బఠానీ, పెసరపప్పు కాంబినేషన్... ఈ సమోసా రుచి చూస్తే మళ్లీ మళ్లీ తింటారు!

Posted By:

సమోసా అంటే కేవలం ఒక స్నాక్ మాత్రమే కాదు, అదొక మధురమైన ఎమోషన్. అయితే ఎప్పుడూ ఒకేరకమైన బంగాళదుంప, పనీర్ సమోసాలు తిని విసుగొచ్చిందా? పైగా బరువు పెరుగుతామనో, అందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయనో చాలామంది ఆరోగ్య ప్రియులు సమోసాలకు దూరంగా ఉంటున్నారు. అలాంటి వారి కోసమే రుచి, ఆరోగ్యం కలగలిపిన పెసరపప్పు సమోసా. బఠానీలు, పెసరపప్పు కలిపి చేసే ఈ సమోసా ప్రోటీన్లతో నిండి కరకరలాడుతూ, లోపల కారంగా, జ్యూసీగా ఉండి నోటికి పండుగలా అనిపిస్తుంది.

Moong Dal Samosa Recipe in Telugu Make High Protein Healthy Snack Moong dal Peas samosa at Home

పెసరపప్పు సమోసా తయారీకి కావలసిన పదార్థాలు

మైదా పిండి (లేదా గోధుమ పిండి) - 2 కప్పులు
వాము - అర టీస్పూన్
నెయ్యి లేదా నూనె - 4 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
పెసరపప్పు - అర కప్పు
పచ్చి బఠానీలు - అర కప్పు
పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ - ఒక టీస్పూన్
సోంపు పొడి - అర టీస్పూన్
ధనియాల పొడి - అర టీస్పూన్
గరం మసాలా - పావు టీస్పూన్
ఆమ్చూర్ (మామిడికాయ) పొడి - అర టీస్పూన్
ఇంగువ - చిటికెడు
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
ఉప్పు - తగినంత

పెసరపప్పు సమోసా తయారీ విధానం

-ముందుగా పెసరపప్పుని 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత నీళ్లు తీసేసి పప్పుని మిక్సీలో వేసి బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి.

-తర్వాత ఒక వెడల్పాటి గిన్నెలో మైదా లేదా గోధుమ పిండిని తీసుకోండి. అందులో వాము, ఉప్పు, కొద్దిగా వేడిచేసిన నెయ్యి వేసి చేత్తో బాగా కలపండి. పిండికి నెయ్యి బాగా పట్టాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని గట్టి ముద్దలా కలుపుకోవాలి. కలిపిన పిండిపై ఒక తడి వస్త్రాన్ని కప్పి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

-స్టవ్ మీద ఒక పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయండి. అందులో చిటికెడు ఇంగువ, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించండి. ఆ తర్వాత సోంపు పొడి, ధనియాల పొడి వేసి కలపాలి.

-ఇప్పుడు బరకగా రుబ్బి పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమం, ఉడికించిన లేదా పచ్చి బఠానీలను అందులో వేసి కలపాలి. మంటను సిమ్‌ లో పెట్టి పప్పు, బఠానీలు మెత్తబడే వరకు 5 నుంచి 7 నిమిషాల పాటు వేయించాలి. చివరగా ఆమ్చూర్ పొడి, గరం మసాలా, ఉప్పు చల్లి బాగా కలిపి దించేయండి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.

-నానబెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి, పొడవాటి చపాతీల్లా (ఓవెల్ ఆకారంలో) ఒత్తుకోవాలి. దాన్ని కత్తితో సగానికి కత్తిరించి, ఒక భాగాన్ని త్రిభుజాకారం (కోన్) లాగా మడవాలి. అందులో చల్లారిన పెసరపప్పు-బఠానీ మిశ్రమాన్ని నింపి, అంచులు విడిపోకుండా నీటితో గట్టిగా అతికించాలి.

-స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయండి. సమోసాలను నూనెలో వేసి, తక్కువ నుండి మీడియం మంట మీద రెండు వైపులా తిప్పుతూ కరకరలాడే బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించాలి.

-అంతే ఎంతో గుమగుమలాడే వేడి వేడి పెసరపప్పు సమోసాలు రెడీ.

[ of 5 - Users]
Story first published: Wednesday, June 24, 2026, 13:19 [IST]
Desktop Bottom Promotion