ఇడ్లీ, దోశల్లోకి ఈ చట్నీ టేస్ట్ వేరే లెవల్.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగిస్తారు!

Posted By:

ఇడ్లీ, దోశ, వడ వంటి బ్రేక్‌ ఫాస్ట్‌ లు ఏవైనా సరే పక్కన మంచి చట్నీ ఉంటేనే ఆ రుచి సంపూర్ణమవుతుంది. సాధారణంగా మన ఇళ్లలో పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ లేదా అల్లం చట్నీ చేస్తుంటాం. ఎప్పుడూ ఒకే రకమైన చట్నీలు తిని బోర్ కొట్టిందా? అయితే ఈసారి కొంచెం కొత్త స్టైల్ లో టమోటా కొత్తిమీర చట్నీ ట్రై చేయండి

సాధారణంగా కొత్తిమీరతో గ్రీన్ చట్నీ చేస్తారు. కానీ దానికి టమోటాలను జోడించి, కొంచెం బెల్లం, కొంచెం చింతపండు తగిలిస్తే..ఆ రుచి వేరే లెవల్ లో ఉంటుంది. రోజు తినేవాటికంటే మరో రెండు ఇడ్లీలు ఎక్కువే లాగిస్తారు. టమోటా కొత్తిమీర చట్నీ ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
పండిన టమోటాలు: 6
కొత్తిమీర: పావు కప్పు
ఎండు మిరపకాయలు: 3
పచ్చిమిరపకాయలు: 2
చింతపండు గుజ్జు: పావు టీస్పూన్
పసుపు: పావు టీస్పూన్
బెల్లం తురుము: 1 టీస్పూన్
నూనె: 1 టీస్పూన్ (వేయించడానికి)
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 2 టీస్పూన్లు
ఆవాలు: అర టీస్పూన్
జీలకర్ర: పావు టీస్పూన్
ఎండు మిరపకాయ: 1
కరివేపాకు: 1 రెమ్మ

తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకోండి. అందులో ఒక టీస్పూన్ నూనె వేసి వేడి చేయండి. నూనె కాగాక 3 ఎండు మిరపకాయలు వేసి ఒక నిమిషం పాటు దోరగా వేయించండి.

-ఇప్పుడు ముక్కలుగా కోసి పెట్టుకున్న 6 టమోటాలు, 2 పచ్చిమిరపకాయ ముక్కలను పాన్ లో వేయండి. వీటిని కాసేపు నూనెలో మగ్గనివ్వాలి.

-ఇందులోనే పావు టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి మూత పెట్టి సుమారు 7 నుండి 8 నిమిషాల పాటు ఉడికించాలి. టమోటాలు మెత్తగా అయ్యి, దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. టమోటాలు బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.

-ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోకి చల్లారిన టమోటా మిశ్రమాన్ని, 1 టీస్పూన్ బెల్లం పొడి, పావు టీస్పూన్ చింతపండు గుజ్జు, పావు కప్పు కొత్తిమీర వేసి మెత్తగా పేస్ట్ లా అయ్యేవరకు గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకోండి.

-ఇప్పుడు తాలింపు కోసం ఒక చిన్న పాన్ లో 2 టీస్పూన్ల నూనె వేడి చేయండి. అందులో ఎండు మిరపకాయ, ఆవాలు, జీలకర్ర వేయండి. ఆవాలు చిటపటలాడాక, ఒక రెమ్మ తాజా కరివేపాకు వేసి, వెంటనే స్టవ్ ఆపి, ఆ పోపును చట్నీలో వేసి బాగా కలపండి.

-అంతే ఎంతో రుచికరమైన, ఘుమఘుమలాడే టమోటా కొత్తిమీర చట్నీ రెడీ. వేడి వేడి ఇడ్లీలు, క్రిస్పీ దోశలు, లేదా ఊతప్పంలోకి ఈ చట్నీ నంజుకుని తింటే ఆ రుచి అమోఘం.

-ఈ చట్నీని గాలి చొరబడని డబ్బాలో వేసి ఫ్రిజ్ లో పెడితే ఒక వారం రోజుల పాటు తాజాగా ఉంటుంది. బ్యాచిలర్స్ కి, ఉద్యోగస్తులకు ఇది చాలా ఉపయోగపడుతుంది.

[ of 5 - Users]
Story first published: Monday, December 29, 2025, 11:19 [IST]
Desktop Bottom Promotion