సంసారం సుఖంగా సాగిపోవాలంటే..పెళ్లికి ముందే భాగస్వామిని ఈ ప్రశ్నలు అడగాల్సిందే!

వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప మలుపు. అమ్మాయి,అబ్బాయి ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి అనే సంప్రదాయంతో ఒక్కటయ్యే మధురమైన వేడుక. ఒక్కసారి దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టాక తుదిశ్వాస వరకు ఒకరికొరు తోడునీడగా ఉంటూ కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలి. చాలా వివాహాలు విజయవంతమవుతాయి.. అయితే ఈ రోజుల్లో పెళ్లి అయిన గంటల వ్యవధిలోనే విడాకులు జరుగుతున్న సంఘటనలు అనేకం చూస్తున్నాం. ప్రేమ పెళ్లిళ్లు కూడా మూడు ముళ్లు పడ్డ కొద్ది రోజుల్లోనే విచ్చిన్నం అవుతున్నాయి. వీటిలో చాలా వరకు కారణం సరైన అనుకూలత లేకపోవడమే.

ప్రేమ పెళ్లిల్లో అయితే కొంతవరకు భాగస్వామి గురించి పెళ్లికి ముందే తెలిసే అవకాశం ఉంటుంది..ప్రేమ వివాహంలో అబ్బాయి, అమ్మాయి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి తగినంత సమయం ఉంటుంది, కానీ పెద్దలు కుదిర్చిన వివాహంలో ఇది సాధ్యం కాదు. అందుకే పెద్దలు కుదిర్చిన వివాహం అయితే జీవిత భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు తొందరపడకూడదు..లేకపోతే భవిష్యత్తులో సంబంధం విచ్ఛిన్నం కావచ్చు. వివాహం చేసుకునే వ్యక్తి తన భవిష్యత్తు భాగస్వామి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. భవిష్యత్తులో సంబంధాన్ని బలంగా ఉంచుకోవడానికి మీరు పెళ్లికి ముందే మీ కాబోయే భాగస్వామిని ఖచ్చితంగా కొన్ని ప్రశ్నలు అడగాలి. అవేంటో ఇక్కడ చూడండి.

ముందుగా ఈ ప్రశ్న అడగడం చాలా ముఖ్యం
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రపంచంలోనే ఉత్తమ భాగస్వామి దొరకాలని కోరుకుంటారు, కానీ పెళ్లి చేసుకునే వ్యక్తి దానికి అంగీకరించడం చాలా ముఖ్యం. కాబట్టి మీరు వివాహం చేసుకోబోయే వ్యక్తిని అడగవలసిన మొదటి ప్రశ్న ఏమిటంటే..ఆ వ్యక్తి ఈ వివాహానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నారా, వారిపై ఏదైనా ఒత్తిడి ఉందా అనేది. చాలా సార్లు అబ్బాయి లేదా అమ్మాయి కుటుంబ ఒత్తిడితో వివాహం చేసుకుంటారు, కానీ ఆ సంబంధం భవిష్యత్తును భద్రపరచడం కష్టమవుతుంది.

మీ భాగస్వామి నుండి ఏమి ఆశిస్తున్నారు?
వివాహానికి ముందు అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ తమ భవిష్యత్తు భాగస్వామి ఎలాంటి జీవిత భాగస్వామిని కోరుకుంటున్నారో.. అంటే వారి మనస్సులో భాగస్వామి గురించి ఎలాంటి ఇమేజ్,అంచనాలు ఉన్నాయో ప్రశ్నించుకోవడం చాలా ముఖ్యం. దీని వల్ల వారి ఆలోచనలు మీకు సానుకూలంగా వర్తిస్తాయో లేదో మీకు తెలుస్తుంది.

ఈ ఇష్టాలు, అయిష్టాల గురించి తెలుసుకోవడం ముఖ్యం
వివాహం తర్వాత బట్టల రంగు లేదా సందర్శించడానికి ఇష్టమైన ప్రదేశాల గురించి తెలుసుకోవడానికి ఎల్లప్పుడూ సమయం ఉంటుంది కానీ మీ భాగస్వామి ఫుడ్ సెలక్షన్ గురించి తెలుసుకోవడం మీకు చాలా ముఖ్యం. అంటే వారు శాఖాహారం లేదా మాంసాహార ఆహారాన్ని ఇష్టపడుతున్నాడా లేదా అనేది తెలుసుకోవాలి. దీంతో పాటు మీ భాగస్వామికి స్మోకింగ్ అలవాటు ఉందా లేదా అనేది కూడా అడగండి.ఒకవేళ అలవాటు ఉంటే ఎంత తాగుతాడో అడగండి. ఈ ప్రశ్నలకు సమాధానాలతో మీకు సరైన భాగస్వామిని మీరు ఎంచుకోగలుగుతారు.

పెళ్లి తర్వాత కెరీర్ ఎలా ఉంటుంది?

ఈ రోజుల్లో,చాలా మంది అమ్మాయిలు ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి అమ్మాయిలు పెళ్లికి ముందు ఈ ప్రశ్న అడగాలి. వారు తమ కెరీర్ లేదా ప్రస్తుతం వారు చేస్తున్న ఏదైనా ఉద్యోగం చేయాలనుకుంటే వివాహం తర్వాత వారి భాగస్వామి దాని గురించి ఏమనుకుంటారు అని పెళ్లికి ముందే అడగాలి. చాలా సార్లు బాధ్యతలు, భాగస్వామి, కుటుంబం కారణంగా, అమ్మాయిలు తమ కెరీర్‌తో రాజీ పడాల్సి వస్తుంది. ఉద్యోగం మానేసి ఇంట్లోని కుటుంబసభ్యులు, పిల్లలను చూసుకోవాల్సి ఉంటుంది.

ఉమ్మడిగా,విడిగానా
ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు సినిమాల్లో మాత్రమే చూడగలుగుతున్నాం. పెళ్లి అయ్యిందంటే చాలు తల్లిదండ్రుల నుంచి విడిపోయి వేరు కాపురం పెట్టేస్తున్నారు. అయితే కొందరు ఇప్పటికీ ఉమ్మడి కుటుంబాలకే విలువ ఇస్తున్నారు. మీ భాగస్వామిని పెళ్లికి ముందు నీకు ఉమ్మడి కుటుంంలో ఉండటం ఇష్టమా లేక సపరేట్ గా ఉండటం ఇష్టమా అని ఖచ్చితంగా అడగాలి. మీ భాగస్వామిని ఈ ప్రశ్న అడగకుండా ఉంటే పెళ్లి తర్వాత ఉమ్మడి కుటుంబంలో ఉండటం వారికి ఇష్టం లేకుంటే అది పెద్ద గొడవలకు దారి తీసే ఛాన్స్ ఉంటుంది.

Desktop Bottom Promotion