రెస్టారెంట్ స్టైల్ ట్రిపుల్ షెజ్వాన్ చికెన్ ఫ్రైడ్ రైస్..ఇంట్లోనే ఈజీగా..

Posted By:

వీకెండ్ వచ్చిందంటే చాలు, మనందరికీ ఏదైనా స్పెషల్‌ గా, స్పైసీగా తినాలనిపిస్తుంది. రెస్టారెంట్‌ కి వెళ్లినప్పుడల్లా మెనూ చూడగానే ముందుగా గుర్తొచ్చే చైనీస్ వంటకం ట్రిపుల్ షెజ్వాన్ చికెన్ ఫ్రైడ్ రైస్. కారం కారంగా ఉండే షెజ్వాన్ సాస్, క్రిస్పీగా వేయించిన చికెన్ ముక్కలు, వేడివేడి అన్నం, నూడుల్స్... ఇవన్నీ కలిస్తే వచ్చే ఆ అద్భుతమైన రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అయితే ఈ రెస్టారెంట్ స్టైల్ డిష్‌ను ఇకపై బయట తినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన వంటగదిలోనే చాలా సులభంగా, మరింత రుచిగా, శుభ్రంగా దీనిని తయారు చేసుకోవచ్చు.

Weekend Special Make Restaurant-Style Triple Schezwan Chicken Fried Rice at Home Recipe in Telugu

ట్రిపుల్ షెజ్వాన్ చికెన్ ఫ్రైడ్ రైస్ తయారీకి కావాల్సినవి

రెడ్ చిల్లీ పేస్ట్ కోసం

కాశ్మీరీ ఎండుమిర్చి-20
నీళ్లు - తగినన్ని
నూనె - 1/3 కప్పు
ఉప్పు - చిటికెడు
వెనిగర్ - 1 టేబుల్ స్పూన్

ఫ్రైడ్ చికెన్ కి కావాల్సినవి

చికెన్ బ్రెస్ట్ - 350 గ్రాములు
ఉప్పు - రుచికి తగినంత
మిరియాల పొడి - చిటికెడు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టీస్పూన్లు
లైట్ సోయా సాస్ - 1 టీస్పూన్
హోమ్‌ మేడ్ రెడ్ చిల్లీ పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
గుడ్డు తెల్లసొన - 1
కార్న్ ఫ్లోర్ - 3 టేబుల్ స్పూన్లు

షెజ్వాన్ రైస్ కి కావాల్సినవి

నూనె - 2 టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి - 2 టేబుల్ స్పూన్లు
ఉల్లికాడలు (Spring Onion) - కొద్దిగా
క్యాబేజీ తరుగు - 1/3 కప్పు
క్యారెట్ తరుగు - 1/3 కప్పు
ఫ్రెంచ్ బీన్స్ తరుగు - 1/3 కప్పు
గుడ్డు - 1
వండిన బాస్మతి అన్నం - 4 కప్పులు
ఉడికించిన నూడుల్స్ - 100 గ్రా
లైట్ సోయా సాస్ - 1 టీస్పూన్
వెనిగర్ - 1 టీస్పూన్
టొమాటో కెచప్ - 1 టీస్పూన్
పచ్చిమిర్చి పేస్ట్ - 1 పచ్చిమిర్చితో చేసినది
రెడ్ చిల్లీ పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
చక్కెర - చిటికెడు
వైట్ పెప్పర్ పౌడర్ - చిటికెడు
ఉల్లికాడల ఆకులు - గార్నిష్ కోసం

ట్రిపుల్ షెజ్వాన్ చికెన్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం

-నానబెట్టిన ఎండుమిర్చిని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్‌ లా రుబ్బుకోవాలి.

-ఒక పాన్‌ లో నూనె వేడిచేసి ఎండుమిర్చి పేస్ట్‌, ఉప్పు, వెనిగర్ వేసి నూనె పైకి తేలేవరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇదే అసలైన షెజ్వాన్ ఫ్లేవర్.

-తర్వాత చికెన్ ముక్కలకు ఉప్పు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సోయా సాస్, తయారుచేసిన రెడ్ చిల్లీ పేస్ట్ వేసి కలపాలి. చివరగా గుడ్డు తెల్లసొన, కార్న్ ఫ్లోర్ వేసి బాగా పట్టించాలి. ఈ ముక్కలను వేడి నూనెలో ఎర్రగా, క్రిస్పీగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి.

-తర్వాత ఒక పెద్ద వెడల్పాటి పాన్ లేదా కడాయిలో నూనె వేడి చేయాలి. అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి, ఉల్లికాడలు వేసి వేయించాలి. తర్వాత అందులో క్యాబేజీ, క్యారెట్, ఫ్రెంచ్ బీన్స్ ముక్కలు వేసి మంటను హై ఫ్లేమ్‌ లో ఉంచి ఒక నిమిషం పాటు వేయించాలి.

-ఇప్పుడు కూరగాయలను పాన్‌ లో ఒక పక్కకు జరిపి, ఖాళీగా ఉన్న చోట గుడ్డు పగలగొట్టి వేసి పొరుటులా చేయాలి. ఇందులోనే వండిన బాస్మతి అన్నం, ఉడికించిన నూడుల్స్ వేయాలి. ఆ తర్వాత సోయా సాస్, వెనిగర్, టొమాటో కెచప్, పచ్చిమిర్చి పేస్ట్, రెడ్ చిల్లీ పేస్ట్, చక్కెర, వైట్ పెప్పర్ పౌడర్, సరిపడా ఉప్పు వేసి అన్నం విరగకుండా అన్నీ బాగా కలిసేలా పెద్ద మంటపై టాస్ చేయాలి.

-చివరగా మనం ముందుగా వేయించి పెట్టుకున్న క్రిస్పీ చికెన్ ముక్కలను, తాజా ఉల్లికాడల ఆకులను చల్లి ఒకసారి కలిపి స్టవ్ కట్టేయాలి.

-అంతే ఘుమఘుమలాడే వేడి వేడి చికెన్ ట్రిపుల్ షెజ్వాన్ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ.

[ of 5 - Users]
Story first published: Saturday, May 23, 2026, 17:42 [IST]
Desktop Bottom Promotion