మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తున్నారో లేదో తెలుసుకోడానికి 5 ఈజీ మార్గాలు

ఏ బంధానికి అయినా అత్యంత ముఖ్యమైనది నమ్మకం. ప్రేమ, పెళ్లి వంటి సున్నితమైన సంబంధాలకైతే అది పునాది రాయి లాంటిది. అయితే భాగస్వాముల్లో ఎవరైనా ఒకరు నమ్మకాన్ని వమ్ము చేస్తే ఆ గాయం గుండెను ముక్కలు చేస్తుంది. అది కేవలం మనసును గాయపరచడమే కాకుండా కొన్నిసార్లు జీవితాలను నాశనం చేసే నేరాలకు కూడా దారితీస్తుంది. ప్రస్తుత ప్రపంచంలో ఇలాంటి సంఘటనలు సర్వసాధారణమైపోయాయి. అయితే దీని అర్థం మీరు మీ భాగస్వామిపై అనుమానంతో గూఢచారిలా మారాలని కాదు. అనవసరమైన అనుమానం ఆరోగ్యంగా ఉన్న బంధాన్ని కూడా నాశనం చేస్తుంది. కానీ అదే సమయంలో గుడ్డిగా నమ్మేసి మోసపోవడం కూడా సరికాదు. కాబట్టి అనుమానించకుండా అప్రమత్తంగా ఉండటం ముఖ్యం.

మీ బంధంలో మీ భాగస్వామి నిజాయితీగా ఉన్నారా లేదా వారి ప్రవర్తనలో ఏవైనా తేడాలు కనిపిస్తున్నాయా అని పసిగట్టగలిగే కొన్ని కీలకమైన సంకేతాలు ఉంటాయి. ఈ సంకేతాలను ముందుగానే గుర్తించడం వల్ల, అపార్థాలను తొలగించుకొని బంధాన్ని నిలబెట్టుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది. ఒకవేళ విడిపోవాల్సి వచ్చినా, మానసికంగా సిద్ధపడి, ధైర్యంగా నిర్ణయం తీసుకునేందుకు ఇది సహాయపడుతుంది. మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తున్నారేమోనని సూచించే ఆ సంకేతాలేమిటో వివరంగా చూద్దాం.

Don t be fooled easy ways to find out your partner cheating on you

ప్రవర్తనలో ఆకస్మిక మార్పు
భార్యాభర్తలు ఒకరి గురించి ఒకరికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. వారి ఇష్టాయిష్టాలు, అలవాట్లు, మాట్లాడే తీరు అన్నీ సుపరిచితమే. అలాంటిది మీ భాగస్వామి ప్రవర్తనలో హఠాత్తుగా మార్పు వస్తే దాన్ని సులభంగా గుర్తించవచ్చు. ఉదాహరణకు మీరు మామూలుగా అడిగిన ప్రశ్నలకు కూడా వారు తీవ్రంగా, రక్షణాత్మకంగా సమాధానం చెప్పడం మొదలుపెట్టవచ్చు. ఎక్కడికి వెళ్లావు? అని అడిగితే నన్ను అనుమానిస్తున్నావా? నాకంటూ స్వేచ్ఛ లేదా? అంటూ ఎదురుదాడికి దిగడం, ప్రతి చిన్న విషయానికీ తమను తాము సమర్థించుకోవడం వంటివి చేస్తుంటే వారి మనసులో ఏదో దాస్తున్నారని అర్థం. ఇది వారిలో పెరుగుతున్న అపరాధ భావానికి సంకేతం కావచ్చు.

మీ నుంచి దూరం జరగడం
ఒకప్పుడు మీతో గంటల తరబడి కబుర్లు చెప్పిన మీ భాగస్వామి ఇప్పుడు మిమ్మల్ని చూస్తేనే చిరాకు పడుతున్నారా? మీ నుంచి మానసికంగా, శారీరకంగా దూరం పాటిస్తున్నారా? అందరితో సంతోషంగా ఉంటూ,కేవలం మీ దగ్గరికొచ్చేసరికి మౌనంగా లేదా కోపంగా ఉంటున్నారా? శారీరక సాన్నిహిత్యానికి కూడా దూరంగా ఉంటున్నారా? ఇవన్నీ బంధంలో ప్రమాద ఘంటికలే. ఇద్దరి మధ్య ఒక కనిపించని గోడ నిర్మించబడుతోందని దీని అర్థం. ఈ దూరం వెనుక అసలు కారణం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించడం చాలా అవసరం. బంధంలో ఏదైనా సమస్య ఉందా లేక వారి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించారా అని ఆలోచించాలి.

ఫోన్‌ తో పెరిగిన గోప్యత
నేటి డిజిటల్ యుగంలో చాలా రహస్యాలు ఫోన్‌లోనే దాగి ఉంటాయి. మీరు వారి ఫోన్‌ ను చెక్ చేయాల్సిన అవసరం లేదు కానీ వారి ప్రవర్తనను గమనిస్తే చాలు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఫోన్‌ కు పాస్‌వర్డ్‌లు పెట్టడం, మీరు గదిలోకి రాగానే ఫోన్ స్క్రీన్‌ ను దాచిపెట్టడం,బాత్రూమ్‌ లోకి కూడా ఫోన్‌ ను తీసుకువెళ్లడం వంటివి చేస్తుంటే అనుమానించాల్సిందే. తరచుగా ఫోన్ పాస్‌ వర్డ్‌ లు మార్చడం, సోషల్ మీడియా అకౌంట్స్ మీ కంట పడకుండా జాగ్రత్త పడటం, ఆన్‌ లైన్ కార్యకలాపాల గురించి అడిగితే చెప్పకపోవడం వంటివి కూడా ముఖ్యమైన సంకేతాలే. అంతేకాకుండా వారు చూసే, షేర్ చేసే కంటెంట్‌ ను కూడా గమనించండి. విడిపోవడం, ఒంటరితనం, కొత్త ప్రేమ వంటి అంశాలపై ఉన్న రీల్స్, వీడియోలు, కథనాలను ఎక్కువగా చూస్తున్నా అది వారి మానసిక స్థితికి అద్దం పడుతుంది. ఇది వారు వేరొకరితో సంబంధంలో ఉన్నారనడానికి ఒక బలమైన సూచన కావచ్చు.

Take a Poll

మాటల్లోని మర్మం
మాటలు మనసులోని భావాలను ప్రతిబింబిస్తాయి. మీ భాగస్వామి సంభాషణలను గమనించండి. వారు హఠాత్తుగా ఒక కొత్త స్నేహితుడు లేదా సహోద్యోగి గురించి అతిగా మాట్లాడటం ప్రారంభించారా? ప్రతి విషయంలోనూ మిమ్మల్ని ఇతరులతో పోలుస్తూ మీలోని లోపాలను ఎత్తి చూపుతున్నారా? నీకంటే ఫలానా వాళ్ళు చాలా బెటర్ వంటి మాటలు అంటున్నారా? ఇవి మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి, మిమ్మల్ని మీరే తక్కువ చేసుకునేలా చేస్తాయి. అంతేకాకుండా మనం విడిపోతే బాగుంటుందేమో వంటి మాటలను తేలికగా అంటున్నారా? ఫోన్‌ లో ఎవరితో మాట్లాడుతున్నారని అడిగితే తడబడటం లేదా కోప్పడటం చేస్తున్నారా? గతంలో మనం అని మాట్లాడిన వ్యక్తి, ఇప్పుడు ప్రతిదానికీ నేను అని సంబోధిస్తున్నాడా? ఈ మార్పులు వారి ప్రాధాన్యతలు మారుతున్నాయని సూచిస్తాయి.

Don t be fooled easy ways to find out your partner cheating on you

జీవనశైలి, అలవాట్లలో మార్పు
చాలా కాలంగా కలిసి ఉంటున్నప్పుడు ఒకరి జీవనశైలి, ఆహారపు అలవాట్లు, అభిరుచులు మరొకరికి బాగా తెలుస్తాయి. అలాంటిది మీ భాగస్వామి అలవాట్లలో అకస్మాత్తుగా పెద్ద మార్పులు వస్తే దాని వెనుక కారణాన్ని అన్వేషించాలి.

అలంకరణపై శ్రద్ధ: ఉన్నట్టుండి తమ శరీరాకృతి, దుస్తులు, అలంకరణపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం. కొత్త రకం బట్టలు కొనడం, ఖరీదైన పెర్ఫ్యూమ్‌ లు వాడటం వంటివి మొదలుపెడితే వారు వేరొకరిని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారేమోనని భావించవచ్చు.

బయట గడపడం: మీకు చెప్పకుండా లేదా అబద్ధాలు చెప్పి గంటల తరబడి బయట గడపడం, ఆ సమయంలో ఫోన్ చేస్తే తీయకపోవడం లేదా స్విచ్ ఆఫ్ చేయడం. ఆఫీస్‌లో మీటింగ్, స్నేహితులతో బయటకు వెళ్తున్నా వంటి సాకులు ఎక్కువవుతాయి.

వివరణ లేని ఖర్చులు: క్రెడిట్ కార్డు బిల్లులో మీకు తెలియని ఖర్చులు కనిపించడం కూడా ఒక ముఖ్యమైన సంకేతం. పైన చెప్పిన సంకేతాలు మీ భాగస్వామిలో కనిపిస్తే వారు మిమ్మల్ని మోసం చేస్తున్నారని నిర్ధారణకు వచ్చేయకండి. ఇవి కేవలం సూచనలు మాత్రమే. కొన్నిసార్లు పని ఒత్తిడి, మానసిక ఆందోళన వల్ల కూడా ఇలాంటి మార్పులు రావచ్చు. కాబట్టి ఆవేశపడి నిందలు వేయకుండా, సరైన సమయంలో ప్రశాంతంగా కూర్చొని మాట్లాడండి. ఈ మధ్య నీ ప్రవర్తనలో తేడాగా ఉంది, మనం ఒకరికొకరం దూరమవుతున్నామని నాకు అనిపిస్తోంది, ఏదైనా సమస్యా? అని ప్రేమగా అడగండి. నిజాయితీతో కూడిన సంభాషణ చాలా సమస్యలను పరిష్కరించగలదు.

Story first published: Saturday, July 5, 2025, 22:00 [IST]
Desktop Bottom Promotion