నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి!

Posted By:

భారతీయ వంటగదిలో టమాటోలకు ఉండే స్థానం ప్రత్యేకమైనది. మనం రోజూ తినే భోజనంలో టమాటోలను సలాడ్‌ గా పచ్చిగా తింటాం లేదా కూరల్లో పులుపు, గ్రేవీకి చిక్కదనం తీసుకురావడానికి వాడుతాం. ఇంకా చెప్పాలంటే ఘాటైన టొమాటో పచ్చడి లేనిదే చాలామందికి ముద్ద దిగదు. అయితే టొమాటోలను కేవలం ఇతర కూరల్లో సహాయకారిగా మాత్రమే కాకుండా, వాటినే ప్రధాన వంటకంగా చేసే స్టఫ్డ్ టమాటో కర్రీ (మసాలా నింపిన టొమాటో కూర) ఎప్పుడైనా రుచి చూశారా?

Quick and Easy Restaurant Style Stuffed Tomato Curry Recipe in Telugu

ఈ స్టఫ్డ్ టమాటో కర్రీ రుచికి రుచి, అలాగే సమయాన్ని కూడా చాలా ఆదా చేస్తుంది. టమాటోలు చాలా త్వరగా ఉడికిపోతాయి కాబట్టి, గంటల తరబడి వంటగదిలో శ్రమించాల్సిన అవసరం ఉండదు. కేవలం లోపల పెట్టే స్టఫింగ్ (మసాలా మిశ్రమం) సిద్ధం చేసుకుని, టొమాటోలలో కూరి ఉడికిస్తే చాలు.. గుమగుమలాడే కూర మీ డైనింగ్ టేబుల్ పైకి వచ్చేస్తుంది.

స్టఫ్డ్ టమాటో కర్రీ తయారీకి కావలసిన పదార్థాలు

మీడియం సైజు టమాటోలు
పల్లీలు- పావు కప్పు
తెల్ల నువ్వులు - 1 టేబుల్ స్పూన్
సేవ్ (లావుపాటి కారప్పూస)- పావు కప్పు
వెల్లుల్లి రెబ్బలు - 5
పసుపు - 1 టీస్పూన్
కారం పొడి - 1 టేబుల్ స్పూన్
ధనియాల పొడి - 1 టేబుల్ స్పూన్
గరం మసాలా - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - తాలింపు కొరకు
జీలకర్ర - 1 టీస్పూన్
సన్నగా తరిగిన తాజా కొత్తిమీర

స్టఫ్డ్ టమాటో కర్రీ తయారీ విధానం

-ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని మంటను సిమ్‌లో ఉంచి వేరుశెనగ గుళ్లను పచ్చివాసన పోయేలా దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని, అందులో ముందుగా వేయించిన పల్లీలు, తెల్ల నువ్వులు, వెల్లుల్లి రెబ్బలు, సేవ్ వేసి బరకగా గ్రైండ్ చేసుకోండి.

-ఒక గిన్నెలో మనం గ్రైండ్ చేసుకున్న పొడిని తీసుకోండి. దానికి పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, తరిగిన కొత్తిమీర వేసి బాగా కలుపుకోండి. ఇదే మన టమాటోల లోపల నింపే అసలైన మసాలా.

-ఇప్పుడు తాజా టమాటోలను కడిగి, పొడిగా తుడవండి. ఇప్పుడు ప్రతి టమాటోను పైభాగం నుండి నాలుగు భాగాలుగా కోయండి. కానీ ముక్కలు విడిపోకుండా అడుగు భాగం కలిసే ఉండేలా చూసుకోండి.

-సిద్ధం చేసుకున్న స్టఫింగ్ మసాలాను ప్రతి టమాటో లోపల జాగ్రత్తగా నింపండి.

-ఇప్పుడు పాన్‌ లో కొద్దిగా నూనె వేడి చేసి, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వండి. ఆ తర్వాత మసాలా కూరిన టమాటోలను ఒక్కొక్కటిగా పాన్‌ లో నెమ్మదిగా పేర్చండి. మూత పెట్టి సన్నని మంట మీద 4-5 నిమిషాల పాటు ఉడికించండి. మిగిలిన స్టఫింగ్ మసాలా ఏమైనా ఉంటే దానిని కూడా టమాటోల చుట్టూ వేయండి.

-చివరగా అర కప్పు వేడి నీళ్లను కూరలో పోసి మళ్లీ మూతపెట్టండి. మరో 4-5 నిమిషాలు ఉడికించండి. నూనె పైకి తేలి, టమాటోలు మెత్తబడగానే స్టవ్ ఆపేయండి.

-అంతే గుమగుమలాడే వేడివేడి స్టఫ్డ్ టమాటో కర్రీ రెడీ. దీనిని వేడి వేడి చపాతీ, పరాఠా, రోటీ లేదా అన్నంతో వడ్డించండి. పల్లీలు, నువ్వుల కమ్మదనం, టమాటోల పులుపు కలగలిసి ఈ కూర మీ నోటికి పండుగలా అనిపిస్తుంది.

[ of 5 - Users]
Story first published: Thursday, April 23, 2026, 8:06 [IST]
Desktop Bottom Promotion