కేవలం 5 నిమిషాల్లో 4 అద్భుతమైన లస్సీలు.. సమ్మర్‌ కి పర్ఫెక్ట్ కూల్ డ్రింక్స్!

Posted By:

సమ్మర్ లో కడుపు నిండా తినడం కంటే గొంతును తడిపే చల్లని పానీయాలు తాగడానికే మన మనసు ఎక్కువగా ఆరాటపడుతుంది. ఎండ వేడికి అలసిపోయిన శరీరాన్ని తక్షణమే చల్లబరచి, కొత్త శక్తిని ఇవ్వడానికి మజ్జిగ, లస్సీలను మించిన బెస్ట్ ఆప్షన్ మరొకటి లేదు.

బయట మార్కెట్లో దొరికే లస్సీలు ఎంత రుచిగా ఉంటాయో, అంతే రుచితో,అంతకంటే ఆరోగ్యకరంగా ఇంట్లోనే కేవలం 5 నిమిషాల్లో స్వచ్ఛమైన లస్సీని తయారు చేసుకోవచ్చు. నాలుగు అద్భుతమైన ఫ్లేవర్లలో లస్సీలను ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

Pure Healthy and Delicious 4 Refreshing Homemade Lassi Recipes in Telugu

లస్సీ తయారీకి మూలం
పులవని, కమ్మటి, చిక్కటి ఇంట్లో తోడుపెట్టిన పెరుగును తీసుకోవాలి. ఒక పెద్ద గిన్నెలో పెరుగు వేసి, కవ్వంతో లేదా విస్కర్ తో ఎక్కడా ఉండలు లేకుండా మృదువుగా మారేంత వరకు బాగా చిలకాలి. ఇందులోపొడి చేసుకున్న పంచదార, అర చెంచా యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే మీ బేసిక్ లస్సీ మిశ్రమం సిద్ధమైనట్లే. ఇప్పుడు దీంతో రకరకాల ఫ్లేవర్స్ లస్సీ ఎలా చేయాలో చూడండి.

కుంకుమపువ్వు - పిస్తా లస్సీ

ముందుగా కొన్ని కుంకుమపువ్వు రేకులను రెండు టేబుల్ స్పూన్ల గోరువెచ్చని పాలలో నానబెట్టండి. ఆ తర్వాత ఆ పాలను, గుప్పెడు పిస్తా పప్పులను మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ముందుగా సిద్ధం చేసుకున్న బేసిక్ లస్సీకి జతచేసి బాగా కలపాలి.

దీన్ని ఒక గాజు గ్లాసులో పోసి, పైన కొన్ని కుంకుమపువ్వు రేకులు, సన్నగా తరిగిన పిస్తా పలుకులతో అలంకరించుకోవాలి. ఫ్రిజ్‌ లో ఉంచి చల్లబరిచిన ఈ లస్సీని తాగితే ఆ మజాయే వేరు.

మ్యాంగో లస్సీ

బాగా పండిన, తీయటి మామిడికాయను తీసుకుని తొక్క తీసి, లోపలి గుజ్జును తీసుకోవాలి. ఈ గుజ్జును మిక్సీలో వేసి మెత్తటి ప్యూరీలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మామిడి ప్యూరీని లస్సీ బేస్‌ లో వేసి బాగా మిక్స్ చేయాలి. గ్లాసులో పోసుకునేటప్పుడు, సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు వేసుకుని, దానిపై లస్సీ పోయాలి. పైన కూడా కొన్ని మామిడి ముక్కలతో అలంకరించుకోండి. అంతే మ్యాంగో లస్సీ రెడీ.

రిఫ్రెషింగ్ రోజ్ లస్సీ
కంటికి ఇంపుగా, గులాబీ రంగులో ఉండే ఈ లస్సీ వేసవిలో శరీరానికి అద్భుతమైన చలవ చేస్తుంది. దీని తయారీ చాలా సులభం. రోజ్ సిరప్ తీసుకుని బేసిక్ లస్సీలో కలుపుకోవాలి. ఒక గాజు గ్లాసు తీసుకుని దాని లోపలి అంచులకు కొంచెం రోజ్ సిరప్ అద్ది, ఆపై ఈ లస్సీని పోయాలి. పైన కొన్ని తాజా గులాబీ రేకులు చల్లుకోండి.

క్లాసిక్ ప్లెయిన్ లస్సీ
ఎలాంటి ఫ్లేవర్స్ లేకుండా, స్వచ్ఛమైన పెరుగు కమ్మదనాన్ని ఆస్వాదించాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. బేసిక్ లస్సీని ఒక పొడవాటి గ్లాసులో పోసుకోవాలి. కొన్ని తాజా పుదీనా ఆకులను పైన అలంకరించండి. యాలకుల సువాసన తక్షణమే మిమ్మల్ని రిఫ్రెష్ చేస్తుంది.

[ of 5 - Users]
Story first published: Saturday, February 28, 2026, 12:46 [IST]
Desktop Bottom Promotion