మీ బంధం ఎంత బలమైనదో తెలుసుకోవడానికి..దేవుడు పెట్టే పరీక్షలు ఇవే

ప్రతి బంధం అందులోనూ ప్రేమ బంధం ఓ అందమైన ప్రయాణం లాంటిది. ఈ జర్నీలో పూలబాటలతో పాటు ముళ్ల దారులు కూడా ఉంటాయి. సుఖసంతోషాలతో పాటు కష్టాలు,సవాళ్లు కూడా ఎదురవుతాయి. తరుచుగా చాలామంది అనే ఒక మాట ఏంటంటే..మీ బంధం ఎంత బలమైనదో తెలుసుకోడానికి కొన్ని టెస్టులు పెడతాడని. ఈ పరీక్షలు ఆ బంధాన్ని విడదీయడానికి కాదు,మరింత బలపడటానికి. వీటిని తట్టుకుని నిలబడితే మీ బంధం శాశ్వతమని నమ్మవచ్చు.

కష్టాలను ఎదుర్కొన్న బంధం మరింత ప్రకాశవంతంగా వెలిగిపోతుందంటారు. అయితే మీ అనుబంధం ఎంత పవిత్రమైనదనేది, మీరు ఒకరినొకరు ఎంతగా ప్రేమిస్తున్నారో తెలుసుకోడానికి దేవుడు పెట్టే అగ్నిపరీక్షలు ఏంటనేవి రిలేషన్ షిప్ కోచ్ జయా శర్మ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలిపారు. ఆమె ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం.

Is Your Love Authentic Relationship Coach Shares 9 Divine Tests That Prove Your Bond is Forever

దూరం - కంటికి దూరమైనా మనసుకు దగ్గరగా
జాబ్, స్టడీ, లేదా మే ఇతర కారణాల వల్ల మనం ప్రేమించిన వారికి దూరంగా ఉండాల్సి రావచ్చు. ఈ దూరం బంధానికి మొదటి పరీక్ష. భౌతికంగా దూరంగా ఉన్నప్పటికీ టెక్నాలజీని వాడుకుంటూ మానసికంగా దగ్గరగా ఉండగలగాలి. ప్రతిరోజూ మాట్లాడుకోవడం, ఒకరి భావాలను ఒకరు పంచుకోవడం, నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ఈ టెస్ట్ లో గెలవడానికి మార్గాలు. కంటికి కనిపించకపోయినా, మీ ప్రేమ చెక్కుచెదరదని నిరూపించుకోవాల్సిన సమయం ఇది.

అపార్థాలు - వినడం నేర్చుకోవడం
ఎంత లవ్ ఉన్నా ఇద్దరు మనుషుల మధ్య అపార్థాలు రావడం సహజం. ఎదుటివారు చెప్పేది పూర్తిగా వినకుండా, మనకు తోచింది ఊహించుకోవడం వల్లే సమస్యలు మొదలవుతాయి. ఈ పరీక్ష సహనాన్ని, అర్థం చేసుకునే గుణాన్ని పరీక్షిస్తుంది. భాగస్వామి చెప్పేది శ్రద్ధగా వినడం, వారి కోణంలోంచి ఆలోచించడం నేర్చుకుంటే ఎలాంటి అపార్థానికైనా తావుండదు.

ప్రలోభాలు - విశ్వాసమే పునాది
లైఫ్ లో కొత్త వ్యక్తులు పరిచయం కావచ్చు, కొన్ని క్షణికమైన ఆకర్షణలు కలగవచ్చు. కానీ నిజమైన ప్రేమ ఉన్నచోట నిబద్ధతకే మొదటి స్థానం ఉంటుంది. మీ భాగస్వామికిచ్చిన మాటకు, మీ బంధానికి విలువనిచ్చి, ఎలాంటి ప్రలోభాలకైనా లొంగకుండా ఉండటమే అసలైన పరీక్ష. ప్రతిసారీ మీ ప్రేమను, మీ విశ్వాసాన్ని ఎంచుకోవడమే ఈ పరీక్షలో విజయం.

ఆర్థిక ఇబ్బందులు - కష్టకాలంలో తోడుండటం
మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు అందరూ మనతోనే ఉంటారు. కానీ మనం కష్టాల్లో ఉన్నప్పుడు,డబ్బు సమస్యలతో సతమతమవుతున్నప్పుడు చేయి పట్టి నడిపించేవారే మనవాళ్ళు. ఉద్యోగం కోల్పోవడం, వ్యాపారంలో నష్టం రావడం వంటివి బంధాన్ని తీవ్రంగా పరీక్షిస్తాయి. ఇలాంటి సమయంలో ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ఉన్నదాంతో సర్దుకుంటూ, కలిసికట్టుగా నిలబడగలిగితే మీ బంధం డబ్బు కంటే గొప్పదని నిరూపించుకున్నట్టే.

నమ్మక సమస్యలు - గతాన్ని వదిలి, వర్తమానంలో జీవించడం
గతంలో జరిగిన పొరపాట్లు, పాత సంబంధాల తాలూకు గాయాలు వర్తమాన బంధంపై ప్రభావం చూపుతాయి. అవి నమ్మకాన్ని దెబ్బతీస్తాయి. ఈ గాయాలను మాన్పుకోవడానికి ఇద్దరూ కలిసి ప్రయత్నించాలి. దాపరికం లేకుండా మాట్లాడటం, క్షమించడం, ఒకరికొకరు సమయం ఇవ్వడం ద్వారా నమ్మకాన్ని తిరిగి పెంపొందించుకోవచ్చు. ఇది బంధానికి పునరుజ్జీవనం లాంటిది.

కుటుంబ ఒత్తిడి - ప్రేమ, బాధ్యతల సమతుల్యం
ముఖ్యంగా మన సంస్కృతిలో కుటుంబ సభ్యుల అభిప్రాయాలు, అంచనాలు బంధాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ప్రేమించిన వ్యక్తికి, కుటుంబ సభ్యులకు మధ్య నలిగిపోకుండా సమతుల్యం పాటించడం ఒక పెద్ద సవాల్. ఇద్దరూ కలిసి ఒక జట్టుగా నిలబడి, కుటుంబ సభ్యులకు ప్రేమగా నచ్చజెబుతూ, తమ బంధాన్ని కాపాడుకోవాలి.

అహంకారాల ఘర్షణ - ప్రేమను గెలిపించడం

నేను గొప్ప, నాదే కరెక్ట్ అనే అహం బంధానికి అతిపెద్ద శత్రువు. చిన్న చిన్న విషయాలకే ఇగోలకు పోతే, ప్రేమ దూరమవుతుంది. తప్పు జరిగినప్పుడు క్షమించమని అడగడానికి, భాగస్వామి కోసం కొన్నిసార్లు తగ్గడానికి సిద్ధంగా ఉండాలి. గర్వాన్ని పక్కనపెట్టి, ప్రేమను గెలిపించడమే ఈ పరీక్ష ఉద్దేశ్యం.

Take a Poll

విభిన్న లక్ష్యాలు - మధ్యే మార్గాన్ని కనుగొనడం
ఇద్దరు వ్యక్తులకు వేర్వేరు ఆశయాలు, లక్ష్యాలు ఉండటం సహజం. ఇందులో తప్పేమీ లేదు. ఒకరికి కెరీర్ ముఖ్యమైతే, మరొకరికి ప్రశాంత జీవితం ముఖ్యం కావచ్చు. ఇలాంటి సమయంలో ఒకరి లక్ష్యాలను మరొకరు గౌరవించుకుంటూ ఇద్దరి కలలూ నెరవేరేలా ఒక మధ్యే మార్గాన్ని కనుక్కోవాలి. సర్దుకుపోవడం కాదు, అర్థం చేసుకుని కలిసి నడవడమే ఇక్కడ ముఖ్యం.

సహనం - ప్రేమ పరిపక్వం చెందడానికి సమయం ఇవ్వడం
ప్రేమ అనేది ఒక మొక్క లాంటిది. అది పెరిగి, బలమైన వృక్షంగా మారడానికి సమయం పడుతుంది. ప్రతిరోజూ ఉత్సాహంగా, కొత్తగా ఉండకపోవచ్చు. బంధంలో నిరాశ, నిస్పృహలు ఎదురైనప్పుడు సహనంతో వేచి ఉండాలి. ఓపికతో ఒకరికొకరు అండగా నిలబడితే, మీ ప్రేమ కాలంతో పాటు మరింత లోతుగా, బలంగా తయారవుతుంది.

ఈ పరీక్షలు మీ బంధాన్ని విడదీయడానికి వచ్చేవి కావు, మీ మధ్య ఉన్న ప్రేమను లోకానికి చాటి చెప్పడానికి వచ్చే అవకాశాలు. ఈ సవాళ్ళను మీరు ఒంటరిగా కాకుండా, ఇద్దరూ కలిసి ఎదుర్కొన్నప్పుడు, మీ అనుబంధం మరింత బలపడుతుంది.

Story first published: Sunday, September 21, 2025, 18:11 [IST]
Desktop Bottom Promotion