ధురంధర్ సినిమాలో చూపెట్టిన ఫేమస్ దూద్ సోడా..ఇంట్లోనే చేసుకోండిలా

Posted By:

దూద్ సోడా అనేది భారతదేశం, పాకిస్తాన్ దేశాలలో, ముఖ్యంగా పంజాబ్ ప్రాంతంలో అత్యంత ప్రజాదరణ పొందిన సంప్రదాయ శీతల పానీయం. విభజన పూర్వపు పంజాబ్ (ప్రస్తుత భారత్, పాకిస్తాన్) ప్రాంతంలో ఉద్భవించిందని చరిత్రకారులు భావిస్తారు.

భారతదేశంలో బ్రిటిష్ పాలన ఉన్న సమయంలో సోడా మన దేశానికి పరిచయమైంది. అప్పటికే భారతీయులకు, ముఖ్యంగా పంజాబీలకు పాలు, లస్సీ తాగడం అలవాటు. బ్రిటిష్ వారి సోడాను, దేశీ పాలను కలిపి ఒక కొత్త రకమైన రుచిని సృష్టించే క్రమంలో దూద్ సోడా పుట్టిందని చెబుతారు. పాలు,సోడా కలయిక వినడానికి వింతగా అనిపించినా, రుచిలో మాత్రం ఇది అద్భుతంగా ఉంటుంది.

The Dhurandhar Effect How to Make the Trending Doodh Soda at Home

ఇటీవల విడుదలైన ధురంధర్ సినిమాతో ఈ డ్రింక్ మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ధురంధర్ సినిమాలో నటుడు గౌరవ్ గెరా పాకిస్తాన్‌ లోని కరాచీలోని లియారి ప్రాంతంలో జ్యూస్ షాపు నడుపుతున్న మొహమ్మద్ ఆలం అనే వ్యక్తిగా పరిచయం చేయబడ్డాడు. ఓ సీన్ లో జ్యూస్ షాపులో నిలబడి దూద్ సోడా దూద్ సోడా అని అతడు పలికే విధానంతో ఈ డ్రింక్ ఇప్పుడు తెరపైకి వచ్చింది. దూద్ సోడా మీ ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

దూద్ సోడా తయారీకి కావలసిన పదార్థాలు

కాచి చల్లార్చిన పాలు: 1 కప్పు
ప్లేన్ సోడా: 1 కప్పు
చక్కెర: 2-3 టేబుల్ స్పూన్లు
ఐస్ క్యూబ్స్: 4-5 ముక్కలు
రోజ్ సిరప్: 2 స్పూన్లు
సబ్జా గింజలు: 1 స్పూన్

తయారీ విధానం

ముందుగా పాలను కాచి, చల్లార్చి ఫ్రిజ్‌లో పెట్టండి. పాలు చిక్కగా ఉంటే రుచి బాగుంటుంది. పాలు ఎంత చల్లగా ఉంటే, సోడా కలిపినప్పుడు విరిగిపోయే అవకాశం అంత తక్కువగా ఉంటుంది.

ఒక పెద్ద గ్లాస్ లేదా జగ్ తీసుకొని అందులో పాలు పోయండి. అందులో చక్కెర వేసి, అది పూర్తిగా కరిగే వరకు బాగా కలపండి. మీరు రోజ్ సిరప్ వాడుతుంటే, చక్కెర తగ్గించి వేసుకోండి.

మీకు రోజ్ ఫ్లేవర్ ఇష్టమైతే, ఈ దశలో రూహఫ్జాను పాలల్లో కలపండి. ఇది పాలకు మంచి పింక్ రంగును, సువాసనను ఇస్తుంది. అలాగే నానబెట్టిన సబ్జా గింజలను కూడా వేసుకోవచ్చు.

ఇప్పుడు గ్లాస్‌ లో ఉన్న పాల మిశ్రమంలో ఐస్ క్యూబ్స్ వేయండి. తర్వాత, నెమ్మదిగా ప్లేన్ సోడాను గ్లాస్ అంచు వెంబడి పోయండి.

సోడా పోసిన వెంటనే నురగ వస్తుంది. ఒకసారి స్పూన్‌ తో కింద నుండి పైకి మెల్లగా కలపండి. వెంటనే చల్లగా సర్వ్ చేయండి.

తీపి ఇష్టం లేని వారు, చక్కెర బదులు కొద్దిగా ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, నల్ల ఉప్పు వేసుకొని తాగుతారు. ఇది జీర్ణక్రియకు చాలా మంచిది.

[ of 5 - Users]
Story first published: Thursday, December 25, 2025, 13:59 [IST]
Desktop Bottom Promotion