేదా సింపుల్ కొబ్బరి చట్నీ, టమోటా చట్నీతో గానీ తింటే ఆ రుచే వేరు. కొబ్బరి జీలకర్ర దోస ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Kanuma 2026 Special Authentic Coconut Jeera Dosa With Chicken Curry Recipe in Telugu

కావలసిన పదార్థాలు
పచ్చి బియ్యం: 1 కప్పు
పచ్చి కొబ్బరి: అర కప్పు
సాంబార్ ఉల్లిపాయలు: 10
జీలకర్ర: అర టీస్పూన్
ఎండు మిరపకాయలు: 2
కరివేపాకు: 1 రెమ్మ
ఉప్పు: రుచికి సరిపడా
నీళ్లు: 1 కప్పు
నూనె: దోస కాల్చడానికి

తయారీ విధానం

-ముందుగా ఒక కప్పు పచ్చి బియ్యాన్ని తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి సుమారు 3 నుండి 4 గంటల పాటు నానబెట్టాలి. బియ్యం ఎంత బాగా నానితే దోస అంత మృదువుగా వస్తుంది.

-నానబెట్టిన బియ్యాన్ని నీరు వంపి మిక్సీ జార్‌ లో వేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా పేస్ట్‌ లా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోండి.

-ఇప్పుడు అదే మిక్సీ జార్‌ లో సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు, సాంబార్ ఉల్లిపాయలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, కరివేపాకు వేయాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు చల్లి వీటిని కూడా మెత్తని పేస్ట్‌ లా రుబ్బుకోవాలి. ఈ మసాలానే మన దోసకు అసలైన రుచిని, సువాసనను ఇస్తుంది.

-మిక్సీలో రుబ్బుకున్న కొబ్బరి-మసాలా మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న బియ్యం పిండిలో కలపాలి. ఇప్పుడు ఈ పిండిలో తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. ఈ దోస పిండి చిక్కగా ఉండకూడదు. రవ్వ దోస లేదా నీర్ దోస పిండిలా జారుగా ఉండాలి.

-స్టవ్ మీద దోస పెనం పెట్టి బాగా వేడి చేయండి. పెనం వేడెక్కాక, కొద్దిగా నూనె రాయండి. ఇప్పుడు గరిటతో పిండిని తీసుకుని, రవ్వ దోస వేసినట్లుగా పెనం అంచుల నుండి మధ్యలోకి పోయాలి. సాధారణ దోసలా గరిటతో రుద్దకూడదు.

-దోస చుట్టూ కొద్దిగా నూనె వేసి, పెనంపై మూత పెట్టండి. ఈ దోస ఆవిరిపై ఉడికితేనే రుచి బాగుంటుంది. మీడియం మంటపై కాసేపు ఉడికించిన తర్వాత, మూత తీసి చూడండి. దోస పెనం నుండి విడిపోతున్నట్లు కనిపిస్తే సరిపోతుంది.

-దీనిని తిరగేయాల్సిన అవసరం లేదు. అంతే వేడి వేడి, గుమగుమలాడే కొబ్బరి జీలకర్ర దోస రెడీ.

[ of 5 - Users]
Story first published: Tuesday, January 13, 2026, 7:44 [IST]
Desktop Bottom Promotion