నోరూరించే పనీర్ కొబ్బరి మసాలా..మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు

Posted By:

చపాతీ, నాన్, బిర్యానీ, పులావ్.. ఇలా దేనిలోకైనా పనీర్ కాంబినేషన్ అదిరిపోతుంది. అయితే రెస్టారెంట్ కి వెళ్లినా, ఇంట్లో వండినా తరచుగా పనీర్ బటర్ మసాలా, కడాయ్ పనీర్, లేదా పనీర్ భుర్జీనే ఎక్కువగా చేస్తుంటాం. ఎప్పుడూ ఒకే రకమైన రుచులు తిని మీకు బోర్ కొట్టిందా? మీ నాలుకకు కొత్త రుచిని పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే ఈ స్పైసీ పనీర్ కొబ్బరి మసాలా ఓసారి ట్రై చేసి చూడండి. మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు. పనీర్ కొబ్బరి మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

కావలసిన ప్రధాన పదార్థాలు

పనీర్ - 200 గ్రాములు
పెద్ద ఉల్లిపాయలు - 2
కరివేపాకు - కొద్దిగా
పసుపు - పావు టీస్పూన్
కసూరి మేతి - 1 టీస్పూన్
పచ్చిమిర్చి - 1
కాశ్మీరీ కారం పొడి - 1 టీస్పూన్
నెయ్యి - 1 టీస్పూన్
నూనె - 1 టీస్పూన్
కొత్తిమీర - కొద్దిగా

మసాలా పేస్ట్ కోసం:

కరివేపాకు - ఒక గుప్పెడు
పచ్చి కొబ్బరి తురుము - పావు కప్పు
మిరియాల పొడి - అర టీస్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టీస్పూన్లు
ధనియాల పొడి - 1 టీస్పూన్
జీలకర్ర పొడి - అర టీస్పూన్
లవంగాలు - 2
దాల్చిన చెక్క - అర అంగుళం ముక్క

Spicy Paneer Coconut Masala Recipe in Telugu Best Side Dish for Chapati Naan

తయారీ విధానం

-ముందుగా పనీర్‌ ను మీకు నచ్చిన సైజులో చిన్న క్యూబ్స్‌ లా కట్ చేసి పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కరివేపాకు, కొబ్బరి తురుము, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, లవంగాలు, దాల్చిన చెక్క వేయండి. కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌ లా రుబ్బుకోవాలి.

-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి నూనె, నెయ్యి వేసి వేడి చేయండి. అందులో కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించండి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి చిటికెడు ఉప్పు చల్లండి.

-ఉల్లిపాయలు బంగారు వర్ణంలోకి మారాక, ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేయండి. దానితో పాటే పసుపు, కాశ్మీరీ కారం కూడా వేసి బాగా కలపండి.

ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి

-మంటను మీడియంలో ఉంచి, మసాలాలోని పచ్చివాసన పోయేంత వరకు ఓపిగ్గా వేయించండి.

-మసాలా చక్కగా వేగి ఘుమఘుమలాడుతున్నప్పుడు, కసూరి మేతిని చేతిలో నలిపి వేయండి. ఆ వెంటనే కట్ చేసుకున్న పనీర్ ముక్కలు వేసి, గ్రేవీకి తగినన్ని నీళ్లు పోసి సున్నితంగా కలపండి.

-ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు సరిచూసుకుని, మూత పెట్టి సరిగ్గా 10 నిమిషాల పాటు మీడియం మంట మీద ఉడకనివ్వండి. పనీర్ ముక్కలకి మసాలా పట్టి గ్రేవీ చిక్కబడుతుంది.

-చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేస్తే చాలు.. వేడివేడి, ఘుమఘుమలాడే స్పైసీ పనీర్ కొబ్బరి మసాలా రెడీ.

[ of 5 - Users]
Story first published: Thursday, October 22, 2026, 20:41 [IST]
Desktop Bottom Promotion