ఇడ్లీ, దోశలోకి అదిరిపోయే కాంబినేషన్.. తీపి, పులుపు, కారంతో నోరూరించే మంగళూరు చట్నీ

Posted By:

ఇడ్లీ, దోశ, వడ లేదా ఊతప్పం ఇలా అల్పాహారం ఏదైనా సరే అందులోకి పల్లీ చట్నీయో లేదా కొబ్బరి చట్నీ చేయడం సర్వసాధారణం. అయితే రోజు విడిచి రోజు ఒకే రకమైన చట్నీ తిని తిని మీకు విసుగు పుట్టిందా? అయితే మీరు ఖచ్చితంగా మంగళూరు స్టైల్ కొబ్బరి చట్నీని ప్రయత్నించాల్సిందే.

దీనిని మంగళూరులో సిద్దారణ కొజ్జు అని పిలుస్తారు. సాధారణ చట్నీలా కాకుండా ఇది తీపి, పులుపు, కారం, ఉప్పు కలగలిసిన అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది. దీనికి అదనంగా చేర్చే వేరుశెనగలు, జీడిపప్పు, చట్నీని తింటున్నప్పుడు పంటి కింద తగులుతూ భలే రుచిని ఇస్తాయి. సిద్దారణ కొజ్జు ఎలా చేయాలో ఇక్కడ చూడండి.

Sweet Sour and Spicy The Ultimate Mangalore Coconut Chutney Recipe for Your Breakfast

కావలసిన పదార్థాలు
తురిమిన పచ్చి కొబ్బరి - అర కప్పు
ఎండు మిరపకాయలు - 4
ఆవాలు - పావు టీస్పూన్
బెల్లం - చిన్న నిమ్మకాయ సైజు
చింతపండు - చిన్న ఉసిరికాయంత
ఉప్పు - రుచికి సరిపడా
కొబ్బరి నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - అర టీస్పూన్
మినపప్పు - 1 టీస్పూన్
వేరుశెనగ గుళ్లు - 2 టేబుల్ స్పూన్లు
జీడిపప్పు - 1 టేబుల్ స్పూన్
ఎండు మిర్చి - 1
కరివేపాకు - 1 రెమ్మ
పసుపు - పావు టీస్పూన్

తయారీ విధానం

-ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో తురిమిన పచ్చి కొబ్బరి, 4 ఎండు మిరపకాయలు, పావు చెంచా పచ్చి ఆవాలు వేయాలి. దీనికి కొద్దిగా నీరు జతచేసి మరీ మెత్తగా కాకుండా, కొంచెం బరకగా ఉండేలా పేస్ట్‌ లా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీలి పెట్టి అందులో 2 స్పూన్ల కొబ్బరి నూనె వేడి చేయండి (కొబ్బరి నూనె వాడితేనే దీనికి అసలైన మంగళూరు రుచి వస్తుంది). నూనె వేడయ్యాక ఆవాలు, ఎండుమిర్చి వేసి చిటపటలాడించలి.

-ఇప్పుడు అందులో మినపప్పు,పల్లీలు, జీడిపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. పల్లీలు, జీడిపప్పు బంగారు రంగులోకి మారి కరకరలాడే వరకు వేయించాలి. చివరగా కరివేపాకు, పసుపు వేసి ఒకసారి కలిపి స్టవ్ మంటను తగ్గించాలి.

-తాలింపు సిద్ధమయ్యాక ముందుగా రుబ్బి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని బాండీలో వేయాలి. వెంటనే దీనికి చింతపండు రసం, బెల్లం తురుము, రుచికి సరిపడా ఉప్పు కలపాలి. అవసరమైతే కొద్దిగా నీరు పోసి చట్నీ మరీ గట్టిగా కాకుండా చూసుకోవాలి.

-ఈ మిశ్రమాన్ని బాగా కలిపి, సన్నని మంటపై సుమారు 2 నుండి 3 నిమిషాల పాటు మరిగించాలి. బెల్లం కరిగి, చట్నీలో బుడగలు వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి.

-అంతే ఎంతో రుచికరమైన ఘుమఘుమలాడే మంగళూరు స్పెషల్ సిద్దారణ కొజ్జు రెడీ. వేడి వేడి ఇడ్లీ, దోశ లేదా అన్నంలోకి కూడా ఇది అద్భుతమైన కాంబినేషన్.

[ of 5 - Users]
Story first published: Saturday, November 29, 2025, 11:21 [IST]
Desktop Bottom Promotion