నోరూరించే వెజ్ హలీం..హైదరాబాద్ పిస్తా హౌస్ టేస్ట్ గ్యారెంటీ!..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..

Posted By:

రంజాన్ మాసం అనగానే పవిత్ర ఉపవాసాలతో పాటు మనకు ముందుగా గుర్తొచ్చేది హలీం. అందులోనూ హైదరాబాద్ అనగానే పిస్తా హౌస్ హలీంకి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. రోజంతా ఉపవాసం ఉన్న తర్వాత సాయంత్రం ఇఫ్తార్ సమయంలో హలీం తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి వస్తుంది.

సాధారణంగా హలీంను మటన్ లేదా చికెన్ తో తయారు చేస్తారు. కానీ శాకాహారుల కోసం, అచ్చం పిస్తా హౌస్ మటన్ హలీం రుచితో, అదే టెక్స్చర్ తో ఇంట్లోనే వెజ్ హలీం ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Ramzan Special Make Pista House Style Veg Haleem at Home Recipe in Telugu

కావాల్సిన పదార్థాలు
-గోధుమ రవ్వ
-బార్లీ గింజలు
-పచ్చి శనగ పప్పు
-మినప పప్పు
-పెసర పప్పు
-ఎర్ర కందిపప్పు
-బాస్మతి బియ్యం
-రాతి పువ్వు
-జాజికాయ
-జాపత్రి
-నువ్వులు
-సోయా చంక్స్ (మీల్ మేకర్)
-ఫ్రైడ్ ఆనియన్స్
-అల్లం వెల్లుల్లి పేస్ట్
-పుదీనా ఆకులు
-కొత్తిమీర
-గట్టి పెరుగు
-స్వచ్ఛమైన నెయ్యి
-నూనె
-లవంగాలు
-యాలకులు
-దాల్చిన చెక్క
-షాజీరా
-మిరియాలు
-ధనియాలు
-ఎండిన గులాబీ రేకులు
-పసుపు
-కారం
-ఉప్పు
-జీడిపప్పు
-బాదం పప్పు
-నిమ్మకాయ ముక్కలు

Ramzan Special Make Pista House Style Veg Haleem at Home Recipe in Telugu

తయారీ విధానం

-ముందుగా పప్పులను నానబెట్టుకోండి. ఇందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో అర కప్పు గోధుమ రవ్వ, 1 టేబుల్ స్పూన్ బార్లీ గింజలు, 1 టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పు, 2 టేబుల్ స్పూన్ల బాస్మతి బియ్యం, 1 టేబుల్ స్పూన్ పచ్చి శెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ పెసర పప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 6 బాదం పప్పులు, 10 జీడిపప్పు పలుకులు వేసి నీళ్లు మొత్తాన్ని శుభ్రంగా రెండుసార్లు కడిగాక అందులో పప్పులన్నీ మునిగేంత నీళ్లు పోసి కనీసం 2 గంటలు నానబెట్టుకోవాలి.

-ఇప్పుడు మరో బౌల్ తీసుకొని అందులో ఒకటిన్నర కప్పు(75 గ్రా) మిల్ మేకర్ వేసి,ఇందులోనే వేడి నీళ్లు పోసి 2 నిమిషాలు నాననివ్వాలి. తర్వాత నీళ్లు వంపేసి మళ్లీ చల్ల నీళ్లు పోసి 1 నిమిషం ఉంచి తర్వాత చేతితో మిల్ మేకర్ ను నీళ్లు అన్నీ పోయేట్టుగా చేత్తో గట్టిగా పిండేసి పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు మిక్సీ గిన్నెలో నీరు పిండేసిన మిల్ మేకర్ వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రాన్యుయల్స్ గా ఉండాలి. దీనిని తీసి పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు హలీం కోసం కావాల్సిన స్పెషల్ మసాలా రెడీ చేసుకోవాలి. ఇందుకోసం మిక్సీ గిన్నెలో 2 టీస్పూన్ల మిరియాలు, అర టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ షాజీరా, 3 యాలకలు, 4 లవంగ మొగ్గలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1టేబుల్ స్పూన్ ఎండిన గులాబీ రెక్కలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టీస్పూన్ ధనియాలు, చిన్న ముక్క రాతిపువ్వు, చిన్న జాజికాయ ముక్క, చిన్న ముక్క జాపత్రి వేసి మొత్తాన్ని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకొని ఈ మసాలా పొడిని తీసి పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు 2 గంటల పాటు నానిన పప్పులన్నింటినీ ఉడికించుకోవాలి. ఇందుకోసం కుక్కర్ లో నానబెట్టినవన్నీ నీటితో సహా వేసి మరో 2కప్పుల నీళ్లు, 1 టీస్పూన్ ఉప్పు, అర టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ ఆయిల్ కూడా వేసి మూతపెట్టి మీడియం మంట మీద కనీసం 4 నుంచి 6 విజిల్స్ వచ్చేంతవరకు మెత్తగా ఉడికించేయాలి.

-ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి మెత్తగా ఉడికించుకున్న పప్పుని మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు అడుగు మందంగా,లోతుగా ఉండే గిన్నెను స్టవ్ మీద పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేశాక ఇందులో సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయల తరుగు వేసి వేయించాక ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించాలి.ఇప్పుడు అందులోనే అరకప్పు ఫ్రైడ్ ఆనియన్స్ వేసి వేయించాక 1 గరిట పెరుగు, 2 టేబుల్ స్పూన్ల పుదీనా తరుగు, 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు వేసి 1 నిమిషం వేయించాలి.

-ఇప్పుడు అందులో గ్రైండ్ చేసి ఉంచుకున్న సోయా గ్రాన్యుయెల్స్ వేసి పచ్చి వాసన పోయేంతవరకు నూనెలో బాగా వేయించాలి. 5-10 నిమిషాలు మీడియం మంట మీద వేయించాక అందులో రుచికి సరిపడా ఉప్పు, ఒకటిన్నర టీస్పూన్ కారం, గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న మసాలా పొడి మొత్తాన్ని కూడా వేసి మరో 2 నిమిషాలు వేయించాలి.

-ఇప్పుడు అందులో మిక్సీలో వేసి మెత్తగా చేసుకున్న పప్పుల మిశ్రమం కూడా వేసి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇందులోనే 1 కప్పు నీళ్లు కూడా పోసి 20-25 నిమిషాల పాటు మీడియం మంట మీద పప్పు గుత్తితో ఎనుపుతూ బాగా రోస్ట్ చేయాలి.మధ్య మధ్యలో అందులో కొంచెం నెయ్యి కూడా వేసుకోండి.10 నిమిషాల తర్వాత అందులో కాచి చల్లార్చిన ముప్పావు కప్పు పాలు కూడా వేసి కలుపుతూ ఉడికించండి.

-ఆయిల్ పైకి తేలుతున్నట్లయితే హలీమ్ రెడీ అయినట్లే. స్టవ్ ఆపేయండి. వేడి హలీమ్ ని ఒక బౌల్ లోకి తీసుకొని అందులో ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర తరుగు, నెయ్యిలో వేయించిన జీడిపప్పు చల్లుకొని తింటుంటే స్వర్గమే.

[ of 5 - Users]
Story first published: Thursday, February 26, 2026, 18:05 [IST]
Desktop Bottom Promotion