జస్ట్ 10 నిమిషాల్లో అద్భుతమైన బ్రేక్‌ ఫాస్ట్..బంగాళాదుంప రవ్వ దోశ తింటే జన్మలో మర్చిపోరు..ఎలా చేసుకోవాలంటే

Posted By:

రోజూ పొద్దున్నే మన ఇళ్లల్లో వినిపించే మాట ఈరోజు టిఫిన్ ఏంటి?. దోశ అనగానే అందరి ముఖాల్లో ఒకటే ఆనందం. అయితే ముందు రోజు పిండి రుబ్బడం మర్చిపోతేనో? లేదా ఉన్న పిండి అయిపోతేనో? నిరాశ పడిపోతుంటారు. అయితే ఇకపై ఆ నిరాశ వద్దు. మీ వంటగదిలో ఉండే బంగాళాదుంప, కాస్తంత రవ్వతో అప్పటికప్పుడు అద్భుతమైన, కరకరలాడే దోసెలను చిటికెలో సిద్ధం చేయవచ్చు. ఈ బంగాళాదుంప రవ్వ దోశ కేవలం రుచికరమైనదే కాదు చాలా సులభం కూడా.

బంగాళాదుంప రవ్వ దోశ తయారీ కోసం దీని కోసం పిండి పులవాల్సిన అవసరం లేదు, గంటల తరబడి నానబెట్టే పనీ లేదు. అప్పటికప్పుడు పిండి కలిపి వేడి వేడి పెనం మీద పోస్తే చాలు. బంగారు రంగులో కరకరలాడే దోశ మీ ముందుంటుంది. దీనికి జతగా కొబ్బరి చట్నీ చేసుకుంటే, ఆ రుచి మాటల్లో వర్ణించలేం. ఆ కమ్మని చట్నీతో ఈ క్రిస్పీ దోశను తింటుంటే, ఆహా అనకుండా ఉండలేరు. పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ మళ్లీ మళ్లీ కావాలని అడుగుతారు. ఈ అద్భుతమైన బంగాళాదుంప రవ్వ దోశ తయారీ విధానం ఇక్కడ చూడండి.

No Dosa Batter No Problem Make Crispy Potato Rava Dosa in just 10 minutes

కావలసిన పదార్థాలు
-పెద్ద బంగాళాదుంప - 1
-గోధుమ పిండి - 1 కప్పు
-బొంబాయి రవ్వ - అర కప్పు
-ఉప్పు - రుచికి తగినంత
-నీరు - సుమారు 3 కప్పులు
-అల్లం - 1 అంగుళం
-చిల్లీ ఫ్లేక్స్ - 1 టీస్పూన్
-నిమ్మరసం - 1 టీస్పూన్
-కొత్తిమీర - కొద్దిగా
-కరివేపాకు - ఒక రెమ్మ
-పసుపు - పావు టీస్పూన్
-జీలకర్ర - 1 టీస్పూన్
-నూనె - దోసెలు కాల్చడానికి సరిపడా
కొబ్బరి చట్నీ కోసం:
-పచ్చి కొబ్బరి తురుము - 2 టేబుల్ స్పూన్లు
-పెరుగు - 2 టేబుల్ స్పూన్లు
-అల్లం - చిన్న ముక్క
-పచ్చిమిర్చి - 2-3
-కరివేపాకు - కొద్దిగా
-కొత్తిమీర - కొద్దిగా
-ఉప్పు - రుచికి సరిపడా
పోపు కోసం:
-నూనె - 1 టీస్పూన్
-ఆవాలు - 1/2 టీస్పూన్
-మినపప్పు - 1 టీస్పూన్
-కరివేపాకు - ఒక రెమ్మ
-ఎండుమిర్చి - 1

No Dosa Batter No Problem Make Crispy Potato Rava Dosa in just 10 minutes

తయారీ విధానం

-ముందుగా బంగాళాదుంపను శుభ్రంగా కడిగి, చెక్కు తీసి, సన్నగా తురుముకోవాలి. ఈ తురుమును ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు దానికి గోధుమ పిండి, బొంబాయి రవ్వ, రుచికి సరిపడా ఉప్పు వేయండి. ఉండలు లేకుండా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ, దోశల పిండి కంటే కొంచెం పల్చగా జారుడుగా కలుపుకోవాలి.

-ఇప్పుడు ఈ పిండిలో సన్నగా తరిగిన అల్లం, చిల్లీ ఫ్లేక్స్, నిమ్మరసం, కొత్తిమీర, కరివేపాకు, పసుపు, జీలకర్ర వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంపై మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. ఈ సమయంలో రవ్వ చక్కగా నాని, పిండి దోసెకు సిద్ధంగా ఉంటుంది.

-దోశ పిండి నానేలోపు చట్నీని రెడీ చేసుకోండి. ఇందుకోసం మిక్సీ జార్‌ లో పచ్చి కొబ్బరి తురుము, పెరుగు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు వేసి, అవసరమైతే కొద్దిగా నీళ్లు చేర్చి మెత్తగా రుబ్బుకోవాలి. దీనిని ఒక గిన్నెలోకి తీసుకోండి.

-తర్వాత స్టవ్ మీద చిన్న పాన్ పెట్టి అందులో ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకుతో పోపు పెట్టి దీనిని రెడీ చేసుకున్న చట్నీలో కలపాలి. ఘుమఘుమలాడే కొబ్బరి చట్నీ రెడీ.

-ఇప్పుడు స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టి బాగా వేడి చేయాలి. పెనం బాగా వేడెక్కాక నానబెట్టిన పిండిని మరోసారి కలిపి ఒక కప్పుతో తీసుకుని పెనం అంచుల నుండి లోపలికి గుండ్రంగా పోయాలి. రవ్వ దోసెలాగే అక్కడక్కడా ఖాళీలు ఏర్పడతాయి.

-పైన కొద్దిగా నూనె చల్లి మీడియం మంట మీద దోసెను కరకరలాడుతూ, బంగారు రంగులోకి వచ్చేవరకు కాల్చాలి. ఒకవైపు కాలితే సరిపోతుంది. అంతే వేడి వేడి, కరకరలాడే బంగాళాదుంప రవ్వ దోశ రెడీ.

[ of 5 - Users]
Story first published: Tuesday, September 2, 2025, 7:46 [IST]
Desktop Bottom Promotion