ప్రేమకు లైసెన్స్ తప్పనిసరి!..ఇదేందయ్యా ఇది..

మనం ఎన్నో ద్వంద్వ ప్రమాణాలున్న సమాజంలో జీవిస్తున్నాం. వాటిలో అత్యంత విచిత్రమైనది, బాధాకరమైనది ప్రేమ విషయంలో మనం చూపే రెండు నాల్కల ధోరణి. పెళ్లికి ముందు ఓ జంట చేయి పట్టుకుని కనిపిస్తే చాలు, వారిని సిగ్గులేనివారిగా, బరితెగించిన వారిగా ముద్ర వేస్తారు. అదే జంటకు పెళ్లయ్యాక వారే ఆదర్శ దంపతులుగా, అన్యోన్య జంటగా కీర్తించబడతారు. నిన్నటి వరకు అవమానకరంగా కనిపించిన ప్రేమ, ఒక్కసారిగా గౌరవప్రదంగా ఎలా మారిపోతుంది? నిజంగా పెళ్లి అనే తంతు ప్రేమ స్వరూపాన్నే మార్చేస్తుందా? లేక ఇదంతా సమాజం ఆడుతున్న కపట నాటకమా?

అనుమతి అనే అడ్డుగోడ
నిజానికి సమాజానికి ప్రేమతో ఏ గొడవా లేదు. సమస్యల్లా ఆ ప్రేమ ఎవరి అనుమతితో పుట్టిందనేదే. చాలా సందర్భాల్లో ఇద్దరు వ్యక్తుల మధ్య స్వచ్ఛంగా పుట్టిన ప్రేమకు తల్లిదండ్రులు, బంధువులు, కులపెద్దల ఆమోదముద్ర ఉండదు. అందుకే అది తప్పుగా కన. కానీ అబడుతుంటది. అదే ప్రేమకు మంత్రాలు, తంతులతో పెళ్లి అనే సర్టిఫికేట్ జారీ అయిన వెంటనే ఆ బంధం పవిత్రమవుతుంది. ఇక్కడ ప్రేమలోని లోతు, నిజాయితీ కన్నా ఆ బంధానికి లభించిన సామాజిక అంగీకారానికే విలువ ఎక్కువ. ప్రేమకు సమాజం నుండి ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అవసరం అన్నట్లుంది పరిస్థితి.

Is Love a Crime Before Marriage Our Society s Strange Rules

ఆనందం కన్నా పరువే మిన్న
నలుగురూ ఏమనుకుంటారు? అనే ఒక్క ప్రశ్న మన సమాజంలో ఎన్నో సంతోషాలను ఎలా బలి తీసుకుంటుందో చెప్పడానికి ఇదే పెద్ద ఉదాహరణ. ఒక యువతీ యువకుడు తమకు నచ్చిన వారిని ఎంచుకుంటే అది కుటుంబ పరువుకు, గౌరవానికి భంగం కలిగించినట్లు భావిస్తారు. వారి ఆనందం కంటే కుటుంబ ప్రతిష్టకే పెద్దపీట వేస్తారు. అదే బంధానికి పెద్దలు అంగీకరించి పెళ్లి చేస్తే, అది కుటుంబ గౌరవానికి ప్రతీకగా మారుతుంది. దీన్నిబట్టి అర్థమవుతోంది ఏమిటంటే.. సమాజానికి కావాల్సింది ప్రేమ కాదు, దానిపై తమ నియంత్రణ.

పెళ్లే ప్రేమను పవిత్రం చేస్తుందా?
నిన్నటిదాకా తప్పుగా, మురికిగా కనిపించిన ప్రేమ, తాళి పడిన మరుక్షణమే అంత పవిత్రంగా ఎలా మారిపోతుంది? నిజానికి ప్రేమ అలాగే ఉంటుంది, దాని స్వరూపం మారదు. మారేది కేవలం సమాజం దాన్ని చూసే దృక్కోణం మాత్రమే. వివాహం అనేది ఆ బంధానికి చట్టబద్ధమైన, సామాజిక లైసెన్సు ఇస్తుంది. ఆ లైసెన్సు లేనంత వరకు ప్రేమ అక్రమం, వచ్చాక సక్రమం. ఇది ప్రేమను కాకుండా, కేవలం సామాజిక కట్టుబాట్లను గౌరవించడమే అవుతుంది.

Is Love a Crime Before Marriage Our Society s Strange Rules

ఆడపిల్ల విషయంలో కత్తికి రెండు వైపులా పదునే
ఈ ద్వంద్వ నీతి కత్తికి ఆడపిల్లల విషయంలో పదును ఇంకా ఎక్కువ. పెళ్లికి ముందు ఒక అమ్మాయి ప్రేమలో పడితే ఆమె నడవడికను, వ్యక్తిత్వాన్ని శంకిస్తారు. క్యారెక్టర్ లేనిది అని ముద్ర వేస్తారు. అదే అబ్బాయి అయితే చిన్నపిల్లాడు, పొరపాటు చేశాడు అని తేలిగ్గా కొట్టిపారేస్తారు. ఈ పితృస్వామ్య ఆలోచనా విధానం అమ్మాయిల స్వేచ్ఛను, ప్రేమను ఎప్పుడూ అనుమానంతోనే చూస్తుంది. పెళ్లి తర్వాత ప్రేమ అద్భుతంగా మారిపోదు. ప్రేమ అదే, చూసే సమాజపు కళ్లే మారతాయి. నియంత్రణ, పరువు, పితృస్వామ్యం అనే కళ్లద్దాలతో చూసినంత కాలం, స్వచ్ఛమైన ప్రేమ కూడా సమాజానికి తప్పుగానే కనిపిస్తుంది.

Story first published: Saturday, August 16, 2025, 7:45 [IST]
Desktop Bottom Promotion